
చెన్నై : తనతో సహా అందరం ఆస్పత్రిలో ఉన్న నాటి ముఖ్యమంత్రి దివంగత నేత జయలలితను చూశామని సహకారశాఖ మంత్రి సెల్లూర్ కే రాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తామంతా వెళ్లామని, ఆమెను పరామర్శించామని తెలిపారు. 'నాతో సహా మంత్రులందరం ఆస్పత్రిలో అమ్మను కలిశాం' అని ఆయన చెప్పారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి దిండిగల్ సీ శ్రీనివాసన్ మాట్లాడుతూ తామెవరం అమ్మను చూడలేదని, ప్రజలకు తాము అబద్ధం చెప్పామంటూ బాంబు పేల్చిన విషయం తెలిసిందే.
అమ్మ కోలుకుంటున్నారని, తాము మాట్లాడామని, ఇడ్లీ కూడా తింటున్నారని చెప్పిన విషయాలన్నీ కట్టుకథలని, ఇలా చెప్పినందుకు ప్రజలు తమను క్షమించాలని ఆయన అన్నారు. దీంతో పళనీస్వామి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. జయలలిత మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఒకే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు వేర్వేరు వ్యాఖ్యలు చేయడం తమిళనాడు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.