నవ జంటకు సీఎం స్టాలిన్ ఆశీర్వాదం, హాజరైన ఆహుతులు
379 జంటలకు సామూహిక వివాహాలు
చైన్నెలో ఏకమైన 31 జంటలు
హిందూ దేవదాయ శాఖ నేతృత్వంలో కల్యాణం
సీఎం సమక్షంలో వేడుక
పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలని పిలుపు
హిందూ దేవదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో సామూహిక వివాహ మహోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. 379 జంటలకు ఆలయాలలో వివాహాలు జరిపించారు. అన్ని రకాల వస్తువులతో సారెను అందజేశారు. చైన్నెలో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలు ఏకమయ్యాయి. పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని ఈసందర్భంగా స్టాలిన్ వధూవరులకు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, చైన్నె: డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం హిందూ దేవదాయ శాఖ ద్వారా ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ పనులు, భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన, ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకోవడం, విద్యా కార్యక్రమాలు, పండుగుల సమయంలో ఆధ్యాత్మిక పర్యటనలు అంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన జంటలకు వివాహాలను జరిపించే విధంగా ముందుకెళ్తోంది. ఆ దిశగా 2022–2023 సంవత్సరం 500 జంటలకు, 2023–2024 సంవత్సరం 600 జంటలకు వివాహం జరిపించారు. ఒక్కో జంటకు నాలుగు గ్రాముల బంగారం తాళిబొట్టు,రూ. 50 వేలు విలువగల గృహోపకరణ వస్తువులు, ఇతర అన్నిరకాల వస్తువులను పంపిణీ చేశారు. 2024–25లో 700 జంటలకు వివాహం జరిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో 379 జంటలకు సోమవారం రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరిగాయి. వీరికి నాలుగు గ్రాముల బంగారం తాళితోపాటు రూ. 60 వేల విలువైన వివిధ రకాల వస్తువులను సారెగా అందజేశారు. మంచం, బీరువా, పరుపు, దిండ్లు, వంట గ్యాస్ స్టవ్, వెట్ గ్రైండర్, మిక్సర్,కుక్కర్, వంటపాత్రలు తదితర వాటిని సారెగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శేఖర్ బాబు, పొన్ముడి, ఎం.సుబ్రమణియన్, శ్రీపెరంబదూరు ఉలగార్య రామానుజ ఎంబార్ జీయర్‌స్వామి, తొండై మండలం ఆధీనం చిదంబరనాథ జ్ఞాన ప్రకాశ దేశిక పరమాచార్య స్వామి, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, మేయర్ ఆర్. ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, అసన్ మౌలానా, జగన్, జోసెఫ్ శామ్యూల్, అరవింద్ రమేష్, ప్రభాకర్ రాజ, దేవాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, కమిషనర్ శ్రీధర్, అదనపు కమిషనర్ సుకుమార్ పాల్గొన్నారు.
అందమైన తమిళ పేర్లు పెట్టండి..
చైన్నెలో తిరువాన్మీయూరు మరుదీశ్వరర్ ఆలయంలో వివాహ వేడుక కోలాహలంగా సాగింది. ఇక్కడ సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహాలు జరిగాయి. అనంతరం ఆయా జిల్లాలో ఎంపిక చేసిన ప్రధాన ఆలయాలలో మిగిలిన జంటలకు వివాహాలు జరిగాయి. నవ వధువరులకు తాళిబొట్టును సీఎం అందజేశారు. వివాహ అనంతరం వారికి అన్నిరకాల వస్తువులతో సారెను అందజేశారు. నవ దంపతులను సీఎం ఆశీర్వదించిన అనంతరం ప్రసంగిస్తూ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే అత్యధికంగా హిందూ మత ధర్మాదాయ శాఖ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు వివరించారు. ఇందుకు కారణం ఆ శాఖ మంత్రిగా ఉన్న శేఖర్ బాబు అని, ప్రతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందేనని , కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా హాజరు కావాలని పట్టుబట్టే వారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. ధార్మిక రంగంలోనే కాదు, అన్నిరంగాలకు రాష్ట్రంలో తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మూడేళ్లలో ఈ శాఖ తరపున వివిధ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. 2,226 ఆలయాలకు కుంభాభిషేకం, 10,238 దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు జరిగినట్లు పేర్కొన్నారు. దాతల నుంచి విరాళంగా సేకరించిన రూ. 1,103 కోట్లతో 9,163 పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో 6,792 కోట్లు విలువైన భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రామేశ్వరం, కాశీ ఆధ్యాత్మిక యాత్రలు, వృద్ధులకు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నామని పేర్కొన్నారు. బంగారం పెట్టుబడి పథకం, దేవాలయాలలో తమిళంలో అర్చనలు వంటి అంశాలను ఈసందర్భంగా గుర్తుచేశారు. అన్ని మతాలను, అందరినీ సమానంగా గౌరవించే విధంగా వారి హక్కులను పరిరక్షించే రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఇదే ద్రవిడ మోడల్ పాలన అని సగర్వంగా చెప్పుకుంటున్నామని, అయితే ఆలయాలు, భక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి అస్త్రాలు వెతుకుంటున్న వాళ్లు కూడా ఈరాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏకమైన కొత్త జంటలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, సకల సౌభ్యాగాలతో జీవితం ఆనందమయం చేసుకోవడమేకాకుండా పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment