
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటి వరకు వారిద్దరు మహానటులు. ఇటీవలె ఆ ఇద్దరు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఒకరికొకరు కలిసి పనిచేస్తారో.. కలహించుకుంటారో భవిష్యత్తే సాక్ష్యంగా నిలవనుండగా తొలిసారి వారు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇప్పటి వరకు సినిమా హీరోలుగా వేదికలు పంచుకోనున్న ఆ ఇద్దరు మొట్టమొదటిసారి రాజకీయ నాయకులుగా మారిన తర్వాత కలుస్తున్నారు. వారే తమిళ దిగ్గజాలు రజనీకాంత్, కమల్‌హాసన్. అవును.. త్వరలో నడిగార్ సంఘం (ఆర్టిస్ట్స్ అసోసియేషన్) త్వరలో మలేషియాలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కమల్, రజనీ ఒకే వేదికపై ఆశీన్నులవనున్నారు. నడిగార్ సంఘం నిర్వహించే వేడుకకు చాలాకాలం తర్వాత వీరిద్దరు హాజరుకానున్నారు. ఇదే వారికి నాయకులు అయిన తర్వాత తొలి వేదికను పంచుకున్న చోటుగా చరిత్రలో నిలవనుంది.
రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రజనీ మాత్రం తనవి ఆధ్యాత్మిక రాజకీయాలు అని చెప్పారు. అంటే ఏమిటీ అనే విషయం మాత్రం వివరించలేదు. కుల రాజకీయాలకు స్వస్తి పలికేలా రజనీ రాజకీయాలు ఉంటాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్న రజనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా డబ్బు, హోదా దర్పం ప్రదర్శించడం మనకు కనిపించదు. ఒక సన్యాసిలా ఆయన దర్శనం ఇస్తుంటారు. ఇక కమల్ విషయం ఇందుకు విరుద్ధం. ఆయన ప్రత్యేకంగా హేతువాది. నాస్తికుడు కూడా. ఆయన నమ్మకాలను వెల్లడించడంలో ఏమాత్రం మొహమాటపడని వ్యక్తి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఎప్పుడో తన కులాన్ని వదిలేశాడు. ఆయనకు పెరియార్, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మంచి అభిమానం. రెండు విరుద్ధ భావాలు గల ప్రముఖ వ్యక్తులు నటులుగా కాకుండా రాజకీయ నాయకులుగా వేదిక పంచుకోనుండటం ఇప్పుడు విశేషంగా మారబోతోంది.