భుస్సీ ఆనంద్
విజయ్‌ను సీఎం చేద్దాం
నేతలకు భుస్సీ ఆనంద్ పిలుపు
సాక్షి, చైన్నె: ఎన్నికలకు 15 నెలలే సమయం ఉంది...రేయింబవళ్లు శ్రమిద్దాం.. విజయ్‌ను సీఎం చేద్దాం అని పార్టీ నేతలకు తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆదేశాలతో నియోజకవర్గ నేతలతో తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సమీక్షలపై దృష్టి సారించారు.
చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాల విస్తృతానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం తిరువణ్ణామలై జిల్లా పరిధిలోని చెయ్యారు, ఆరణి, పోలూరు, వందవాసి, కలశసాక్కం, కీల్ పెన్నాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వం, పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి బుస్సీ ఆనంద్ వివరించారు. నియోజకవర్గాల వారీగా పట్టున్న ప్రాంతాలు, బలం కలిగిన నేతలు,తదితర వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలలుమాత్రమే సమయం ఉందని వివరించారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రతి కార్యకర్త,నాయకుడు రేయింబవళ్లు శ్రమించాల్సిన అవసరం ఉందని సూచించారు. అహర్నిషలు శ్రమించడం ద్వారా విజయ్‌ను సీఎం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
విజయ్ సూచించే అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాలలో తీవ్రంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోండడంతో కార్యక్రమాల వేగం మరింత పుంజుకోవాలని, అందర్నీ కలిసేందుకు త్వరలో విజయ్ నియోజకవర్గాలకు వస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment