
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటక, తమిళనాడులకు కావేరీ నదీజలాల పంపిణీ కోసం కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేయాలంటూ అన్నాడీఎంకే మంగళవారం తమిళనాడులో రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మంత్రులు చెన్నైలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయని కేంద్రం వైఖరిని నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీలు, రైతు, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాయి. వాణిజ్య సంఘాల పిలుపుతో 30,000 ఫార్మసీ దుకాణాలతోపాటు అన్ని రకాల అంగళ్లు మూతపడ్డాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వ అడుగులకు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే మడుగులు ఒత్తుతోందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. చెన్నైలో డీఎంకే చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. దీక్షల పేరుతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కపటనాటకం ఆడుతున్నారని ఆరోపించారు.
‘కావేరి’ పిటిషన్లపై 9న విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పష్టత కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 9న విచారించనుంది. కావేరి బోర్డును ఏర్పాటు చేయడంపై సంబంధిత రాష్ట్రాల వాదనలను కేంద్రం తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఈ నెల 9న తమిళనాడు పిటిషన్‌తోపాటే కేంద్రం పిటిషన్‌నూ విచారిస్తామని కోర్టు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment