సవాళ్లకు .. సంసిద్ధం | - | Sakshi
Sakshi News home page

సవాళ్లకు .. సంసిద్ధం

Published Tue, Oct 1 2024 3:10 AM | Last Updated on Tue, Oct 1 2024 7:39 PM

అధికారులు, మంత్రులతో సీఎం స్టాలిన్‌ సమావేశం

అధికారులు, మంత్రులతో సీఎం స్టాలిన్‌ సమావేశం

‘ఈశాన్య’ విపత్తులను సమన్వయంతో ఎదుర్కొందాం! 

ముందు జాగ్రత్తలు మరింత విస్తృతం చేయాలి 

వలంటీర్లతో రెస్క్యూ టీంలు 

విపత్తులు ఎదురైనా ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వొద్దు 

అధికారుల సమీక్షలో సీఎం స్టాలిన్‌ 

ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో ఎదురయ్యే విపత్తులను సమష్టిగా సమన్వయంతో.. ఎదుర్కొందామని అధికారులకు సీఎం స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తలు మరింత విస్తృతం కావాలని, స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో ప్రత్యేక సహాయక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విపత్తులు ఎదురైన పక్షంలో ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వొద్దని, ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల రూపంలో ఈ ఏడాది తమిళనాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి సచివాలయంలో అధికారులతో సీఎం స్టాలిన్‌ సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ముఖ్యశాఖల మంత్రులు, ప్రధా న, అదనపు కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి ముందే అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తలను విస్తృతం చేయాలని సూచించా రు. జాగ్రత్తగా ఉంటే ఎంతటి విపత్తు ఎదురైనా ప్రా ణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు వీ లుంటుందన్నారు. గత మూడేళ్ల కాలంలో ఈశాన్య రుతు పవనాలతో ఎదురైన విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది నైరుతి రూపంలో ఇంకా వర్షాలు పడుతున్నాయని గుర్తుచేస్తూ, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఈశాన్యం రూపంలో మరింత వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వచ్చి ఉన్నాయన్నారు.

సురక్షితంగా..

వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా సమష్టిగా పనిచేసి ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిర్చారు. అవసరమైన చోట్ల ఉందుగానే మోటరు పంపు సెట్లు, జేసీబీలు, బోట్లను సిద్దంచేసి ఉంచుకోవాలన్నారు. వివిధ వరద నివారణ పనులు త్వరగా ముగించాలని, జిల్లాల వారీగా సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ ముందు జాగ్రత్తలను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. ప్రధానంగా చైన్నెలో మెట్రోపాలిటన్‌ చైన్నె కార్పొరేషన్‌లోని అన్ని జోన్‌లకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. వరద నియంత్రణ పనులే కాదు. ఇతర సహాయకాల నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా? అని ఈ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వరదల సీజన్‌ వస్తే నీటి పరివాహక ప్రదేశాలపై మరింత దృష్టి పెట్టాలని, పిల్లలు ఎవ్వరూ అటు వైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వ వద్దని కోరారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వరదలు తుఫానులు వంటి విపత్తుల సమాచారం బదిలీలు, విద్యుత్‌ సేవలకు ఆటంకం అనేది ముఖ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సురక్షితమైన తాగునీరు, పాలు ఆహార పదార్థాల కొరత అన్నది లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్‌ చోటు చేసుకోకుండా, అంటు వ్యాధులు వ్యాపించకుండా ప్రజారోగ్య సేవ విభాగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయడం ద్వారా మాత్రమే ఎలాంటి విపత్తులు, సవాళ్లను ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. అలాగే, విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవకులు, వలంటీర్ల పాత్ర కూడా ఎంతో కీలకం అని, రెస్క్యూ బృందాలతో కలిసి వలంటీర్లు పనిచేసే విధంగా ప్రత్యక చర్యలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పనిచేయడం ద్వారా 100 శాతం విజయం సాధించగలమని, రుతు పవనాలసీజన్‌లో సవాళ్లను ఎదుర్కొని, ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే వేదిక మీద నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.

సకాలంలో సమాచారం..

ప్రజలకు సకాలంలో, వాతావరణ సూచనలు, సమాచారం చేర వేయడం ద్వారా పెద్ద ఎత్తుననష్టాలను నివారించేందుకు వీలుందన్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలను సకాలంలో చేర వేయడమేనని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లో ప్రస్తుతం ఆధునిక సౌకార్యలను కల్పించి ఉన్నామని వివరిస్తూ, ఇక్కడ పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తారని, ఇదే సమన్వయం అన్ని జిల్లాలలోనూ ఉండాలని ఆదేశించారు. ఎంత వర్షం పడింది? ఎం జరుగుతోంది? అన్నది సకాలంలో తెలిస్తే, డ్యామ్‌లలో నీటి విడుదల నిర్వహణ, వరద హెచ్చరికల సమాచారంతో సహా వివిధ విధులను సక్రమంగా నిర్వహించ గలిగేందుకు వీలుంటుదన్నారు. 100 ఆటోమేటిక్‌ రెయిన్‌ గేజ్‌లు, ఆటోమేటిక్‌ వాతావరణం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రియల్‌ టైమ్‌ సమాచారం పొందుతున్నామని గుర్తు చేస్తూ, ఈ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే వారు వారి జాగ్రత్తలలో ఉంటారని వ్యాఖ్యలు చేశారు. సమాచారాన్ని తమిళంలో తెలుసుకునేందుకు ప్రభుత్వం టీఎన్‌ అలర్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను సిద్ధం చేసిందని ప్రకటించారు. చైన్నెతో సహా నగరాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, దేశానికే ఆదర్శంగా నిలిచిన మెట్రోపాలిటన్‌ చైన్నె కార్పొరేషన్‌లో ప్రాంతాలు, వార్డులు, వీధుల వారిగా వరద హెచ్చరికల సమాచారాలను సకాలంలో అందించాలని, వరద ముంపు ఎదురైన పక్షంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, బిడ్డల తల్లులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

వాతావరణ మార్పులతో..

గతంలో ఈశాన్య రుతుపవనాలు సీజన్‌ రాష్ట్రం అంతటా వ్యాపించేవని వివరించారు. అయితే, ఇటీవలి వాతావరణ మార్పుల నేపథ్యంలో రోజుల వ్యవధిలో ఒకే చోట మొత్తం వర్షం పడుతోందని, కొన్ని గంటల్లో ఊహించని రీతిలో వర్షపాతం నమోదు అవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి వర్షాన్ని ఎదుర్కొనడమే పెను సవాళ్లు గా మారి ఉన్నాయన్నారు. గంటల వ్యవధిలో కురిసే వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజలకే కాదు, తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలకు సైతం పెద్ద ఎత్తుననష్టం ఎదురు అవుతోందన్నారు. గత ఏడాది ఈశాన్య రుతుపవనాల సమయంలో చైన్నె, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి భారీ వరదల రూపంలో అతి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతో ఆ జిల్లాలు త్వరితగతిన కోలుకున్నాయని వివరించారు. ఈ విపత్తులు నేర్పిన గుణపాఠంతో ముందు జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎస్‌ నేతృత్వంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాలు జరిగాయని, సమగ్ర అధ్యయనంతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారని గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement