సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవతార పురుషుడిగా చెప్పుకునే శివశంకర్ బాబ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బుధవారం అక్కడి ఖాజీయాబాద్‌లోని ఓ భక్తుడి ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలలో సోదాలు నిర్వహించారు.
ఇలా బుక్కయ్యాడు...
లైంగిక ఆరోపణలు రావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక అదృశ్యం అయ్యాడు. జార్ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ఆస్పత్రిలో గుండెపోటు చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించిన సీబీసీఐడీ విచారణ ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గం లేక ఢిల్లీలోని ఓ భక్తుడి వద్ద తలదాచుకునే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైయ్యారు.
భక్తుడి ఇంట్లో బస..
డెహ్రాడూన్‌లో ఓ భక్తురాలితో కలిసి ప్రత్యక్షమైన బాబా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయినట్టు సీబీసీఐడీ బృందం విచారణలో తేలింది. అంతే కాకుండా సాధారణ రోజుల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ భక్తుడి ఇంట్లో బస చేసే వాడని సమాచారం అందడంతో అతని ఇంటిపై నిఘా ఉంచారు. బుధవారం వేకువ జామున అక్కడికి ఈ బాబా రాగానే, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి, అనంతరం చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేశారు.
ముమ్మరంగా తనిఖీలు..
ఉండగా, కేలంబాక్కంలోని బాబుకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. 73 మంది టీచర్లు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో పలు కేసులను ఎదుర్కొంటున్న భారతి, దీపా అనే టీచర్ల వివరాలను సేకరించారు. బాబా లీలకు సంబంధించిన అనేక వీడియోలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు బయట పడినట్లు సమాచారం. ఈ పాఠశాలలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని పిల్లల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
మాజీ మంత్రికి నో బెయిల్..
నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మణికంఠన్‌పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు పీఏ, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారందరిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆయన అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మణి కంఠన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే, సాక్షుల్ని, ఫిర్యాదుదారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
బాబ్జీ మదన్ కోసం వేట..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్న అథ్లెటిక్ అకాడమి శిక్షకుడు నాగరాజన్ మీద విదేశాల్లోని ఇద్దరు తమిళనాడు క్రీడాకారిణులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాగే లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జూడో అకాడమి మాస్టర్ ఏబీన్ రాజ్‌కు చెన్నై కోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో పాటు యూట్యూబ్ ద్వారా మహిళలను అసభ్య పదజాలాలతో దూషించడం, ఆన్‌లైన్ ద్వారా నగదు వసూళ్లలో ఉన్న టాక్సిక్ మదన్ ఛానల్ నిర్వాహకుడు బాబ్జి మదన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తండ్రి, భార్య కృతికనును బుధవారం విచారించారు. కృతికను అరెస్ట్ చేశారు.
చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం
Comments
Please login to add a commentAdd a comment