సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 29వ తేదీ నుంచి డెల్టా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం రాష్ట్రంలో మరీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సాధారణ వర్ష పాతం కన్నా 39 శాతం వర్షం తక్కువగా పడ్డట్లు వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. చైన్నెలో 18 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఐదు సెంటీ మీటర్లు వర్షం మాత్రమే పడిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నైరుతి కారణంగా అత్యధిక వర్షం కన్యాకుమారిలో పడింది. ఇక్కడ సగటున 19 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. ఏకంగా 49 సెంటీ మీటర్ల వర్షం పడడం విశేషం. ఒక్క కన్యాకుమారి మినహా తక్కిన అన్ని జిల్లాలో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవడం గమనార్హం.
బలపడుతున్న ఈశాన్యం
అదే సమయంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసి ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ పవనాలు క్రమంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నెలకొన్న తుపాన్‌లు తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఈ పవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రధానంగా డెల్టాలోని తిరువారూర్, నాగపట్నం, కడలూరు, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పుదుకోట్టై, పెరంబలూరు జిల్లాలతోపాటు శివగంగై, విల్లుపురం, కళ్లకురిచ్చి తదితర 16 జిల్లాల్లో ఈనెల 29వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో ఆ జిల్లాల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
క్రమంగా విస్తరిస్తున్న
ఈశాన్య రుతుపవనాలు
నైరుతిలో సాధారణ వర్షపాతం కంటే 39 శాతం తక్కువగా వానలు
Comments
Please login to add a commentAdd a comment