
ఆక్రమణలను తొలగిస్తున్న జేసీబి
వ్యాపారుల ఆందోళనతో ఉద్రిక్తత
జేసీబీని అడ్డుకుని నిరసన
తిరువళ్లూరు: తిరుపతి – చైన్నె జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా ఉన్న దుకాణాలు, భవనాలను అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ శుక్రవారం తొలగించారు. అయితే దుకాణాలను తొలగించే సమయంలో వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో నిత్యం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌కు సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జేఎన్ రోడ్డు, సీవీనాయుడు రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం ప్రకటనలు జారీ చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, భవనాలను ఎవరికి వారే తొలగించుకోవాలని సూచించారు. అయితే వ్యాపారులు పెద్దగా స్పందించకపోవడంతో శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగింపు ప్రక్రియ చేపట్టారు.
ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించేలా ఉన్న పూల దుకాణాలు, టీస్టాల్స్, స్వీట్స్‌స్టాల్స్‌తోపాటు ఇతర వాటిని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సమయంలో ఆక్రమణలను వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. కొందరు వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వ్యాపారులను బలవంతంగా పక్కకు తప్పించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించారు.