
సేలం(తమిళనాడు): జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా వచ్చిన పాముపైకి ఎక్కించకుండా బ్రేక్ వేసి లారీని ఆపడంతో వెనుక వచ్చిన లారీ ప్రమాదానికి గురై డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు సేలం జిల్లా ఓమలూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన సంభవించింది. మూలక్కాడు ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ తంగదురై (25), అదే ప్రాంతానికి చెందిన క్లీనర్ రమేష్ (19) ధర్మపురిలో ఉన్న ఒక లారీ సంస్థలో పనిచేస్తున్నారు. వీరు గురువారం మధ్యాహ్నం ధర్మపురి నుంచి ఇనుప రేకులను ఎక్కించుకుని సేలం బయలుదేరారు. అదేవిధంగా తిరుచ్చి జిల్లా ఉసిరికి చెందిన లారీ డ్రైవర్లు ధనకుమార్, కుమార్ కర్ణాటక నుంచి మొక్క జొన్న కంకుల లోడుతో సేలంకు వస్తున్నారు. ఈ రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నాయి.
ఓమలూరు సమీపంలో దాససముద్రం వద్ద వస్తుండగా ఇనుప రేకుల లారీ ఓవర్‌టేక్ చేసి మొక్కజొన్న కంకుల లారీ ముందుకు వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో నడిరోడ్డుపైకి ఒక పాము వచ్చింది. పాము మీద లారీ ఎక్కకుండా ఉండడానికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయినప్పటికీ లారీ పాముపైకి ఎక్కి అది చనిపోయింది. ఈ క్రమంలో లారీ వెనుక వస్తున్న ఇనుప రేకుల లారీ డ్రైవర్ కూడా బ్రేక్ వేశాడు. అదే లారీలో ఉన్న ఇనుప రేకులు తీవ్ర ఒత్తిడికి లారీ క్యాబిన్ చీల్చుకుని డ్రైవర్, క్లీనర్ తలను కోసుకుని ముందుకొచ్చాయి. ఈ ప్రమాదంలో తంగదురై, రమేష్ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.