‘తమిళుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళతాం’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు ధన్యవాదాలు తెలుపుతూ, సభలో ఆయన వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయం చేయదలచుకోలేదని.. ప్రజా సంక్షేమం, తల్లి తమిళనాడును రక్షించడమే తమ ముందున్న అతిపెద్ద బాధ్యత అని ఉద్వేగంగా ప్రసంగించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూ.. అందరికీ సమ న్యాయం చేయడమే తమ లక్ష్యమని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా తమిళనాడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సభలో గవర్నర్ వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం గురించి మాట్లాడి రాజకీయం చేయదలచుకోలేదన్నారు.
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమష్టి అభివృద్ధి, సమానత్వం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి సూత్రాలను అనుసరించి ద్రావిడ మోడల్ పాలనను రూపొందించామన్నారు. ప్రజల సంక్షేమం మాత్రమే తమ ఆలోచన అని, అదే ప్రజల హృదయాలను తాము గెలుచుకున్నామని పేర్కొన్నారు. నేను అంటే ఓ వ్యక్తి కాదని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కెబినెట్, ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయనున్నామని ప్రకటించారు. కొత్తగా సీఎం గ్రామీణ రోడ్డు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు.
శక్తిమంతమైన ఉద్యమం
సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాష, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి నినాదాలతో శక్తిమంతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంగా రాజీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నామన్నారు. తమిళనాడు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యా అభివృద్ధి ఏక కాలంలో జరగాలని, తద్వారా అందరికీ మేలు జరగాలన్న కాంక్షతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమిళనాడు ప్రభుత్వం ఆశయాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను క్లుప్తంగా పేర్కొన్నామని వివరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకు, బలాన్ని చాటేందుకు, శతాబ్దాల చరిత్ర కలిగిన అసెంబ్లీ విలువలను నిలబెట్టే విషయంలో వెనకడానని, ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూక్తులు, తమిళ కవిత్వాలను క్రోడీకరించారు.
నిరంతరం శ్రమిస్తున్నాం...
గడిచిన ఏడాదిన్నర కాలం తమిళనాడుకు సువర్ణ యుగాన్ని తలపించే రోజులు అని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కరోనా బారిన ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించామని, తాను సైతం అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన గదిలో ఓ ‘డ్యాష్ బోర్డ్ ‘ ఉందని, ప్రతి రోజు అందులోకి వచ్చే సమాచారాలను, వివరాలను పరిశీలించి ఆయా శాఖల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో తన పర్యటనలు, ప్రభుత్వ ప్రగతి, నిధుల కేటాయింపు, తదితర అంశాలను సభకు సీఎం వివరించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ద్రావిడ మోడల్ పాలనకు లభించిన ఫలితం ఇది అని పేర్కొన్నారు.
పథకాల విస్తరణ..
రాష్ట్రంలోని 1,545 పాఠశాలల్లో అల్పాహారం పథకం అమల్లో ఉందని.. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఈ పథాకాన్ని అమలు చేస్తామన్నారు. 15 నెలల వ్యవధిలో రైతులకు లక్షా 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం పేరిట ప్రత్యేక పథకం అమలు చేయనున్నామన్నారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లతో 10 వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మసీదులకు ఇది వరకు రూ. 6 కోట్లు రాయితీలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను రూ. 10 కోట్లకు పెంచుతున్నటు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు 2024 జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడి పాలసీలు, మౌలిక వసతులను పెట్టుబడిదారులకు తెలియజేయడానికి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వందకుపైగా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఈ మహానాడుకు ఆహ్వానించనున్నామన్నారు.
మరిన్ని ముఖ్యాంశాలు
- కృష్ణగిరి, హోసూరు మధ్య వర్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని మంత్రి తంగం తెన్నరసు తెలిపారు.
- పుదుకోటైను కార్పొరేషన్‌గా మార్చబోతున్నామని మంత్రి కేఎన్ నెహ్రు అన్నారు.
- సీఎం బీమా పథకం అమల్లో దేశంలో తమిళనాడు రికార్డు సృష్టించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ వివరించారు.
- ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.2,37,850 కోట్లతో పనులు చేపట్టామని.. శరవేగంగా జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు.
- ఈ ఏడాది 316 విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు.
- అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి పేర్కొన్నారు. చివరగా సభలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో సవరణలతో పాటు మరికొన్ని ముసాయిదాలు ఆమోదం పొందాయి. అనంతరం సభను స్పీకర్ అప్పావు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment