
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సోమవారం చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. భగవద్గీతలోని సూక్తులను గుర్తు చేస్తూ ట్వీట్ ఉండడం..నలుగురు మంత్రులు పళనితో భేటీ కావడం గమనార్హం. ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పేరు ప్రకటనతో కుర్చీ కొట్లాటకు ముగింపు పలకాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే తేనిలో తిష్ట వేసిన పన్నీరు సెల్వం మూడు రోజులుగా పార్టీ వర్గాలతో సుదీర్ఘ మంతనాల్లో మునగడంతో కుర్చి వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్ర మంత్రులంతా చెన్నైలోనే ఉండాలన్న ఆదేశాలు జారీ కావడంతో చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో సోమవారం పన్నీరు సెల్వం చేసిన ఓ ట్వీట్ అన్నాడీఎంకే రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. (కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు)
ట్వీట్ సారాంశం
‘ఏది జరిగిందో అది బాగానే జరిగింది...ఏది జరుగుతుందో అది బాగానే జరుగుతుంది..ఏది జరగబోతుందో అది బాగానే జరగబోతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇది వరకు నిర్ణయం తీసుకునే వాడినని.. అదే తరహాలో తదుపరి అడుగు.. నిర్ణయం ఉంటుందని ముగించారు. తేనిలో మూడు రోజుల మంతనాలను ముగించుకున్న పన్నీరు చెన్నైకు తిరుగు పయనమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రులు జయకుమార్, ఆర్‌బీ ఉదయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ, వెల్లమండి నటరాజన్‌లు సీఎం పళనిస్వామితో భేటి కావడం మరింత ఆసక్తిని పెంచింది. యువత మద్దతు పళనికే అని కేటీ రాజేంద్ర బాలాజీ చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment