కల చెదిరింది.. వ్యథ మిగిలింది | Arson in Sathyabama University after student commits suicide | Sakshi
Sakshi News home page

కల చెదిరింది.. వ్యథ మిగిలింది

Published Fri, Nov 24 2017 11:45 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Arson in Sathyabama University after student commits suicide - Sakshi

చదువులో ఆమె ముందంజలో ఉండేది. చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో స్థిరపడాలని కలలు కనేది. లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అహరహం శ్రమించేది. పరీక్షల్లో కాపీ కొట్టిందనే అభియోగం మోపి హాల్‌నుంచి బయటకు నెట్టేయడంతో అవమానానికి గురైంది. ఎలాంటి తప్పు చేయకపోయినా శిక్ష పడినందుకు కుమిలిపోయింది. చెన్నైలోని సత్యభామ డీమ్డ్‌ యూనివర్సిటీలో చదువుల తల్లి మౌనిక కలత చెందింది. యూనివర్సిటీ యాజమాన్యం పుణ్యమా అని ఆమె కల చెదిరిపోయింది. అవమాన భారాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి చావే శరణ్యమనుకుంది. ఉరి తాడును ఆశ్రయించి చివరకు వ్యథను మిగిల్చింది.

డక్కిలి: ‘అమ్మా.. పరీక్షలు బాగా రాస్తున్నావా.. ప్రిపరేషన్‌ ఎలా ఉంది’ ఆ తల్లిదండ్రులు బిడ్డకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ‘బాగా ప్రిపేరయ్యా. మంచి మార్కులొస్తాయ్‌’ అనే సమాధానం విని అమ్మానాన్నలు ఆనంద డోలికల్లో తేలియాడారు. ఎప్పుడూ చదువులో ముందుండే తమ బిడ్డ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని, భవిష్యత్‌లో ఉన్నత స్థితికి చేరుతుందని పొంగిపోయారు. కొంతసేపటికే ఓ దుర్వార్త వారి చెవినపడింది. తమ బిడ్డ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ‘మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా తల్లీ’ అంటూ గుండె పగిలేలా రోదిస్తున్నారు.

చెన్నైలోని సత్యభామ డీమ్డ్‌ యూనివర్సిటీలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న దువ్వూరు రాగమౌనికారెడ్డి (18) బుధవారం మధ్యాహ్నం హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్ప డిన ఉదంతం నెల్లూరు జిల్లా వాసులను కలచివేసింది. డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన రాజారెడ్డి, వాణిశ్రీ దంపతులకు మౌనికారెడ్డి, రాకేష్‌రెడ్డి కవల పిల్లలు జన్మించారు. వారి చదువుల నిమిత్తం ఆ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. పిల్లలిద్దరూ చెన్నైలోని సత్యభామ డీమ్డ్‌ యూనివర్సిటీలో చదువుతామని కోరడంతో.. తల్లిదండ్రులు వారిద్దరినీ బీటెక్‌లో చేర్పించారు. మౌనిక్‌ సెమిస్టర్‌ పరీక్షలో కాపీ కొట్టిందనే అభియోగం మోపిన ఇన్విజిలేటర్‌ అందరిముందూ అవమానించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే హాస్టల్‌ గదికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చదువులో జెమ్‌
రాగ మౌనికారెడ్డి ప్రాథమిక స్థాయి నుంచి చదువులో ముందుంటూ మంచి మార్కులు తెచ్చుకునేది. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్‌లో చదవుతూ పదో తరగతి పరీక్షల్లో  9.2 గ్రేడ్‌ సాధించింది. అదే కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చేసిన మౌనిక 900 మార్కులు సాధించింది. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలోనే తాము బీటెక్‌ చేస్తామని మౌనిక, ఆమె తమ్ముడు రాకేష్‌రెడ్డి పట్టుబట్టడంతో సరేనన్న తల్లిదండ్రులు ఇద్దరినీ అక్కడే చేర్పించారు.

‘ఐ మిస్‌ యూ ఆల్‌’
బిడ్డకు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్న కొద్దిసేపటికే ఆమె మరణించిందనే విషయం తెలిసి మౌనిక తల్లిదండ్రులు రాజారెడ్డి, వాణిశ్రీ కుమిలిపోయారు. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్నేహితులకు ‘ఐ మిస్‌ యూ ఆల్‌.. ఐ లవ్‌ యూ ఆల్‌’ అంటూ మెసేజ్‌ పంపింది. అదే కళాశాలలో చదువుతున్న మౌనిక తమ్ముడు రాకేష్‌రెడ్డి ఆ మెసేజి చూసి క్షణాల్లోనే ఆమె ఉంటున్న హాస్టల్‌ గదికి చేరుకున్నాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. మౌనిక మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పొంగుకొచ్చిన దుఃఖంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల మొదటి రోజునే ఇన్విజిలేటర్‌ మౌనికపై కాపీయింగ్‌ అభియోగం మోపి పరీక్ష హాల్‌ నుంచి బయటకు పంపారు. వాస్తవానికి పరీక్ష హాల్‌ నుంచి విద్యార్థిని బయటకు పంపించాలంటే విభాగాధిపతి అనుమతి ఉండాలి. అయితే ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం ప్రదర్శించి మౌనికను బయటకు పంపడం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడితే ఆ విషయాన్ని ఇన్విజిలేటర్‌ యాజమాన్యం దృష్టికి వెంటనే తీసుకెళ్లాలి. అనంతరం యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంటుంది. మౌనిక విషయంలో ఇలాంటివేమీ జరగలేదు. బిడ్డ మరణించిం దన్న సమాచారం అందుకున్న మౌనిక తల్లిదండ్రులు హుటాహుటిన సత్యభామ యూనివర్సిటీకి చేరుకుని ఆమె మృతికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కళాశాల యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మౌనిక మరణానికి యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

మాటుమడుగులో విషాద ఛాయలు
మౌనిక మృతదేహానికి గురువారం మధ్యాహ్నం చెన్నైలోని రాయపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం సొంతూరు మాటమడుగుకు తరలించారు. ఆమె కడసారి చూపుకోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది తరలి వచ్చారు. మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు.

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని..
ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనేది మౌనిక లక్ష్యం. ఇంజినీరింగ్‌ పూర్తయిన అనంతరం ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొంది.. ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించేది. ఇదే విషయాన్ని బంధువులు, స్నేహితులకు తరచూ చెబుతుండేదని గ్రామస్తులు తెలిపారు. స్నేహితులు, బంధువులతో ఎంతో ఆప్యాయంగా ఉండేదని, అలాంటి బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయని మాటుమడుగు కంటతడి పెడుతూ చెప్పారు.

కౌన్సెలింగ్‌ ఇస్తే బతికేది
మౌనిక పరీక్షల్లో కాపీ కొట్టిందని చెబుతున్న యూనివర్సిటీ యాజమాన్యం అనంతరం ఆమె విషయంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు. మౌనిక తప్పు చేసివుంటే.. అందరి ముందూ కాకుండా పక్కకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఉంటే ఆమె బతికి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆమె అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. తన కూతురి ఆత్మహత్యకు యూనివర్సిటీ యాజ మాన్యమే కారణమని మౌనిక తండ్రి రాజారెడ్డి ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చదువులతల్లి నేల రాలింది
మౌనిక చిన్నప్పటి నుంచీ చదువులో ముందంజలో ఉండేది. అన్ని తరగతుల్లోనూ ఫస్ట్‌ వచ్చేది. ఆమె ఉన్నత చదువులు చదివి అందరికీ అదర్శంగా నిలుస్తుందని గర్వపడేవాళ్లం. చెన్నైలో బీటెక్‌ చేరిందంటే ఎంతో సంతోషించాం. ఆమె అకాల మరణం మమ్మల్ని కుంగదీస్తోంది. చదువుల తల్లి చనిపోయిందనే విషయం బాధిస్తోంది.– డి.చంద్రారెడ్డి, మౌనిక బంధువు

యాజమాన్యం నిర్లక్ష్యమే
చెన్నైలో ఎంతో పేరు ఉందని చెబితే మౌనికను, ఆమె తమ్ముణ్ణి సత్యభామ యూనివర్సిటీలో బీటెక్‌లో చేర్పించాం. ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం అడుగు అడుగునా కనిపించింది. మౌనిక మృతి చెందిందన్న విషయం తెలిసిన వెంటనే బంధవులంతా కళాశాలకు వెళ్లాం. కనీస సమాచారం ఇచ్చేవారు కనిపించలేదు. పక్క రాష్ట్రం కావడంతో కనీస స్పందన కరువైంది.        
– పిల్లి రామసుబ్బారెడ్డి, మౌనిక బంధువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement