![మోదీ - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/1/31cni23-600560_mr.jpg.webp?itok=2gQppMd6)
మోదీ
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ ఆరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈనెల 9వ తేదీన చైన్నెలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లపై బీజేపీ వర్గాలతో పాటు పీఎం భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఐదుసార్లు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. ఆరోసారి పర్యటనకు ఆయన రెడీ అయ్యారు.
ఈసారి చైన్నెలో రోడ్ షో నిర్వహణకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. ఉత్తర చైన్నె, సెంట్రల్‌చైన్నె, దక్షిణ చైన్నెలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ రోడ్ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా పరమైన చర్యలపై బీజేపీ వర్గాలతోపాటుగా పీఎం భద్రతా బృందాలు దృష్టి పెట్టాయి. మాంబళం నుంచి పాండి బజార్ మీదుగా ఓ రూట్ మ్యాప్, కోడంబాక్కం – నుంగంబాక్కంమార్గంలో మరో రూట్ మ్యాప్, ఉత్తర చైన్నెలోని తిరువొత్తియూరు వడి ఉడయమ్మన్ ఆలయంలో దర్శనం, అక్కడ కొంత దూరం రోడ్ షోకు కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా ఈరోడ్ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అలాగే వేలూరు, పెరంబలూరులో పోటీ చేస్తున్న మిత్ర పక్షాల అభ్యర్థులకు మద్దతుగా తిరుచ్చిలో జరిగే సభలో పీఎం ప్రసంగించబోతున్నారు. అనంతరం కేరళకు బయలుదేరనున్నారు.
ఇక డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలలోజాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం వెలువడ్డ సమాచారం మేరకు ఈనెల 11 నుంచి 13 తేదీలో వారి పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశిలలో రాహుల్ పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.
![రాహుల్ 1](/gallery_images/2024/04/1/31cni24-600560_mr.jpg)
రాహుల్
Comments
Please login to add a commentAdd a comment