రూ. 155 కోట్లతో ఏర్పాటుకు నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, చైన్నె: విల్లుపురంలో మెడికల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 155 కోట్లతో 111 ఎకరాలలో పనులు చేపట్టనున్నారు. రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి దిశగా దూసుకెళ్తోంది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పారిశ్రామిక రంగంలో తమిళనాడును నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఐటీ, మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, వివిధ విడి భాగాలు, జౌళి, తోలు ఉత్పత్తులు, ఆర్మీకి ఉపయోగ పడే వివిధ రకాల ఉత్పత్తులు అంటూ పారిశ్రామికంగా తమిళనాడు 2030 నాటికి ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, జిల్లా కేంద్రాలలో పారిశ్రామిక వాడల ఏర్పాటు విస్తృతమయ్యాయి. అలాగే నగరాలలోౖ టైడల్ పార్కుల ఏర్పాటు వేగం పెరిగింది.
ఈ పరిస్థితుల్లో ఇటీవల విల్లుపురం జిల్లా వానూరులో టైడల్ పార్కు ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా విల్లుపురం జిల్లా మైలం నియోజకవర్గం పరిధిలోని మేల కుప్పం సిప్‌కాట్‌లో 111 ఎకరాలలో రూ. 155 కోట్లతో మెడికల్ పార్కు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ అత్యాధునిక వసతుల కల్పనతో, వివిధ రకాల మందుల తయారీ, వైద్య సంబంధిత పరిశ్రమలను ఆహ్వానించి ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టేదిశగా మెడికల్ పార్కు పనుల మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 51 కోట్లు, కేంద్రం వాటగా రూ. 20 కోట్లతో ప్రాథమిక పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మెడికల్ పార్కు ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలు అభివృద్ధి పధంలో ముందుకు సాగేందుకు వీలుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మెడికల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అధికారులు పేర్కొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment