
కేకే.నగర్(తమిళనాడు): తురైపాక్కంలో శుక్రవారం ఉదయం ఎస్‌ఐ పోలీసులను ఓ తాగుబోతు కత్తితో పొడిచి వీరంగం సృష్టించాడు. తురైపాక్కం పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐగా సూర్యనారాయణన్(52), పోలీసు జయప్రకాశ్(40) పని చేస్తున్నారు. ఈ ఇద్దరు శుక్రవారం ఉదయం గస్తీ పనులు ముగించుకుని, తురైపాక్కం సిగ్నల్ సమీపంలో జీపు నిలిపి నిలబడిఉన్నారు.
ఆ సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఓ తాగుబోతు పోలీసుల వద్దకు వెళ్లి, తనను పోలీసుల జీపులో ఇంటివరకు దింపమని, లేదా ఆటో చార్జీకి డబ్బు ఇవ్వాల్సిందింగా డిమాండ్ చేశాడు. పోలీసులు అతను అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను అసభ్యంగా తిట్టాడు. దీంతో వాగ్వాదం ఏర్పడింది. మద్యం మత్తులో అతడు పోలీసులపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఎస్‌ఐ సూర్యనారాయణన్, పోలీసు జయప్రకాశ్ ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. అంతేకాక ఆ వ్యక్తి వాహన చోదకులను కత్తితో బెదిరించి ఘర్షణకు దిగాడు. పోలీసు వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశాడు.
దీనిపై సమాచారం అందుకున్న తురైపాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు రెండు గంటల పాటు అతనితో పోరాడి, అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో ట్రిప్లికేన్‌కు చెందిన హరికృష్ణన్(25) అని, ఒక్కిం తురైపాక్కం మేట్టుకుప్పంలో ఉన్న ప్రైవేటు క్యాటరింగ్ సెంటర్‌లో ఉంటున్నట్టు తెలిసింది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, అతని నుంచి నాలుగు కత్తులను స్వాధీనం చేశారు. గాయపడిన ఎస్‌ఐ, పోలీసులు పెరుగుండిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.