మంత్రులకు జిల్లా బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

మంత్రులకు జిల్లా బాధ్యతలు

Published Wed, Oct 9 2024 2:14 AM | Last Updated on Wed, Oct 9 2024 6:42 PM

సీఎం ఎంకే స్టాలిన్‌

సీఎం ఎంకే స్టాలిన్‌

ఇన్‌చార్జ్‌లుగా నియామకం

రూ. 38 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

14 సంస్థలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభివృద్ధి పనులు, పథకాల పర్యవేక్షణ, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా మంత్రులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. రూ.38 వేల కోట్ల మేరకు పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. 14 సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాగా కేబినెట్‌ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకటించారు.

సాక్షి, చైన్నె : ఇటీవల మంత్రి వర్గంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళవారం కేబినెట్‌ భేటీ సచివాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం హోదాలో ముందు వరసలో ఓ వైపు తొలి సీటును ఉదయనిధికి కేటాయించారు. ఈ భేటిలో సీనియర్‌ మంత్రులు దురై మురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఐ పెరియస్వామి, ఏవీవేలు, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, పొన్ముడి, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం తదితరులు హాజరయ్యారు. తొలి సారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రన్‌, చెలియన్‌లు, మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్న సెంథిల్‌ బాలాజీ, నాజర్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఇందులో ఈశాన్య రుతు పవనాల సీజన్‌ నేపథ్యంలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదం మళ్లీ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో కొన్ని టాస్మాక్‌ దుకాణాల మూత, ఉదయ నిధికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే విషయంగా చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థల గురించి చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. జిల్లాలో ప్రభుత్వ పరంగా కార్యక్రమాల విస్తృతం, ప్రజలకు పథకాలను దరిచ్చేడం వంటి అంశాలను పరిగణించి మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులకు ఏఏ జిల్లాలను కేటాయించారో అన్న వివరాలను ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణే లక్ష్యంగా..

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల విస్తృతం, సహాయకాల పంపిణీ, ప్రకృతీ వైపరీత్యాల సమయంలో, అతవ్యసర పరిస్థితులలో చేపట్టాల్సిన పనులు తదితర వాటిని పరిగణించి మంత్రులకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ జిల్లాల వారీగా మంత్రులను ఇన్‌చార్జ్‌లగా నియమించారు. ఈ మేరకు తిరునెల్వేలి జిల్లాకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కె.ఎన్‌. నెహ్రూ, తేని జిల్లాకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియసామి, తిరుపత్తూరు, కళ్లకురిచి జిల్లాలకు ప్రజాపనుల శాఖ మంత్రి ఏ.వి. వేలు, ధర్మపురి జిల్లాకు రైతు సంక్షేమం, వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, తెన్‌కాశి జిల్లాకు విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌ను నియమించారు. కన్యాకుమారి – ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, నీలగిరి – తమిళ అభివృద్ధి , సమాచార శాఖ సామినాథన్‌, కృష్ణగిరి– ఆహార భద్రతా శాఖ మంత్రి ఆర్‌చక్రపాణి, కోయంబత్తూరు – విద్యుత్‌ మంత్రి సెంథిల్‌ బాలాజీ, కాంచీపురం – జౌళి శాఖ మంత్రి ఆర్‌. గాంధీ , పెరంబలూరు– రవాణా మంత్రి శివశంకర్‌, నాగపట్నం – పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌, మైలాడుతురై – వెనుకబడిన సంక్షేమం శాఖ మంత్రి శివ.వి. మెయ్యనాథన్‌ తదితరులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.

రూ. 38 వేల కోట్లకు ఆమోదం

కేబినెట్‌ భేటి అనంతరం మీడియాతో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ఇందులో 14 సంస్థలకు కేబినెట్‌లో ఆమోదం తెలిపిందన్నారు. రూ. 38 వేల కోట్ల పెట్టుబడితో 46 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ సంస్థలో రాష్ట్రంలో నెలకొల్పనున్నట్లు వివరించారు. ఇందులో రాణిపేటలో టాటా మోటార్స్‌ రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. కాంచీపురంలో కంచిలో ఫాక్సాన్‌ అనుబంధ సంస్థ యూసాన్‌ టెక్నాలజీ రూ.13 వేల కోట్లతో 14 వేల మందికి ఉద్యోగాలనుక ల్పించే పరిశ్రమను నెలకొల్పనున్నట్టు తెలిపారు. తూత్తుకుడి, తిరుల్వేలి,రామనాపురం, తిరువణ్ణామలైలో పీహెచ్‌డీ గ్రూప్‌ లోని 3 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా రూ. 10, 375 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించారు. అరియలూరులో తైవాన్‌కు చెందిన టీన్‌ షూస్‌ గ్రూప్‌ రూ. 1000 కోట్లతో 15 వేల మందికి ఉద్యోగకల్పన దిశగా పరిశ్రమను, కాంచీపురంలో కేమ్స్‌ సర్క్యూట్స్‌ ఇండియా రూ. 1,395 కోట్లతో 1000 మందికి ఉద్యోగాల కల్పన, కృష్ణగిరి జిల్లా హోసూర్‌ హసన్‌ సెక్యూర్‌ రూ. 612 కోట్లతో 1,200 మంది ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యాయని వివరించారు. మొత్తం 14 సంస్థల పెట్టుబడులకు ఆమోదించామని, వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.38 వేల కోట్ల పెట్టుబడి, 46,931 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement