
సాక్షి, చెన్నై : ఎన్నికల ప్రచార సమయంలోనే కాదు పోలింగ్ రోజు కూడా తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఆసక్తికర మాటలు వినిపిస్తున్నాయి. ఓపక్క తమ అభ్యర్థికే అమ్మ(జయలలిత), దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే పార్టీ చెప్పుకుంటుండగా విజయం తనదేనంటూ టీటీవీ దినకరన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తన వెంటే ఉన్నారని, వారికి తనపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీ తరుపున ముఖ్యమంత్రి పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కలిసి మధుసూధనన్ అనే వ్యక్తిని ఎన్నికల బరిలో దింపగా దినకరన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక ప్రతిపక్ష డీఎంకే ఎన్ మారుదు గణేశ్ అనే వ్యక్తిని, బీజేపీ కే నాగరాజన్ అనే అభ్యర్థిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.