భార్య గ్రేస్‌తో నటుడు, ఎమ్మెల్యే కరుణాస్
- నటుడు, శాసనసభ్యుడు కరుణాస్
- పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
చెన్నై: ఉద్దేశపూర్వకంగా తనను, కుటుంబాన్ని దారుణంగా కించపరుస్తోన్నవారిని శిక్షించాలని కోరుతూ సినీ నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ చెన్నై పోలీస్‌కమీషనర్‌కు ఫిర్యాదుచేశారు. అన్నా డీఎంకే తరఫున తిరువాడాళై నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణాస్.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో శశికళకు మద్దతుగా నలిచిన విషయం తెలిసిందే.
అయితే కరుణాస్.. శశికళకు మద్తతు పలకడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22న కరుణాస్ పుట్టినరోజు సందర్భంగా విమర్శలజడి శృతిమించింది. కరుణాస్ ఫొటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్టర్లను ముద్రించి గోడలపై అంటించారు.
ఈ పరిణామాలతో కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజిలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
భావ స్వాతంత్ర్యం పేరుతో తనను కించపరచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజక వర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని..అందులో నాకు వచ్చిన ఓట్లు 76 వేల 786 అని తెలిపారు. తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15 వేలు అని, ఓటు హక్కును వినియోగించుకోని వారి సంఖ్య 80 వేలు ఉందన్నారు. మొత్తం మీద తనకు, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రెండు లక్షల మంది ఉన్నారని అన్నారు.
తనను కించపరచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం తన నియోజక వర్గం అయిన తిరువాడాళైకు కార్యకర్తలతో కలిసి వెళ్లిన కరుణాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీపా పేరవైకి చెందిన కొందరు కరుణాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపో లీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పంపారు.