కొడిగడుతున్న దీపం
► బలహీనమవుతున్న పేరవై
► భర్త మాధవన్ వేరుగా కొత్త పార్టీ
► రూ.20 కోట్ల మోసం కేసు
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీప నానాటికి తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు, దీప పేరవై నేతలు కార్యకర్తలతో విబేధాలతో సతమతం అవుతున్న దీప జీవితంపై శుక్రవారం మరో రెండు పిడుగులు పడ్డాయి. భర్త మాధవన్ కొత్త పార్టీ స్థాపన, పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు దీపను మరింత బాధల్లోకి నెట్టేశాయి. జయలలిత మర ణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ చేతుల్లోని అన్నాడీఎంకే వెళ్లడాన్ని సహించలేని వారిపై నమ్మకంతో ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు.
పేరవైపై భర్త మాధవన్ పెత్తనం లేకుండా చేసి ఆమె కారుడ్రైవర్‌ను ప్రధాన కార్యదర్శిగా, ఆయన భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై అలిగిన మాధవన్ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిపోగా సీఎంగా ఎడపాడి పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై పన్నీర్‌సెల్వం పట్టుజారిపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్‌లో పోటీకి దిగడంతో భర్త మాధవన్ మనసు మార్చుకుని మళ్లీ చేరుమయ్యారు.
ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త పేరు కాలమ్‌ను ఖాళీగా పెట్టి మరో వివాదానికి కా>రణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్‌ను లోనికి అనుమతించక పోవడం అగ్నిలో అజ్యం పోసింది. దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్‌ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది.
‘ఎమ్‌జేడీఎంకే’ ఆవిర్భావం: మాధవన్
దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ శుక్రవారం అకస్మాత్తుగా రాజకీయ పార్టీ స్థాపించి పేరవైని మరింతగా బలహీనపరిచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎమ్‌జేడీఎంకే) పేరున తాను స్థాపించిన కొత్తపార్టీకి దీపకు ఎటువంటి సంబంధం లేదు, తను చేరదలుచుకుంటే చేరవచ్చని ప్రకటించారు.
శుక్రవారం ఉదయం నేరుగా జయలలిత సమాధి వెళ్లి నివాళులర్పించిన అనంతరం పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే తీవ్రమైన నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని, ఇరుపక్షాల నేతలు పన్నీర్‌సెల్వం మాయలో పడిపోయారని మాధవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజాయితీగా నిలిచే సిసలైన నేతను తానేనని చెప్పుకున్నారు. రెండాకుల చిహ్నం తన పార్టీకి సాధిస్తానని చెప్పారు. భర్త మాధవన్ పార్టీ పెట్టడం దీపకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
దీపపై రూ.20 కోట్ల మోసం కేసు: ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న దీప రూ.20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు.
తాను సైతం రూ.50వేలు చెల్లించి 5వేల దరఖాస్తులను పొందానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కోశాధికారిగా, సభ్యత్వ దరఖాస్తులో ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడం మోసపూరితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తనలాగా మరింత మంది కార్యకర్తలు మోసపోకుండా దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా రోజుకో సమస్యతో ‘దీప’ం కొడిగట్టుతోందా అనే భావన కలుగుతోంది.