
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగింది. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. జయలలిత మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది.