
తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు.
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పురోహిత్ ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. పురోహిత్ తమిళనాడు గవర్నర్‌గా అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలతో మమేకం కావడానికి గవర్నర్ తమిళ ఉపాధ్యాయుడి సాయంతో పాఠాలు నేర్చుకుంటున్నారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పురోహిత్.. మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు కాంగ్రెస్ తరపున .. ఒకసారి బీజేపీ తరపున పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. అంతేకాకుండా, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే నాగ్‌పూర్ నుంచి స్థాపించిన ‘ది హితవాద’ పత్రికను బన్వరిలాల్ పురోహిత్ విజయవంతంగా నడిపిస్తున్నారు.