సాక్షి, హైదరాబాద్: బౌలర్ల వైఫల్యం కారణంగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 203/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 111.5 ఓవర్లలో 4 వికెట్లకు 510 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ (116; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే స్కోరు వద్ద కార్తికేయ కక్ బౌలింగ్‌లో అవుటవ్వగా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (273 బంతుల్లో 179; 18 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబా అపరాజిత్ (165 బంతుల్లో 115; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. అపరాజిత్ సోదరుడు ఇంద్రజిత్ (52 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు) కూడా రాణించాడు.
అపరాజిత్ అవుటైన వెంటనే తమిళనాడు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. 115 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (14; 3 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్ కాగా... కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5 బ్యాటింగ్), తనయ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు పోరాడి ‘డ్రా’ చేసుకుంటారో చేతులెత్తేసి ఓటమిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి.
చదవండి: Mohammed Rizwan: వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..!
Comments
Please login to add a commentAdd a comment