మహారథోత్సవంలో పాల్గొన్న భక్తులు
భక్తులతో కిటికిటలాడిన తిరువణ్ణామలై
పటిష్ట పోలీస్ బందోబస్తు
చెరుకు గడలతో పిల్లలను తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచ మూర్తులు పంచ రథోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న ధ్వజారోహనంతో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు నిర్వహించి ఉత్సవ మూర్తులకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏడవ రోజైన మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పంచ మూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరుడికి మేళ తాళాల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన నిర్వహించారు. వినాయకుడిని ఉదయం 6.25 గంటలకు భక్తుల హరోం... హరా... నామస్మరణ మధ్య పుష్పాలంకరణలో రాజగోపురం వద్దనున్న రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం అన్నామలైయార్ ఆలయ రాజగోపురం ఎదురుగా నుంచి బయలుదేరింది. ఆ సమయంలో చలిని కూడా భక్తులు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ రథం దారాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర పాండియన్, ఎస్పీ సుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.
మాడ వీధుల్లో ఊరేగిన పంచ రథాలు:
మాడ వీధుల్లో బయలుదేరిన రథం ఉదయం 9.20 గంటలకు వచ్చి చేరింది. అనంతరం ఉదయం 9.35 గంటలకు సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగించారు. మద్యాహ్నం 12.20 గంటలకు మహా రధాన్ని ఊరేగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహా రథంలో అన్నామలైయార్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథాన్ని ఒక పక్క మహిళా భక్తులు, మరో పక్క పురుషులు రథం దారాలను పట్టి లాగారు. ఈ మహా రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరునికి హరోంహర నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నామలై అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథాన్ని మహిళా భక్తులు మాత్రమే లాగారు. స్వామి వారి మహారథం, చండికేశ్వరుడి రథం, పంచ రధాలు విడివిడిగా మాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నామలై అమ్మవారి రఽథ తాడును మహిళా భక్తులు మాత్రమే అధికసంఖ్యలో చేరుకొని లాగారు. ఒకే రోజు పంచ రథాలు మాడ వీధుల్లో ఊరేగనున్న నేపథ్యంలో చైన్నె, విల్లుపురం, కాంచీపురంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొని పంచ మూర్తులను దర్శించుకున్నారు. సంతాన భాగ్యం కలిగిన దంపతులు తమ బిడ్డలకు చెరుకులతో ఉయ్యాల కట్టి అందులో సంతానాన్ని ఉంచి ఆలయ మాడ వీధుల్లో తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు.
5 లక్షల మంది భక్తులు హాజరు..
మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఐదు రథోత్సవాల్లో కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకున్నారు. ఫలితంగా మాడ వీధులు కిక్కిరిశాయి. ఈ సందర్బంగా భక్తులు రథాలపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.
పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు
రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆరువేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ సుధాకర్ తెలిపారు.
పారంపర్య గుర్రపు సంత ప్రారంభం
రథోత్సవం రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గుర్రపు సంత మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీపోత్సవాన్ని పురష్కరించుకొని గత వంద సంవత్సరాల నుంచి గుర్రపు సంతను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోడ్డు, పుదుక్కోటై, తిరుపత్తూరు, ఓసూరు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి విక్రయ సంతలో ఉంచారు. ఈ సంత ఈనెల 13న దీపోత్సవంతో ముగుస్తుంది. ఈ సంవత్సరం గుర్రం, ఎద్దుల సంతకు పన్ను వసూలు చేయకుండా అధికారులు మినహాయింపు ఇచ్చారు.
రూ. 70 లక్షలతో మహా రథానికి మరమ్మతు పనులు
మహారథం అనే పిలిచే అన్నామలైయార్ రథం పూర్తిగా శిథిలం కావడంతో ఈ సంవత్సరం దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.70 లక్షల వ్యయంతో రథానికి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో గత నవంబర్ 8వ తేదీన ఆలయ మాడ వీధుల్లో ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం రథానికి మెరుగులు దిద్ధి పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు అమర్చి మంగళవారం మహా రథోత్సవాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment