అధికారులతో మంత్రి శివశంకర్ భేటి
28 నుంచి రోడ్డు మీదకు
3 చోట్ల నుంచి వివిధ మార్గాలకు ప్రయాణ ఏర్పాట్లు
మంత్రి శివశంకర్ వెల్లడి
సాక్షి, చైన్నె: దీపావళి సందర్భంగా ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రవాణా సంస్థ సిద్ధమైంది. 14 వేల బస్సులను ప్రయాణికుల కోసం రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. చైన్నెలో 3 చోట్ల నుంచి వివిధ మార్గాలలో ప్రయాణించే బస్సుల వివరాలను రవాణా మంత్రి శివశంకర్ సోమవారం ప్రకటించారు. వివరాలు.. దీపావళికి పది రోజులే సమయం ఉంది. ఇంటిళ్లి పాది స్వస్థలాలలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి పండుగకకు ఏకంగా నాలుగురోజులు సెలవు రావడంతో వివిధ ప్రాంతాలలో ఉన్నవాళ్లంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వీరికోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. బస్సుల రూట్లు, బస్సుల సంఖ్య తదితర అంశాల గురించి రవాణా అదనపు ముఖ్యకార్యదర్శి కె. ఫణీంద్రరెడ్డి , ఇతర పోలీసుల అధికారులతో జరిపిన సమావేశానంతరం ప్రత్యేక బస్సుల వివరాలను మంత్రి శివశంకర్ ప్రకటించారు.
ప్రత్యేక బస్సులు..
చైన్నెలో ఈనెల 28, 29, 30 తేదీలలో సాధారణంగా నడిచే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడపున్నారు. తొలిరోజున 2,092 బస్సులు, తదుపరి రెండురోజులు 4,900 చొప్పున ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. ఇతర నగరాలు, పట్టణాల మధ్య ప్రత్యేక బస్సులతో కలుపుకుని మొత్తంగా మొత్తం 14,086 బస్సులు నడపనున్నారు. దీపావళి పండుగ తర్వాత ఇతర నగరాల నుంచి చైన్నెకి వచ్చే వారికోసం 2వ తేదీన 2,092 బస్సులు, మూడు, నాలుగు తేదీలలో 3,165 చొప్పున బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. తిరుగు పయనం అయ్యే వారి కోసం 12,606 బస్సులు రోడ్డెక్కిస్తున్నామని మంత్రి వివరించారు. చైన్నె శివారులోని కిలాంబాక్కం కలైజ్ఞర్ కరుణానిధి శత జయంతిస్మారక బస్టాండ్ నుంచి పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, తిరుచ్చి, మధురై, తూత్తుకుడి,సెంగోట్టై, తిరునెల్వేలి, సేలం, కోయంబత్తూర్, వందవాసి, పోలూర్, తిరువణ్ణామలై, కుంభకోణం, తంజావూరు వైపుగా వెళ్లే బస్సులను నడపనున్నారు. పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్‌కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి ఈసీఆర్ మార్గం, కాంచీపురం, వేలూరు, బెంగళూరు, తిరుత్తణి మార్గాలలో నడిచే బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మాధవరం సబర్బన్ టెర్మినల్ నుంచి పొన్నేరి వైపుగా ఆంధ్ర ప్రదేశ్ మార్గంలో, అలాగే వయా ఊత్తుకోట్టై మార్గంలో నడిచే బస్సులతోపాటు తిరుచ్చి, సేలం, కుంభకోణం మార్గాలలో నడిచే బస్సులు రోడ్డెక్కించనున్నారు.
ఫిర్యాదులు..
ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శివశంకర్ వివరించారు. కార్లు, ఇతర వాహనాలు ప్రయా ణించే వారిని దృష్టిలో ఉంచుకుని తాంబరం, పెరుంగళత్తూరు, తిరుపోరూర్, చెంగల్పట్టు మీదుగా వెళ్లే వారున అవుటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించే విధంగా చూస్తామన్నారు. ప్రత్యే క బస్సుల రిజర్వేషన్లు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల కోసం 94450 14436 నెంబర్‌ను ఈసందర్భంగా ప్రకటించారు. ప్రైవేటు ఆమ్నీ బస్సులు అధిక చార్జీల వసూళ్లకు పాల్పడిన పక్షంలో 1800 425 6151 (టోల్ ఫ్రీ నంబర్), 044– 24749002, 044–26280445, 044–2628 1611 నంబర్లను సంప్రదించాలని వివరించారు. అన్ని బస్టాండ్‌లలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయన్నారు. కోయంబేడు నుంచి కిలాంబాక్కం, మాధవరం బస్టాండ్‌లకు 24 గంటల పాటు ఎంటీసీ బస్సులపై తేదీలలో సేవలను అంది స్తాయన్నారు. ఈ సందర్భంగా చైన్నె ఎంటీసీలో పనిచేసి విధుల సమయంలో మరణించిన ఉద్యోగుల వారసులు నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక ఉత్తర్వులను మంత్రి శివశంకర్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment