రూ.6వేల కోట్ల బాణసంచా అమ్మకాలు
150 చోట్ల ప్రమాదాలు
544 మందికి గాయాలు.. ఒకరి మృతి
బాణసంచా గొడవల్లో ఇద్దరి మృతి
ఐదువేల మందితో చైన్నెలో 15 వేల టన్నుల చెత్త తొలగింపు
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను గురు, శుక్రవారాల్లో ఆనందోత్సాహాలతో అత్యంత వేడుకగా జరుపుకున్నారు. పండుగ వేళ వర్షం పడకపోవడంతో బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. వస్త్రాలు, స్వీట్లు, మాంసం, బాణసంచా సహా ఇతర విక్రయాలు రాష్ట్రంలో ఈ ఏడాది రూ.60 వేల కోట్లకు జరిగినట్టు అంచనా వేశారు. ఇందులో బాణసంచా మాత్రం రూ.6 వేల కోట్లకు అమ్మకాలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణ సంచాలు అమ్మిన, కాల్చి వారికి కేసులతో పోలీసులు వాతలు పెట్టారు. బాణసంచాల దాటికి 150 ప్రమాదాలు జరగ్గా 544 మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు.
గత రెండేళ్లలతో పోల్చితే ఈసారి దీపావళిని రాష్ట్ర ప్రజలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. మహాబలిపురంలో విదేశీయులు దీపావళి సంబరాల్లో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. వడలూరులోని మేట్టుకుప్పంలోని అనాథ ఆశ్రమంలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పండుగను జరుపుకున్నారు. వర్షం పడని దృష్ట్యా, ఈ ఏడాది బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణసంచాలను పేల్చడంతో పోలీసులు కన్నెర్రజేశారు.
కోయంబత్తూరు, తేని జిల్లాల్లోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు, గబ్బిలాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాణసంచాలకు దూరంగా పండుగను జరుపుకున్నారు. బాణసంచాల మోతతో చెత్తతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు పరిసరాల్లో గాలిలో కాలుష్యం పెరిగింది. బాణసంచాలతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు శుక్రవారం ఉదయాన్నే చైన్నెలో ఐదు వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని 34 వేల వీధుల్లో 15 వేల టన్నుల చెత్తను తొలగించారు.
కేసులతో వాత..
ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణసంచాలను పేల్చేందుకు విధించిన సమయాన్ని అనేక చోట్ల ప్రజలు ఖాతరు చేయలేదు. రాత్రి పది గంటల వరకు సైతం గాల్లో రంగురంగుల బాణసంచాలు మార్మోగాయి. చైన్నె నగరంతో పాటు, ఆవడి, తాంబరంలలో గస్తీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా పేల్చుతున్న వారిని పసిగట్టి కేసులతో వాతలు పెట్టారు. చైన్నెలో 347 కేసులు, ఆవడిలో 65 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. అలాగే, నిబంధనలు ఉల్లంగించి బాణసంచాలను విక్రయించిన దుకాణదారులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.
తగ్గిన ప్రమాదాలు..
బాణసంచా కారణంగా రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి ప్రమాదాలు తగ్గాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అబాస్‌కుమార్, అదనపు డైరెక్టర్ సత్యనారాయణన్ నేతృత్వంలో దీపావళికి ముందుగానే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. పండుగ రోజున ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా అప్రమత్తతతో వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 బృందాలలో 8 వేల మంది సిబ్బంది సేవలను అందించారు. విరుదునగర్ జిల్లా అల్లంపట్టిలో గురువారం రాత్రి తారాజువ్వ చొచ్చుకు రావడంతో అగ్గి పెట్టెల పరిశ్రమ దగ్ధమైంది.
ఎవ్వరికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇక మిగిలినవి చిన్నచిన్న ప్రమాదాలే. అనేకచోట్ల గుడిసెలు, పందిళ్లు దగ్ధమయ్యాయి . చైన్నె ఎర్నావూరులో నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. బాణసంచా పేల్చుతూ, తారాజువ్వల దాడిలో రాష్ట్రంలో 150 ప్రమాదాలు జరిగాయి. ఇందులో చైన్నెలో మాత్రం 48 ఉన్నాయి. 544 మంది గాయాలపాలయ్యారు. ఇందులో చైన్నెలో 95 మంది ఉన్నారు. కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరుపేట సమీపంలోని ఎర్నావూరుకు చెందిన ముగ్గురు మిత్రులు సమీప గ్రామంలో నాటు బాణసంచాలను కొనుగోలు చేసి మోటారు సైకిల్‌పై తీసుకెళ్తుండగా అవి పేలాయి. ఈ ఘటనలో విన్సంట్(22) మృతిచెందాడు. ప్రేమ్‌కుమార్(24), పౌల్‌రాజ్(22) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పండుగ రోజున చైన్నె ఎన్నూరు సత్యవాణి ముత్తునగర్‌లో మద్యం మత్తులో మేసీ్త్ర ముత్తువేల్(42) రెండవ అంతస్తు నుంచి పడి మృతిచెందాడు.
ప్రత్యేక బస్సులు
దీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం ఆదివారం నుంచి తిరుగు పయనం కానున్నారు. వీరి కోసం ఆయా మార్గాలు, ప్రాంతాల నుంచి చైన్నె వైపుఅదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె శివారులోని కిలాంబాక్కంకు బస్సులు పరిమితం చేసిన దృష్ట్యా, ఈ ప్రయాణికులు నగరంలోకి వచ్చేందుకు వీలుగా దక్షిణ రైల్వే అదనపు ఎలక్ట్రిక్ రైలు సేవలకు నిర్ణయించింది. తాంబరం– కాటాన్ కొళత్తూరు మధ్య ఉదయం 4 గంటల నుంచి ఎలక్ట్రిక్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది.
గొడవల్లో..
బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో ఇద్దరు మృతిచెందారు. చైన్నె రాయపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శ్యామ్‌ను బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో మరో ప్రాంత యువకులు దాడి చేయడంతో కింద పడి మృతిచెందాడు. విల్లుపురం జిల్లా విక్రవాండి ఒరత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉత్తరాది కార్మికులు సుదన్ రిషిదేవ్(31), దిల్‌కుష్ కుమార్(22)బాణసంచా పేల్చే విషయంగా పొటీలు పడి చివరకు గొడవకు దిగారు. దిల్‌కుష్‌కుమార్ బలంగా నెట్టడంతో కింద పడ్డ రిషిదేవ్ మృతిచెందాడు. సేలం జిల్లా ఇరుంబాలై పట్టిలో బాణసంచా పేల్చే గొడవలో ఓ వర్గం ఆ ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ సతీష్‌కుమార్(38) ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇక, పండుగ వేళ మద్యం వ్యాపారం జోరుగానే జరిగింది. గురు, శుక్రవారాలలో టాస్మాక్ దుకాణాలు కిక్కిరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment