బీజేపీ ఆశలు అడియాశలేనా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘జయ జైలు పాలైంది, ఇక జయం మనదే’ అంటూ ఆనందంతో ఊగిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. జయ బెయిల్‌పై విడుదలైన పరిస్థితిలో పార్టీల మనుగడ ఏమిటి...రాబోయే ఎన్నికల దిశగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తుచేస్తూ సాగిపోవడం అన్ని పార్టీ నేతలకు తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన విద్య. ఎదుటివారిది పైచేయి అయినా అదునుకోసం వేచిఉండక తప్పదు. తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య అనాదిగా సాగుతున్నది అదే. రాష్ట్రంలో అధికార పీఠం కోసం నువ్వానేనా అంటూ పోరు సాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా అధికారంలోకి వచ్చిన వారు ‘మాజీ’లపై కత్తికట్టడం కూడా సాధారణమై పోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారంటూ జనతాపార్టీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదును ఆమె తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం అస్త్రంగా మలుచుకుంది. డీఎంకే తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే సైతం అదే కోవలో కొనసాగి కరుణానిధి, స్టాలిన్ తదితరులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను బనాయించింది. అయితే 18 ఏళ్లపాటు నడిచిన కేసులో గతనెల 27వ తేదీన జయలలిత జైలు పాలవగా, ఈనెల 18న బెయిల్ మంజూరైంది.
విస్మయంలో విపక్షం
రాజకీయంగా ఇక అమ్మ పనైపోయింది అంటూ సంబర పడిపోయిన విపక్షాలు ఊహించని పరిణామాలతో విస్మయంలో పడిపోయాయి. అమ్మ లేని అదనుచూసి బలమైన కూటమిగా ఏర్పడాలన్న డీఎంకే ప్రయత్నాలకు బెయిల్ ఉదంతం గండికొట్టింది. అవినీతి ఆరోపణలతో అమ్మ జైలు పాలుకావడం అన్నాడీఎంకేకు శాపంగా మారుతుందని ప్రతిపక్షాలు ఆశించగా వరంగా పరిణమించే పరిస్థితులు కనపడుతున్నాయి. జయ జైలు పాలుకావడం వల్ల ఆమెపై ఏహ్యభావానికి బదులు సానుభూతి పెరిగినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలహీనమై పోతుందని ఆశిస్తే సానుభూతి పవనాలతో మరింత బలాన్ని పుంజుకుని అన్నాడీఎంకే సిద్ధం కావడం డీఎంకేకు మింగుడుపడటం లేదు.
బీజేపీ ప్రయత్నాలకు గండి
అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పోరుసాగుతున్న దశలో భారతీయ జనతా పార్టీ వచ్చి ఈ రెండు పార్టీల మధ్య వచ్చి కూచుంది. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మట్టికరిచిపోగా సరిగ్గా అదే సమయంలో మరో జాతీయ పార్టీ బలం పుంజుకుంది. పనిలో పనిగా జార్జికోటపై జెండా ఎగురవేసి రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ప్రయత్నాలను సైతం ప్రారంభించింది. జయకు జైలు శిక్షపడిన నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను సీఎం అభ్యర్థిగా రంగంలోకి దించాలని బీజేపీ గట్టిప్రయత్నాలే చేసింది. లింగా షూటింగ్ ముగియగానే తన నిర్ణయం ప్రకటిస్తానని రజనీ కమలనాథులకు హామీ ఇవ్వడంతో బీజేపీలో మరిన్ని ఆశలు చిగురించాయి. మరింత ఉత్సాహం, శక్తి సామర్థ్యాలతో ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా జయకు రజనీకాంత్ శుభాకాంక్షలు పంపడంతో బీజేపీ నేతలు నివ్వెరపోయారు. అనుకున్నదొకటి..అయ్యింది ఒకటి కావడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయి.