స్టాలిన్ను జయ అవమానించారా!
చెన్నై: ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.. ఒకవేళ ఎప్పటిలాగే తండ్రి సీఎం పీఠంపై కూర్చున్నా.. స్వచ్ఛందంగా రెండున్నరేళ్లలో ఆయన తప్పుకొని కుమారుడికి పట్టాభిషేకం ఖాయం. ఇవి తమిళనాడు ఎన్నికల ఫలితాల ముందు డీఎంకే గురించి ఆ పార్టీ చీఫ్ కరుణానిధి, ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ గురించి వరకు ప్రతి ఒక్కరూ నెమరు వేసుకున్న అంశాలు. అయితే.. అందరి అంచనాలను తమిళులు పల్టీ కొట్టించారు. ఈసారి అందరికీ షాకిచ్చి.. మరోసారి పురుచ్చితలైవి జయలలితకే పట్టం కట్టారు. ఆమె మద్రాస్ లోని సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. ఇలా జయలలిత సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకావడం ఇది రెండోసారి. 2001లో ఒకసారి హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమంలో స్టాలిన్‌కు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించారు. ఆయనతో పాటు కొందరు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. స్టాలినే ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని కూడా అంచనాలు ఉన్నాయి. కేబినెట్ ర్యాంకు ఉండే ప్రతిపక్ష నేత స్థాయి వ్యక్తిని ఇలా వెనకాల కూర్చోబెట్టడం ఏంటని అంతా మండిపడుతున్నారు. పైగా.. పుండు మీద కారం చల్లినట్లు అదే సమయంలో సినీనటుడు శరత్ కుమార్‌కు మాత్రం ముందు వరుసలో సీటు ఇచ్చారు. ఈ అంశంపై డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని వెనుక వరుసలో కూర్చోబెట్టి అవమానిస్తారా అని కరుణ ఫీలయినట్లు సమాచారం.