మేమే ప్రధానిని కలుస్తాం..
తమిళనాడుః కావేరీజల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్యే కాక, పార్టీల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను తెచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలకు తోడు రాజకీయ నాయకుల రంగప్రవేశంతో పరిస్థితి మరింత ఉధ్రుతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు డీఎంకే నాయకుడు, విపక్ష నేత ఎం కే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. కావేరీ సమస్యపై పాలక పార్టీ విఫలమైన పక్షంలో తామే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు.
కావేరీ సమస్య పై డీఎంకే పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. సమస్యపై చర్చించేందుకు అన్ని పార్టీల ప్రతినిధి బృందం తో కలసి ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తామన్నారు. అయితే అధికార, ప్రతిపక్షాలతోపాటు రాజకీయ పార్టీలన్నీ కలసి సమస్యను పరిష్కరించాలన్న చర్యకు ఏఐడీఎంకే ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడలేదని, పైగా చట్టపరంగానే సాధించాలని యోచించినట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలసి మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్న ఆలోచనను పాలక పార్టీకి ఎన్నోసార్లు తెలియజేశామన్నారు. వారి స్పందనకోసం ఎంతో ఓపిగ్గా నిరీక్షించినా.. ఏఐడీఎంకే అటు దిశగా ఏమాత్రం అడుగు వేయడం లేదని పార్టీ సభ్యులు ఆరోపించారు.
పార్టీ నిర్వహించిన నిరాహార దీక్ష ప్రదర్శనలో కావేరీ సమస్యపై స్టాలిన్ ప్రసంగించారు. నేటి నిరాహార దీక్షను చూసైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని, అందుకు తమ మద్దతు, సహకారం పూర్తిశాతం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నపుడు ప్రధాన సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించేదని స్టాలిన్ ఈ సందర్భంలోగుర్తు చేశారు.