All party delegation
-
మేమే ప్రధానిని కలుస్తాం..
తమిళనాడుః కావేరీజల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్యే కాక, పార్టీల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను తెచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలకు తోడు రాజకీయ నాయకుల రంగప్రవేశంతో పరిస్థితి మరింత ఉధ్రుతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు డీఎంకే నాయకుడు, విపక్ష నేత ఎం కే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. కావేరీ సమస్యపై పాలక పార్టీ విఫలమైన పక్షంలో తామే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. కావేరీ సమస్య పై డీఎంకే పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. సమస్యపై చర్చించేందుకు అన్ని పార్టీల ప్రతినిధి బృందం తో కలసి ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తామన్నారు. అయితే అధికార, ప్రతిపక్షాలతోపాటు రాజకీయ పార్టీలన్నీ కలసి సమస్యను పరిష్కరించాలన్న చర్యకు ఏఐడీఎంకే ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడలేదని, పైగా చట్టపరంగానే సాధించాలని యోచించినట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలసి మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్న ఆలోచనను పాలక పార్టీకి ఎన్నోసార్లు తెలియజేశామన్నారు. వారి స్పందనకోసం ఎంతో ఓపిగ్గా నిరీక్షించినా.. ఏఐడీఎంకే అటు దిశగా ఏమాత్రం అడుగు వేయడం లేదని పార్టీ సభ్యులు ఆరోపించారు. పార్టీ నిర్వహించిన నిరాహార దీక్ష ప్రదర్శనలో కావేరీ సమస్యపై స్టాలిన్ ప్రసంగించారు. నేటి నిరాహార దీక్షను చూసైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని, అందుకు తమ మద్దతు, సహకారం పూర్తిశాతం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నపుడు ప్రధాన సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించేదని స్టాలిన్ ఈ సందర్భంలోగుర్తు చేశారు. -
'వంచనకే చర్చలు.. పనికిమాలిన ఆలోచన'
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల రూపంలో భంగం కలుగుతోంది. అక్కడికి ఇప్పటికే వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని కలిసి మాట్లాడి తమ సమస్యలు చెప్పేందుకు వేర్పాటువాదులు అంగీకరించడం లేదు. అసలు చర్చలకు ఒప్పుకోం అని చెబుతున్నారు. రాష్ట్రంలో సుస్థిర శాంతిపరిస్థితులు నెలకొల్పేందుకు చర్చకు రావాల్సిందిగా అఖిలపక్ష భేటీ సందర్భంగా వేర్పాటువాద నాయకులకు, ఇతర పక్షాలకు ఆహ్వానం పంపగా వేర్పాటువాదులు అందుకు ససేమిరా అంటున్నారు. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ లు ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ముఫ్తీది మోసపూరిత పనికిమాలిన ఆలోచన అని, ఇంతపెద్ద విషయాన్ని కేవలం చర్చల పేరిట ముందుకు తీసుకెళ్లాలనుకోవడం మూర్ఖపు ఆలోచన అని వారు తీవ్రంగా నిందించారు. అసలు ఏ ఎజెండాతో చర్చలకు వస్తున్నారో కూడా ఇప్పట వరకు తమకు అర్ధం కావడం లేదని ఆరోపించారు. ఈ చర్చలకు తాము ఏమాత్రం ఆసక్తితో లేమని మరొక వేర్పాటువాద నాయకుడు చెప్పాడు. -
మీ మాట వినేందుకు వస్తున్నాం!
న్యూఢిల్లీ: గత 58 రోజులుగా కశ్మీర్ లోయ రగులుతూనే ఉంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత లోయలో చెలరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈ అల్లర్లలో 73 మంది మరణించారు. మరోవైపు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో అఖిలపక్ష బృందం ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరింది. అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, గులాం నబీ ఆజాద్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వన్ తదితర నేతలు ప్రత్యేక విమానంలో శ్రీనగర్ బయలుదేరారు. కశ్మీరీలతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకొని, రాజ్యాంగం పరిధిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, కశ్మీర్ లోయలో ఉద్రిక్తతకు, హింసకు చరమగీతం పాడే లక్ష్యంతో అఖిలపక్షం ఉంది. అఖిలపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిలపక్ష బృందంతో చర్చలు, సమాలోచనలు కశ్మీర్‌కు, దేశానికి మేలు చేస్తాయని అన్నారు. సమస్యకు ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరకపోయినా కశ్మీరీ ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అఖిలపక్ష బృందం వేదికగా నిలుస్తుందని చెప్పారు.