అమ్మ పోస్టర్‌తో ఇరకాటం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ (జయలలిత) పై అలవిమాలిన అభిమానం అంటించిన పోస్టర్ అన్నాడీఎంకే శ్రేణులను ఇరకాటంలో పెట్టింది. కావేరీ జల వివాదం రగులుతున్న తరుణంలో కర్ణాటకకు ఆ పోస్టర్ ఒక అస్త్రంగా మారింది.
ఇంతకూ ఏమిటా పోస్టర్, ఏమా కథ అంటే...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి జయలలితకు 2014లో జైలుశిక్ష విధించింది. జయ బెంగళూరు జైల్లో ఉన్నపుడు అన్నాడీఎంకే శ్రేణులు, అభిమానాలు తమిళనాడులో అనేక ఆందోళనలకు దిగారు. రోడ్లపై పొర్లారు, కొరడాలతో తమను తామే కొట్టుకున్నారు. కర్ణాటక దిష్టిబొమ్మలు తగులబెట్టారు. రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారు. కొందరు అత్యుత్సాహవంతులు తీర్పు చెప్పిన న్యాయమూర్తిని తూలనాడుతూ పోస్టర్లతో ప్రచారం చేశారు. అంతటితో శాంతించని మరికొందరు అమ్మను ఆకట్టుకోవడం కోసం కర్ణాటక ప్రజలను ఉద్దేశించి పోస్టర్లు అంటించి అందులో కావేరీ వివాదాన్ని ముడిపెట్టారు. ‘కావేరీయై వెచ్చుకో..అమ్మవై కొడు-అమ్మా వా’ (కావేరీని ఉంచుకో...అమ్మను మాకిచ్చేయి-అమ్మా రా) అనే నినాదంతో పెద్ద సంఖ్యలో వెలువడిన పోస్టర్లు ఆనాడు ఎవ్వరినీ పెద్దగా ఆకర్షించలేదు.
అయితే కావేరీ నది నుంచి వాటా జలాలు విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మంగళవారం సానుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కర్ణాటక ప్రజలు పాత పోస్టర్‌ను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో రెండు రోజులుగా సాగుతున్న పోరాటంలో అన్నాడీఎంకే శ్రేణుల ఆనాటి పోస్టర్‌నే వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ హైలెట్‌గా వాడుకుంటున్నారు. మీరు ఆశించినట్లుగా అమ్మను ఇచ్చేశాం కదా, కావేరీని కూడా కావాలంటే ఎలా అంటూ అన్నాడీఎంకే నేతలపై చలోక్తులు విసురుతున్నారు.