
చెన్నై: ‘‘రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మన ఎంపీగారు చెప్పారు. గడువు ముగిసినా కేంద్రం స్పందిచలేదు కాబట్టి ఆయన మాటమీద నిలబడాలి. ఇదిగో ఉరితాడు.. విషం నింపిన సీసా.. రెండిట్లో మీకు నచ్చింది తీసుకోండి..’అంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఈ వ్యక్తిపేరు పుహళేంది. అన్నాడీఎంకే నుంచి బయటికొచ్చేసిన టీవీవీ దినకరన్ వర్గంలో కీలక నేత. శనివారం చెన్నైలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?: కేంద్ర ప్రభుత్వం తక్షణమే కావేరీ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(సీఎంబీ)ని ఏర్పాటు చేయాలంటూ ఏఐఏడీఎంకే ఎంపీలు గత కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ఆందోళనలను చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సూచన మేరకు మార్చి 29 లోగా సీఎంబీ ఏర్పాటు చేయకుంటే పార్లమెంట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటానని ఎంపీ నవనీత కృష్ణన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడా గడువు ముగిసిన నేపథ్యంలో ఎంపీగారి చాలెంజ్‌పై దినకరన్ వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు.
రాజీనామాలు చెయ్యండి లేదా చావండి..: కావేరీ బోర్డు ఏర్పాటు కావాలంటే ఏఐఏడీఎంకే ఎంపీలందరూ తక్షణమే రాజీనామాలు చేయాలని, లేదంటే తాము సూచించిన విధంగా ఉరితాడు, విషాన్ని స్వీకరించాలని పుహళేంది అన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీపై కొద్ది నెలల కిందట తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ నిర్వహణ సజావుగాసాగేలా రివర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడంతో తమిళ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దినకరన్ వర్గీయుల సవాలుపై ఏఐఏడీఎంకే ఎంపీ నవనీత కృష్ణ స్పందించాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment