'మన కోసం మనం'.. ఓ కామెడి ప్రోగ్రామ్!
చెన్నై: వారసత్వపోరులో తమ్ముడి చేతిలో ఓడి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన డీఎంకే పార్టీ మాజీ నేత, తమిళనాడు మాజీ సీఎం పెద్ద కుమారుడు అళగిరి మరోసారి నిరసన గళం వినిపించారు. తన సోదరుడు ఎం.కె. స్టాలిన్ ఇటీవలే చేపట్టిన 'మన కోసం మనం' కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'ఆ కార్యక్రమం ఓ కామెడీ ప్రోగ్రామ్. దానివల్ల డీఎంకేకి ఎలాంటి ఉపయోగం ఉండదు' అని ఆదివారం చెన్నైలో విలేకరులతో అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకుగానూ స్టాలిన్.. నమక్కు నామే విదియాల్ మీట్పు పయనం (మన కోసం మనమే: ఓటమి నుంచి విజయం వైపు పయనం) పేరుతో గత నెల చివరి వారం నుంచి యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.