M K Alagiri
-
మళ్లీ అన్నయ్య?
సాక్షి, చెన్నై: డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముళ్ల సమరం రసకందాయంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. బహిష్కరణకు గురైన అళగిరిని మళ్లీ ఆహ్వానించేందుకు తగ్గ ప్రయత్నాల్లో తండ్రి, అధినేత కరుణానిధి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కరుణానిధి దూత అళగిరితో మంతనాల్లో ఉన్న సమాచారం డీఎంకేలో చర్చకు దారి తీసింది. ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి దూకుడు పెంచి ఉన్న తమ్ముడు స్టాలిన్‌కు అన్నయ్య ద్వారా చెక్ పెట్టే ప్రయత్నాల కరుణానిధి ఉన్నట్టుగా సంకేతాలు వస్తుండడం ఉత్కంఠను రేపుతోంది. డీఎంకే అధినేత కరుణానిధి వారసులు అళగిరి, ఎంకే స్టాలిన్ల మధ్య నిరంతర రాజకీయ సమరం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమరంలో అళగిరి బహిష్కరణ వేటుకు గురయ్యారు. మళ్లీ పార్టీలో తనను కలుపుకునేందుకు అళగిరి తీవ్రంగా ప్రయత్నించినా, తండ్రి కరుణ మనస్సు మాత్రం కరగ లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా మనకు..మనమే అంటూ స్టాలిన్ సాగించిన పర్యటనతో అళగిరి వర్గం తమ్ముడి గొడుగు నీడన చేరక తప్పలేదు. అళగిరి వర్గీయులు దాదాపుగా స్టాలిన్ వెంట ఉన్నా, చడీచప్పుడు కాకుండా అన్నయ్యకు సమాచారాలు మోయడంలో సిద్ధహస్తులు ఎక్కువే. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అధికారం తమ చేతికి చిక్కినట్టే అన్న ఆనందంలో ఉన్న కరుణానిధికి చివరకు మిగిలింది నిరాశే. బలమైన ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం కొంత మేరకు ఊరటే. అయితే, డీఎంకేలో అసలు వార్ ఎన్నికల అనంతరం చాపకింద నీరులా సాగుతూ వస్తున్నట్టు ప్రచారం. డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన దళపతి స్టాలిన్ మధ్య ఈ వార్ అన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పరిస్థితులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టాలిన్‌ను సీఎం అభ్యర్థిగా కరుణానిధి ప్రకటించి ఉంటే, అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లం అంటూ పలువురు పార్టీ నేతలు పెదవి విప్పడం ఈ వార్‌కు ఆజ్యం పోసినట్టు సమాచారం. పైకి కరుణానిధి మీద పార్టీ వర్గాలు అభిమానం, గౌరవం చూపిస్తూ వస్తున్నా, తమ పూర్తి భక్తిని మాత్రం స్టాలిన్ మీద చాటుకునే పనిలో మెజారిటీ శాతం మంది ఉన్నారని చెప్పవచ్చు. కరుణానిధి చెంతకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం, ఎవరైనా సరే స్టాలిన్‌ను కలవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి డీఎంకేలో మారింది. రోజురోజుకు స్టాలిన్ దూకుడు పెంచడంతో కరుణానిధి నాలుగు గోడల మధ్య పరిమితం అవుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ దూకుడుకు కల్లెం వేయాలంటే మళ్లీ అన్నయ్యను రంగంలోకి దించాల్సిందే అన్న నిర్ణయానికి కరుణానిధి వచ్చినట్టుగా సమాచారం. దీంతో కరుణానిధి తరఫున దూత అళగిరితో మంతనాల్లో ఉన్నారు. తండ్రి ఆశీస్సుల్ని అందుకుని పార్టీలోకి మళ్లీ వచ్చేందుకు తగ్గ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలని ఆ దూత అళగిరికి సూచించినట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. కరుణానిధి నుంచి వచ్చిన దూత సూచనల్ని పాటించేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నా, పార్టీ వ్యవహారాలన్నింటినీ పరోక్షంగా తన చేతిలోకి స్టాలిన్ తీసుకుని ఉండడం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాలు డీఎంకే బ్రదర్స్ మధ్య మరో మారు రాజకీయ సమరం రసకందాయంగా సాగే అవకాశాలు ఎక్కువే. అయితే, డీఎంకే వర్గాలు మాత్రం, ఇక అళగిరిని ఆహ్వానించే ప్రసక్తే లేదని, ఇక అంతా స్టాలిన్ హవా అన్నట్టుగా స్పందిస్తుండడం గమనార్హం. -
'మన కోసం మనం'.. ఓ కామెడి ప్రోగ్రామ్!
చెన్నై: వారసత్వపోరులో తమ్ముడి చేతిలో ఓడి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన డీఎంకే పార్టీ మాజీ నేత, తమిళనాడు మాజీ సీఎం పెద్ద కుమారుడు అళగిరి మరోసారి నిరసన గళం వినిపించారు. తన సోదరుడు ఎం.కె. స్టాలిన్ ఇటీవలే చేపట్టిన 'మన కోసం మనం' కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆ కార్యక్రమం ఓ కామెడీ ప్రోగ్రామ్. దానివల్ల డీఎంకేకి ఎలాంటి ఉపయోగం ఉండదు' అని ఆదివారం చెన్నైలో విలేకరులతో అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకుగానూ స్టాలిన్.. నమక్కు నామే విదియాల్ మీట్పు పయనం (మన కోసం మనమే: ఓటమి నుంచి విజయం వైపు పయనం) పేరుతో గత నెల చివరి వారం నుంచి యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ప్రాధాన్యత సంతరించుకున్న కనిమొళి, అళగిరి భేటి!
చెన్నై: రాజ్యసభ ఎంపీ, సోదరి కనిమొళితో బహిషృత డీఎంకే నేత అళగిరి భేటి అయ్యారు. ప్రచారం కోసం తన తండ్రి కరుణానిధి చెన్నైకి దూరంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. తన వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కనిమొళి అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్న క్రమంలో అళగిరి కలవడం ప్రాధాన్యత నెలకొంది. టికెట్ల కేటాయింపులో స్టాలిన్ వర్గం పైచేయి సాధించారని కనిమొళి ఆగ్రహంతో ఉన్న తరుణంలో అళగిరి భేటి చర్చనీయాంశమైంది. సీఐటీ కాలనీలోని ఆమె నివాసంలో గంటకు పైగా కనిమొళితో చర్చలు జరిపారు. అయితే సమావేశ వివరాలు బయటకు రాలేదు. -
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
-
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై: డీఎంకేలో వారసత్వ పోరుకు ఆ పార్టీ అధినేత ఎంకె కరుణానిధి చెక్ పెట్టారు. పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై వేటు వేశారు. పార్టీ నుంచి అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించారు. పార్టీ దక్షిణ విభాగ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న అళగిరిని తాత్కాలికంగా సస్పెండ్ చే డీఎంకే ప్రధాన కార్యదర్శి కె అంబళగన్ తెలిపారు. పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా, డీఎండీకే అధినేత విజయకాంత్ శైలిని తప్పుబడుతూ అళగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. దీనిపై కరుణానిధి తీవ్రంగా స్పందించారు. పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆళగిరిపై డీఎంకె క్రమశిక్షణ చర్య తీసుకుంది. -
కరుణానిధితో ఆళగిరి భేటీ
చెన్నై: డీఎండీకేతో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఎం.కె. అళగిరి తన తండ్రి ఎం. కరుణానిధిని కలిశారు. దాదాపు అరగంట పాటు తండ్రితో మంతనాలు జరిపారు. అయితే భేటీ వివరాలు బయటకు వెల్లడికాలేదు. బయటకు వచ్చిన తర్వాత అళగిరి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. బహిష్కరించాల్సి ఉంటుందని తన తండ్రి హెచ్చరించిన నేపథ్యంలో కరుణానిధిని ఆళగిరి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న అంశానికి వ్యతిరేకంగా ఆళగిరి వ్యాఖ్యలే చేయడంతో ఆయనపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు.