హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ.. | Dakshin Bharat Hindi Prachar Sabha spreads Hindi language along southern states | Sakshi
Sakshi News home page

హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ..

Published Thu, Sep 10 2015 3:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ..

హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ..

దక్షిణ భారత హిందీ ప్రచారసభ...
ఎంతోమందికి హిందీ భాషను అందచేసిన సంస్థ...
త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న సంస్థ...

గురువారం నుంచి హిందీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి దక్షిణ భారత హిందీ ప్రచారసభ గురించి తెలుసుకుందాం..
మద్రాసు ప్రావిన్స్... ఒకనాడు దక్షిణాది వారంతా ఉన్న ప్రాంతం. ఉత్తరాదిలో హిందీ భాషను విస్తృతంగా మాట్లాడతారు. ఆ సమయంలో స్వాతంత్య్ర పోరాటం ఉద్ధృతంగా జరుగుతోంది. ఉత్తరాది వారితో కలిసి, దక్షిణాది వారు కూడా ఉద్యమంలో పాల్గొనాలంటే ఒకే భాష ఆవశ్యకత ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో హిందీ భాషను ప్రచారం చేసే లక్ష్యంతో మాత్రమే ఈ సభను 1918లో మద్రాసులో మహాత్మాగాంధీ స్థాపించారు. గాంధీజీ తన తుదిశ్వాస వరకు దక్షిణ భారత హిందీప్రచార సభకు అధ్యక్షులుగా కొనసాగారు. ఈ సభకు మొట్టమొదటి ప్రచారకులుగా గాంధీజీ కుమారుడైన దేవదాస్ గాంధీ వ్యవహరించారు. మొట్టమొదటి హిందీపాఠాన్ని గాంధీయే చెప్పారు. క్రమంగా హిందీ శిక్షణ పాఠశాలలను ఆంధ్ర తమిళనాడు ప్రాంతాలకు విస్తరించారు.

ఉద్యమం ఏకభాష ప్రాతిపదికగా నడపడానికే జాతీయభాషగా హిందీ ప్రచారం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని, ఆంగ్లేయులను సులువుగా తరిమిగొట్టగలమని నాటి జాతీయ నాయకులు భావించారు. స్థానిక నాయకులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం వల్ల హిందీప్రచారం మరింత విస్తృతంగా జరుగుతుందని గాంధీజీ భావించారు. అందులో భాగంగానే హిందీ ప్రచార ఉద్యమం గోఖలే అధ్యక్షతన అనిబిసెంట్ ప్రారంభించారు. 1920 వరకు ఈ కార్యాలయం మద్రాసులోని జార్జ్‌టౌన్‌లో ఉంది. ఆ తర్వాత కొంత కాలానికి మైలాపూర్, అక్కడ నుంచి ట్రిప్లికేన్‌కి మారింది. నాటి నుంచి 1936 వరకు ఈ సభ ఆ ప్రాంతంలోనే ఉంది.

1936 లో ఈ శాఖలను విస్తరించి, ఉద్యమ తీవ్రతను పెంచాలని భావించారు ఉద్యమ నాయకులు. అప్పుడే ఈ సభను ట్రిప్లికేన్ నుంచి టి.నగర్‌లోని తణికాచలం రోడ్డులోని, ఏడు ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతంలోకి తరలించారు. ఈ భవనానికి జనాబ్ అబ్దుల్ హమీద్‌ఖాన్ శంకుస్థాపన రాయి వేశారు. సరిగ్గా అక్టోబరు 7, 1936 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి అధ్యక్షులుగా ఉన్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
ఈ సభలో1922 నుంచి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ స్థాయిలో రాష్ట్రభాష విశారద పరీక్షను నిర్వహించి, 1931లో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా కాలేకర్ ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1946లో ఈ సభ రజతోత్సవం చేసుకుంది. ఈ ఉత్సవాలకు గాంధీజీ అధ్యక్షత వహించారు. గాంధీజీ విచ్చేయడాన్ని చారిత్రాత్మకంగా భావించి, ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం, ఆయన ప్రసంగించిన ప్రాంతంలో గాంధీ మంటపం నిర్మించాలని తలచారు. అనుకున్నట్లుగానే జూన్ 9, 1963 నాటికి గాంధీ మంటప నిర్మాణం పూర్తయింది. ఆ మంటపాన్ని మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. 'గాంధీ పదవిదాన్'  మంటపం నగరంలో ఒక చిహ్నంగా నిలిచింది. గాంధీమహాత్మునికి సంబంధించిన కార్యక్రమాలను, స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నేటికీ ఇక్కడే నిర్వహిస్తున్నారు.

1993లో, దేశప్రధాని, ప్రచార సభ అధ్యక్షులు అయిన పి.వి.నరసింహారావు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను అమృతోత్సవాలుగా న్యూఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా జరిపారు. 80 మంది ప్రారంభమైన ఈ సంస్థలో రెండేళ్లకే వేలకొలదీ విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 6000 కేంద్రాలలో 7000 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణభారత హిందీ ప్రచార సభ శతసంవత్సరానికి పరుగులు తీస్తోంది.

దక్షిణ భారత హిందీ ప్రచార సభకు అధ్యక్షులుగా వ్యవహరించినవారు...
1918 - 1948    గాంధీ
1948 - 1965    బాబూ రాజేంద్రప్రసాద్
1965 - 1966    లాల్‌బహదూర్ శాస్త్రి
1966 - 1984    ఇందిరాగాంధీ
1984 - 1991    రాజీవ్ గాంధీ
1991 - 1997    పి.వి.నరసింహారావు
1997 - 1998    డా.బి.డి.జెట్టి
1998 - 2001    ఆర్.వెంకట్రామన్
2001 - 2003    జస్టిస్ రంగనాథ్ మిశ్రా
2003 - 2005    ఎం. మహదేవ్
2005 - 2009    ఎం.వి.రాజశేఖరన్
ప్రస్తుతం         డా. జస్టిస్ వి.ఎస్.మలిమథ్                


- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement