హిందీ ఆధిపత్యం ప్రమాదకరం | Kancha Ilaiah Article On Hindi Language Domination | Sakshi
Sakshi News home page

హిందీ ఆధిపత్యం ప్రమాదకరం

Published Wed, Sep 25 2019 12:25 AM | Last Updated on Wed, Sep 25 2019 12:25 AM

Kancha Ilaiah Article On Hindi Language Domination - Sakshi

కొన్ని వారాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే సిలికాన్‌ వ్యాలీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో నేను ఉపన్యాసాలు ఇస్తూ గడిపాను. ఇది ప్రపంచ ఐటీ హబ్‌ అనీ, గత కొంతకాలంగా అపెల్‌ ఫోన్, గూగుల్‌ తదితర అత్యంత ప్రముఖ సంస్థల ఆవిష్కరణలకు కేంద్రమనీ మనందరికీ తెలుసు. ఇంటర్నెట్‌ విప్లవానికి దారితీసిన ఎలెక్ట్రానిక్స్‌ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. 

సిలికాన్‌ వ్యాలీలోని ఐటీ, ఎలెక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌కి సంబంధిం చిన వివిధ రంగాల్లో దక్షిణ భారతీయులు ఉత్తర భారతీయుల కంటే అధికంగా ఉన్నారు. ప్రముఖ ఐటీ, ఎలెక్ట్రానిక్‌ కంపెనీల్లో హిందీ కౌ–బెల్ట్‌ (హిందీ భాషా ప్రాంతం) అని చెబుతున్న ఉత్తర భారతీయుల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అమెరికాలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఇద్దరు అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ దక్షిణ భారతదేశం నుంచే వచ్చారు. ఎందుకు? హిందీ వల్ల కాకుండా ఇంగ్లిష్‌ వల్లే ఇది సాధ్యమైంది. 

దక్షిణ భారతీయులు తమ ప్రాంతీయ భాషలైన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇంగ్లిష్‌ని ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుంటారు.  ఇ.వి. రామస్వామి నాయకర్‌ ప్రారంభించిన హిందీ వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం వల్ల తమిళనాడులో హిందీని పూర్తిగా త్యజించి ప్రధానంగా రెండు భాషలనే నేర్చుకోవడం మొదలైంది.

కేరళలో అధిక సంఖ్యలో క్రిస్టియన్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలున్న కారణంగా హిందీని తోసిపుచ్చి ఇంగ్లిష్‌ మీడియంనే ముందుకు తీసుకుపోయే తనదైన మోడల్‌ని అభివృద్ధి పర్చుకున్నారు. ఇక తమిళనాడు, కేరళ నమూనాలతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కూడా ప్రభావితమయ్యాయి. భారతదేశంలో మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్, భారతదేశ మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ కేరళ నుంచే వచ్చారు. వారు ఏదో ఆయాచితంగా ఎన్నికైన వారు కాదు. అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి ముందే వారు ఎంతో పేరు పొందారు. ఎందుకు? హిందీ వల్ల కాదు కానీ ఇంగ్లిష్‌ వల్లే అది సాధ్యమైంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టడానికి కొత్త ముందడుగు వేశారు. ఉత్తర భారత ముఖ్యమంత్రి ఎవరూ ఈ సాహసానికి పాల్ప డలేరు. గుజరాత్‌లో ఇంగ్లిష్‌ విద్యా స్థాయిలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏ ఉత్తర భారతీయ రాష్ట్రం కంటే ప్రత్యేకించి హిందీ ప్రాంతం కంటే దక్షిణ భారత్‌లో విద్యాభివృద్ధి నమూనాలు అత్యున్నత స్థాయిలో ఉంటున్నాయి.

భారతీయ గిరిజనులలో ఈశాన్య భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంగ్లిష్‌ మీడియం కారణంగా అక్కడి యువత అత్యుత్తమ విద్యా సంస్థల్లో ప్రవేశించారు. ఇంగ్లిష్‌ వారి ప్రధాన బోధనా భాషగా కొనసాగినట్లయితే, వచ్చే కొన్ని దశాబ్దాల్లో వీరు అనేక రంగాల్లో ఆధిపత్యం చలాయించబోతున్నారు. ఈశాన్య ప్రాంతంలో ఈ అభివృద్ధిపట్ల ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అక్కడ హిందీని రుద్దితే రాజకీయంగా వీరి పని ముగిసిపోతుంది.

ఇప్పుడు అమిత్‌ షా, బీజేపీ/ఆరెస్సెస్‌ ప్రభుత్వం కాలాన్ని వెనక్కు తిప్పి దక్షిణ భారత్‌లో, ఈశాన్య ప్రాంతంలో తదితర ప్రాంతంలో హిందీని ప్రోత్సహించడానికి ప్లాన్‌ చేస్తోంది. ఇంగ్లిష్‌ను భారతదేశం నుంచి మెల్లమెల్లగా నిర్మూలించాలని చూస్తున్నారు. హిందీ ప్రాంతంలోని విద్యా స్థాయిలు, ప్రమాణాలకు మొత్తం భారతదేశాన్ని తీసుకుపోవాలన్నదే వీరి లక్ష్యం. ఒకసారి దక్షిణ భారత్, ఈశాన్య ప్రాంతం హిందీ ప్రాంతంగా మారిపోయిన తర్వాత, హిందు–హిందీ రాష్ట్రాన్ని (దేశం) నెలకొల్పాలనే తమ లక్ష్యాన్ని చేరుకున్న్టట్లు ప్రకటించాలన్నది వారి కోరిక.

హిందూ–హిందీ–హిందూస్తాన్‌ జాతిని నెలకొల్పాలనీ, దేశం పేరును ఇండియా అనే భారత్‌నుంచి (రాజ్యాంగ పీఠికలో ఇలాగే ఉన్నందువల్ల) హిందూస్తాన్‌గా మార్చాలని బీజేపీ/ఆరెస్సెస్‌ పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యం అందరికీ తెలిసిందే. ఈ నేలకు హిందూస్థాన్‌ అనే పేరు పెట్టింది ముస్లిం పాలకులు. దీన్ని మతరాజ్యంగా మార్చాలనే వారు ఆ పేరు పెట్టాలనుకుంటున్నారు. ఈ మొత్తం పథకంలో పాకిస్తాన్‌ను ఒక నమూనాగా చూపెడుతూ ముస్లిం దేశాలతో పోటీపడటమే వీరి డైరెక్షన్‌. యూరప్, అమెరికాతో ప్రపంచ స్థాయిలో స్పర్థాత్మక స్ఫూర్తిలో చాలా ముందంజలో ఉన్న చైనాతో లేక దక్షిణాఫ్రికాతో పోటీ పడటం వీరి ఉద్దేశం కాదు. మన దక్షిణభారత్‌ తరహాలో ఇంగ్లిష్‌ నేర్చుకోవడమే చైనా, దక్షిణాఫ్రికాల ప్రస్తుత లక్ష్యంగా ఉంది. 

ఆధునికీకరణకు అలాగే అధునికానంతర దశకు ప్రధాన లింక్‌ భాషే. ఆఫ్రికాలోని ఫ్రెంచ్‌ వలస దేశాలు అభివృద్ధి క్రమంలో ఉన్న స్థానిక భాషల్ని నేర్చుకోవాలని పట్టుబట్టడం లేదు. మాజీ ప్రెంచ్‌ వలసదేశాల్లో చాలావరకు ఫ్రెంచ్‌ నుంచి ఇంగ్లిష్‌పై దృష్టి మళ్లిస్తున్నాయి. ఇంగ్లిష్‌ భాషా కమ్యూనికేషన్, టెక్నో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో ప్రపంచంతో సమ్మిళితం కావడం మూలాన ఈ దేశాల ఆర్థికాభివృద్ధి వేగంగా సాగుతోంది.

భాషాపరంగా, సాంస్కృతిక పరంగా బలపడుతున్న ఈ అంతర్జాతీయ దశను అర్థం చేసుకోవడంలో బీజేపీ/ఆరెస్సెస్‌ నేతలకు ఎలాంటి చిత్తశుద్ధీ లేనట్లుంది. అనేక ప్రాంతాలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్‌ సైతం  హిబ్రూతో పాటు ఇంగ్లిష్‌ విద్యను ప్రోత్సహిస్తూ ఉమ్మడి సాంస్కృతిక మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఇక భారత్‌లో బీజేపీ/ఆరెస్సెస్‌కు పూర్తిగా ఆర్థిక వనరుల్ని సమకూరుస్తున్న పారిశ్రామికవర్గం హిందీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉత్తర భారత్‌లో భాషాపరమైన, సాంస్కృతిక పరమైన వర్గ విభేదాలు దక్షిణభారత్‌ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాదిలో అన్ని తరగతుల ప్రజానీకం తమ ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్‌ను నేర్చుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. అందుకే దక్షిణాదిలో భాషా, సాంస్కృతిక పరమైన అంతరం తగ్గుముఖం పడుతోంది. అదే ఉత్తరాదిలో ఈ అంతరం చాలా ఎక్కువ. అందుకే ఆర్థిక వనరులు, సాంస్కృతిక వనరులకు చెందిన దారిద్య్రం మొరటైన, కఠినమైన రూపంలో సాగుతోంది.

సంపన్నుల పిల్లలకోసం ప్రపంచ స్థాయి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లను నడుపుతున్న అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలను ఉత్తర భారత్‌లో హిందీ మీడియంకు మారాలని అమిత్‌ షా ఒత్తిడి చేయగలరా? ఇక ఉత్తరాది, దక్షిణాది హిందీ మీడియం స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించవలసిందిగా తన పార్టీనేతలను షా ఆదేశించగలరా? దక్షిణ భారత్, ఈశాన్య భారత్‌లో హిందీ నేర్చుకోవాలని చెప్పి ఆయన ఎవరిని వంచించాలని అనుకుంటున్నారు? కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద గ్రామీణ పిల్లలను మాత్రమే ఆయన వంచించగలరు. అందుకే హిందుత్వ శక్తులు ప్రేరేపిస్తున్న భాషాపరమైన సెంటిమెంట్ల పట్ల దళితులు, ఓబీసీలు, చివరకు అగ్రకుల శూద్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఆధునిక నాగరిక, అంతర్జాతీయీకరించిన సంస్కృతులకు అలవాటు పడుతున్నారు. వీరు గనుక ఒకదేశం, ఒక భాష, ఒక సంస్కృతి అనే హిందుత్వ ప్రచార సిద్ధాంతాన్ని మోసినట్లయితే, వీరి పిల్లలు తిరిగి మధ్యయుగాల దారిద్య్రం, అజ్ఞానం, అసమానత్వంలోకి దిగజారిపోవడం తథ్యం.

హిందీ ప్రాంతంలోని జనాలకు దక్షిణ భారత్‌ ప్రజలకూ మధ్య శాస్త్రీయ దృక్పథానికి సంబంధించిన స్థాయిలను అలా పోల్చి చూద్దాం. శా్రస్రీయ చింతనలో దక్షిణ భారత్‌ చాలా ముందంజలో ఉంది. అంటే దక్షిణాదిలో మూఢనమ్మకాలు, అజ్ఞానం, దోపిడీ లేవని అర్థం కాదు. కానీ దక్షిణాదిలో విజ్ఞాన స్థాయిలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం పట్ల నమ్మకం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమిత బృందానికి చెందిన ప్రజలు లేక ఒక చిన్ని ప్రాంతం, లేక ఒక చిన్న జాతి మాట్లాడే భాష మాత్రమే తెలిసి ఉన్న పిల్లలకంటే పదసంపదలో సమృద్ధిని కలిగిన అంతర్జాతీయంగా వ్యక్తీకరించగలిగిన భాషను నేర్చుకున్న పిల్లలు మరింత ఆత్మవిశ్వాసం, విజ్ఞాన స్థాయిలను కలిగి ఉంటారు. 

సామాజిక, ప్రాకృతిక శాస్త్రాల బోధనను బలహీనపర్చడం ద్వారా బీజేపీ/ఆరెస్సెస్‌ ఇప్పటికే మన విశ్వవిద్యాలయాలకు బాగా నష్టం కలిగించాయి. అన్ని జ్ఞానాలకూ మాతృక పౌరాణిక శాస్త్రమే అంటూ వీరు తీసుకొస్తున్న కొత్త సిద్దాంతాన్ని చూసి ఇప్పటికే ప్రపంచంమంతా విరగబడి నవ్వుతోంది. ప్రపంచంలోని అన్ని శాస్త్రీయ ఆవిష్కరణలను మన పురాణగ్రంథాలే చెప్పేశాయని వీరు ప్రకటిస్తారు. కుహనా శాస్త్రవేత్తలను వీరు డీఎన్‌ఏ, పురావస్తు శాస్త్ర నిపుణులుగా నమ్మించాలని చూస్తారు. అంతర్జాతీయ సైంటిస్టులు మానవ వలసల గురించి చేసిన సిద్దాంతాలు అన్నీ తప్పుడువే అని వాదిస్తారు. ఈ చెత్తను శాస్త్ర ప్రపంచం జోక్‌గా పరిగణిస్తోంది. ఇప్పుడు వీరి రాజకీయ నేతలు.. అన్ని భాషలనూ వదిలిపెట్టి హిందీని తప్పక నేర్చుకోవాలని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మాత్రమే భరతఖండం సువర్ణ భూమిగా మారుతుందని అంటున్నారు.

అదృష్టవశాత్తూ దక్షిణ భారతీయులందరూ అమిత్‌ షా ప్రవచించిన హిందీ– హిందూ– హిందూస్తాన్‌ అసంగత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తిరగబడ్డారనుకోండి. మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలంటే, తమిళనాడులాగే ద్విభాషా సూత్రానికే మనం కూడా కట్టుబడి ఉండాలి. మన శాస్త్రీయ దృక్పధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే భారత్‌ మరోసారి చైనా వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వలసగా మారబోదు.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement