సంపాదకీయం
భిన్న భాషా ప్రాంతాలున్న మన దేశంలో ఏదో ఒక భాషను ఆధిపత్య స్థానంలో ప్రతిష్టించబూనుకోవడం సాధ్యపడదు. ఇది పదే పదే రుజువవుతున్నా ఆ బాపతు ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు. ఈమధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసిన రెండు సర్క్యులర్‌లు ఆ కోవలోనివే. సామాజిక మీడియాలో ప్రభుత్వ సమాచార వెల్లడికి హిందీని ఉపయోగించాలని ఒక సర్క్యులర్ సూచించగా...అధికార కార్యకలాపాలన్నీ హిందీలో నెరపే సిబ్బందికి నగదు పారితోషికాలిస్తా మంటూ మరో సర్క్యులర్ ఆశ చూపుతున్నది. ఈ రెండూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే అధికార భాషా విభాగం జారీచేసినవే. హిందీ పేరు చెబితే ఒంటికాలిపై లేచే తమిళనాడే ఈసారి కూడా ఈ సర్క్యులర్‌లను వ్యతిరేకించడంలో అగ్రభాగాన ఉన్నది. ఆ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్రం ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. 1960 ప్రాంతాల్లో హిందీ భాషకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తమిళనాడులో పెల్లుబికిన ఆగ్రహావేశాలు ఎవరూ మరిచిపోలేరు. ఆ ఆందోళన పర్యవసానంగా 1963లో అధికార భాషల చట్టం అమల్లోకి వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతోపాటు ఇంగ్లిష్‌ను కూడా తప్పనిసరిగా వినియోగించాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది.
ఆ చట్టానికి 1967లో మరో సవరణ వచ్చిచేరింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉత్తరప్రత్యుత్త రాలు జరపాలని ఆ సవరణ సూచిస్తున్నది. మన రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు 22 భాషలను జాతీయ భాషలుగా గుర్తించింది. హిందీతోపాటు ఇంగ్లిష్‌ను కూడా అధికార భాషగా పరిగణించింది. భాష విషయంలో మన రాజ్యాంగమూ, చట్టమూ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆ అంశంపై న్యాయంగానైతే వివాదం తలెత్తకూడదు. కానీ అమలుపర్చవలసినవారిలో ఉన్నబండబారిన మనస్తత్వమో, అజ్ఞానమో తెలియదుగానీ... రెండు మూడేళ్లకొకమారు భాషా వివాదం మనకు తప్పడంలేదు. హిందీ భాష వాడకాన్ని పెంచడానికంటూ 2008లో కేంద్రం చేసిన ప్రతిపాదనలను చాలా రాష్ట్రాలు వ్యతిరేకిం చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులు కానివారిని అనర్హులుగా పరిగణించాలని నిర్ణయించారు. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇవి అమల్లోకొస్తే హిందీ భాషా ప్రాంతీ యులు, ఆ మాధ్యమంలో చదివినవారు మాత్రమే లబ్ధిపొందుతారని... మన రాష్ట్రానికి చెందినవారు నష్టపోతారని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఒక భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నంగా మారినప్పుడు ఇతర భాషలు మాట్లాడేవారిలో సహజంగానే ఆ భాషపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అనుమానాలు బయలుదేరతాయి. అది తమ భాషా సంస్కృతులను నాశనం చేస్తుందేమోనన్న భయాందోళనలు కలుగు తాయి. ఈ భయాందోళనలు మనకు స్వాతంత్య్రం రాకముందునుంచీ ఉన్నాయి. జాతీయోద్యమ సమయంలో ఉత్తరాది రాష్ట్రాల నాయకులు హిందీని ‘ఉమ్మడి భాష’గా ప్రకటించాలని భారత జాతీయ కాంగ్రెస్‌లో చేయని ప్రయత్నమంటూ లేదు.
పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వాన కొందరు నేతలు హిందీ అనుకూల తీర్మానం చేయించడానికి ప్రయత్నించినప్పుడు మన రాష్ట్రానికి చెందిన ఎన్ జి రంగావంటివారు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆనాటికి మద్రాసు ప్రెసిడెన్సీగా ఉన్న తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. మనదగ్గర ప్రముఖ కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా హిందీ భాష పెత్తనాన్ని గట్టిగా ప్రశ్నించారు. జాతీయోద్యమంలో పనిచేసేవారు ఈ విషయంలో స్పష్టత సాధించాలని కోరారు. భాషా వివాదానికి ఇంత చరిత్ర ఉన్నప్పుడు, దానితో మెజారిటీ ప్రాంత ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నప్పుడు ఎంత సున్నితంగా వ్యవహరిం చాలో అధికారంలో ఉన్నవారు గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు జారీ అయిన రెండు సర్క్యులర్‌లూ తాము అధికారాన్ని స్వీకరించకముందు జారీ అయ్యాయని ఎన్డీయే ప్రభుత్వం వివరణని చ్చింది. ఇది ఎన్డీయే ప్రభుత్వ నిర్వాకం అనుకోవడంవల్ల కావొచ్చు... కాంగ్రెస్ నేతలు ఈ సర్క్యులర్‌లపై విరుచుకుపడ్డారు. అంటే పాలకు లెవరైనా వారితో ప్రమేయం లేకుండా అధికారులే ఇలాంటి సర్క్యులర్ లు జారీచేస్తున్నారనుకోవాలి. హిందీని ఏకపక్షంగా రుద్దడం తమ అభిమతం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరణనిచ్చారు. ఎప్పటిలాగే ఇంగ్లిష్ అనుసంధాన భాషగా ఉంటుందని హామీ ఇచ్చారు. మన దేశంలో 1,625 భాషలు మాట్లాడేవారున్నారు. మనం హిందీ భాషా ప్రాంతాలుగా చెప్పుకునే చాలా రాష్ట్రాల్లో బ్రజ్‌భాషా, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వి వంటివి ఎన్నో ఉన్నాయి.
వీటన్నిటినీ హిందీ మాండలికాలుగా గుర్తించడంవల్ల హిందీ భాష మాట్లాడేవారి జనాభా మిగిలిన భాషలు మాట్లాడేవారికన్నా అధికంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో వాడే హిందీ జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ మాతృభాషగా కలవారు సైతం ఆరోపిస్తుంటారు. భాష ఉద్దేశమే భావ వినిమయం అయినప్పుడు దాన్ని జటిలం చేయడంలో అర్ధమేముంది? కనుక ముందు సామాన్యులకు అవగతమయ్యే తీరులో హిందీని రాయడమెలాగో సదరు సర్క్యులర్ రచయితలు నేర్చుకోవాలి. అంతేకాదు... ఇతర భాషలనూ, సంస్కృతులనూ, సంప్రదాయాలనూ గౌరవించడం నేర్చుకోవాలి. పెత్తందారీతనంతో, అధికార దర్పంతో మరొకరిపై బలవంతంగా ఏ భాషనైనా రుద్దడానికి ప్రయత్నిస్తే దేశ సమగ్రతకూ, సమైక్యతకూ అది విఘాతం కలిగిస్తుందని గుర్తించాలి.