సర్కారు కళ్లుగప్పి విదేశాలకు తరలిన లక్షల కోట్ల నల్ల డబ్బునంతా వెనక్కు తీసుకురావడంతోపాటు, నల్ల కుబేరులందరినీ చట్టంముందు నిలబెట్టి శిక్షింప జేస్తామని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చేసిన శపథాలన్నీ ఉత్త బోలుమాటలని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించుకుంది. విదేశాల్లో నల్ల ధనం దాచుకున్నవారంటూ ఎనిమిది మంది జాబితాతో సర్వోన్నత న్యాయస్థానం ముందు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ దేశ ప్రజలనే కాదు...బీజేపీ సీనియర్ నేతలను కూడా దిగ్భ్రమపరిచింది. వాస్తవానికి అఫిడవిట్‌లో ఉన్నవి మూడు పేర్లే. వీరిలో ఒకరు డాబర్ సంస్థకు చెందిన మాజీ డెరైక్టర్ ప్రదీప్ బర్మన్‌కాగా, మరొకరు బులియన్ వ్యాపారి పంకజ్ లోధియా, మూడో వ్యక్తి గోవాకు చెందిన వ్యాపారవేత్త రాధా టింబ్లూ, ఆమె సంస్థలోని మరో అయిదుగురు డెరైక్టర్లు. యథాప్రకారం ఈ ముగ్గురూ ఖండనలు కూడా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నారైగా ఉండగా చట్టబద్ధంగానే తాను స్విస్ బ్యాంకు ఖాతా ప్రారంభించానని బర్మన్ సంజాయిషీ ఇస్తే, మిగిలిన ఇద్దరూ ఇందులో తమ పేర్లు ఎందుకొచ్చాయో తెలియడంలేదని అమాయకత్వాన్ని ప్రకటించారు. మొత్తానికి ఈ నల్లడబ్బు వ్యవహారమంతా ‘గజం మిథ్య... పలాయనం మిథ్య’ తరహాలో సాగుతున్నట్టు కనబడుతున్నది.
గుప్తధనంపై ఆదినుంచీ పాలకుల వైఖరి ఒకలాగే ఉన్నది. విపక్షంలో ఉన్నప్పుడు ఏంచెప్పినా అధికార పీఠం ఎక్కేసరికి అందరూ ఒకేలా మాట్లాడు తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా నల్లడబ్బు గురించి ఉపన్యాసాలిచ్చిన బీజేపీ ఇప్పుడు అచ్చం కాంగ్రెస్ భాషను పుణికిపుచ్చుకుని మాట్లాడుతున్నది. ఆనాటి బీజేపీ పాత్రను ఇప్పుడు కాంగ్రెస్ సమర్థవంతంగా పోషిస్తున్నది. కొన్ని దేశాలతో మనకున్న ద్వంద్వ పన్నుల ఎగవేత నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కారణంగా ఆయా దేశాల్లో నల్ల డబ్బు దాచుకున్నవారి పేర్లు వెల్లడించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని వారం క్రితం సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించుకుంది. ఇదేమీ కొత్త వాదన కాదు. రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నల్ల డబ్బుపై శ్వేతపత్రం విడుదలచేస్తూ ఈ మాటే పార్లమెంటులో చెప్పారు. 81 దేశాలతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం ద్వారా, నాలుగు బ్యాంకులతో కుదుర్చుకున్న పన్ను సమాచార బదిలీ ఒప్పందం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టామని, అయితే ఒప్పందాల కారణంగా సమాచారంలోని పేర్లను వెల్లడించడం సాధ్యపడటంలేదని తెలిపారు. నల్లడబ్బు కూడబెట్టడాన్ని కేవలం పన్ను ఎగవేతగా మాత్రమే పరిగణించవద్దని సుప్రీంకోర్టు ఆ కాలంలోనే చెప్పింది. అయినా పాలకులు పదే పదే ఆ దోవనే ఎంచుకుంటున్నారు.
అరుణ్‌జైట్లీ ప్రకటనపై అన్నివైపులనుంచీ దాడి మొదలయ్యేసరికి కేంద్రం పునరాలోచనలో పడినట్టు కనబడింది. ‘తిరుగులేని సాక్ష్యాధారాలున్న’ నల్లధనవంతుల పేర్లన్నీ సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టుకు అందజేస్తామని నాలుగు రోజులనాడు మీడియాకు లీకులిచ్చి అడుగంటిన ఆశలకు ప్రాణప్రతిష్ట చేసింది. తీరా ఇప్పుడు వెల్లడించిన పేర్లు గమనిస్తే అవన్నీ మూడేళ్లక్రితం హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగి ఒకరు ప్రపంచానికి వెల్లడించిన 782 ఖాతాల్లోనివే. తమ వద్ద ఉన్న జాబితాలో యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన నేతతోపాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యులున్నారని అరుణ్‌జైట్లీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్ దరిదాపుల్లో కూడా లేదు. కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్‌కు విదేశీ ఖాతా గురించి ఆరా తీస్తూ ఆదాయం పన్ను విభాగంనుంచి నోటీసు వెళ్లిందని మాత్రం చెబుతున్నారు. మన ప్రభుత్వాలు నల్ల డబ్బు విషయంలో ప్రదర్శిస్తున్న సాచివేత వైఖరివల్ల ఇప్పటికే విదేశీ బ్యాంకుల్లోని 60 శాతం నల్ల డబ్బు రంగు మార్చుకుని ఎటో వెళ్లిపోయింది. ఖాతాదార్లందరికీ మారిన నిబంధనలను వివరించి డబ్బు ఉంచుకుంటారో, పట్టుకెళ్తారో మీ ఇష్టమని స్విస్ బ్యాంకులు తమ ధర్మంగా వర్తమానం పంపించాయి. అంటే మిగిలిన 40 శాతం డబ్బుకూడా అక్కడినుంచి తరలిపోయే ఉంటుంది. స్విస్ బ్యాంకుల్లో 2006నాటికి మొత్తం రూ. 23,373 కోట్ల నల్ల ధనం ఉన్నదని... అది 2010నాటికి రూ. 9,295 కోట్లకు తగ్గిపోయిందని ప్రణబ్ శ్వేతపత్రం ప్రకటించింది. విదేశీ బ్యాంకుల్లో నిరుడు మొత్తంమీద రూ. 14,000 కోట్లు ఉన్నదని తేలిందని ఈమధ్యే ఓ పత్రిక వెల్లడించింది. ఇలా ఇంత సమయమిచ్చి, ఇంత హడావుడిచేసి ఎక్కడివారక్కడ సర్దుకున్నాక మొక్కుబడిగా ప్రకటించిన పేర్లవల్ల ఫలితం ఉంటుందని కేంద్ర ప్రభుత్వమైనా నమ్ముతున్నదా అనే అనుమానం కలుగుతుంది. విదేశీ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల్లో కీలక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారని ఒకపక్క వదంతులు షికార్లు చేస్తుండగా దానిపై స్పష్టతనీయకుండా చేసే ఎలాంటి విన్యాసమైనా ఎవరినీ ఆకట్టుకోదు. ‘పేర్లు వెల్లడిస్తాం... కానీ, దర్యాప్తు పూర్తి కావాలి, చార్జిషీట్లు దాఖలు చేయాలి. అందుకు ఇంకా వ్యవధి కావాలి’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ముగ్గురిపైనా అన్ని లాంఛనాలూ పూర్తయ్యాయి గనుకే వెల్లడించామంటున్నారు. విదేశాలకు తరలివెళ్లిన నల్లడబ్బు ఎఫ్‌డీఐల రూపంలో తిరిగి దేశంలోనికి ప్రవేశిస్తున్నదని... రియల్‌ఎస్టేట్, బంగారం క్రయవిక్రయాల్లో నల్లధనం మూలాలున్నాయని ప్రణబ్ శ్వేతపత్రం చెప్పింది. దానికి సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న నిర్దిష్ట చర్యలేమిటో అరుణ్‌జైట్లీ కూడా చెప్పలేదు. మూడు పేర్ల వెల్లడికే ఇంత సమయం తీసుకుంటే, ఈ తరహా చర్యలకు ఇంకెంత కాలం పడుతుందో ఊహకందని విషయం. ఇప్పటికైనా ఎన్డీయే సర్కారు దేశ ప్రజలకు వాస్తవాలేమిటో వివరించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
నల్లధనంపై ఎందుకీ దాపరికం?
Published Tue, Oct 28 2014 12:53 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement