సంపాదకీయం
నిరంతరాయంగా సాగే బేతాళ కథలా నల్లడబ్బు తరచు వార్తల్లోకెక్కడం... అటు తర్వాత మౌనంగా తెరమరుగు కావడం దేశ పౌరులకు అలవాటైపోయింది. నల్లడబ్బును వెనక్కు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైన తీరుపై సుప్రీంకోర్టు బుధవారం నిలదీయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2009 ఎన్నికల్లో నల్లడబ్బును బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. అధికారంలోకొచ్చిన వెంటనే దాన్ని వెనక్కుతెస్తామని అద్వానీ అప్పట్లో చెప్పారు.
అందుకు పోటీగా కాంగ్రెస్ కూడా అలాంటి హామీయే ఇచ్చింది. వందరోజుల్లో దాని అంతుచూస్తామన్నది. తీరా రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ముందుంచిన శ్వేతపత్రం చూసి అందరూ నీరుగారిపోయారు. 97 పేజీల ఆ శ్వేతపత్రంలో అందరికీ తెలిసిన వివరాలను ఒకచోట గుదిగుచ్చడం తప్ప అదనపు సమాచారమేదీ లేదు. పైగా తాము 81 దేశాలతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదర్చుకున్నామని, నాలుగు విదేశీ బ్యాంకులతో పన్ను సమాచార బదిలీ ఒప్పందం ద్వారా ఎంతో సమాచారాన్ని సేకరించామని అప్పట్లో కేంద్రం చెప్పింది. నల్ల డబ్బు తరలింపును కేవలం పన్నుల ఎగవేత వ్యవహారంగా చూడవద్దని, ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసే జాతిద్రోహంగా పరిగణించాలని సుప్రీంకోర్టు అప్పటికే చెప్పివున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం తన దోవన తాను పోయింది.
అసలు నల్ల డబ్బు గురించిన అంచనాలే సరిగా లేవు. అది రూ. 75 లక్షల కోట్లని అద్వానీ చెబితే... 2006 నాటికి స్విస్ బ్యాంకుల్లో ఉన్నది రూ. 23,373 కోట్లని సర్కారీ శ్వేతపత్రం చెప్పుకొచ్చింది. మూడేళ్లక్రితం సీబీఐ డెరైక్టర్ మాట్లాడుతూ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బు రూ. 30 లక్షల కోట్లని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంటే నల్లడబ్బుపై ప్రభుత్వానికే సరైన అంచనాలు లేవు. ఇవన్నీ గమనించాకే నల్లడబ్బును వెనక్కి తేలేకపోయిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. 2011లో సర్వోన్నత న్యాయస్థానం నల్లడబ్బు విషయంలో మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇన్నాళ్లుగా మీరు చేసిందేమిటి...ఒక నివేదిక సమర్పించడం తప్ప. ఆ డబ్బు వెనక్కి తెచ్చివుంటే సామాన్యులపై 30 శాతం పన్ను భారం తగ్గేది’ అని వ్యాఖ్యానించింది. పాలకుల వైఫల్యంవల్లే తాము సిట్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది.
అసలు కేంద్ర ప్రభుత్వం చేసిందేమిటి? స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న నల్ల ధనవంతుల వివరాలివ్వమని స్విట్జర్లాండ్‌ను ఇన్నాళ్లుగా కోరుతున్నా అది వినిపించుకోవడంలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఇప్పుడు చెబుతున్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే జీ-20వంటి వేదికల్లో ఫిర్యాదుచేస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. స్విస్ ఆర్ధికమంత్రికి తాజాగా ఒక ఉత్తరం రాసి బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందన్న 2009 నాటి జీ-20 డిక్లరేషన్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. ఏతా వాతా తేలిందేమంటే యూపీఏ సర్కారు ఇన్నేళ్లుగా చేసింది ఓ ఉత్తరం ముక్క రాయడమన్నమాట! అది కూడా అధికారం మెట్లు దిగే సమయం ఆసన్నమయ్యాక! నల్ల ధనవంతుల వివరాలు వెల్లడించడానికి తమ చట్టాలు అనుమతించడం లేదని, వాటిని త్వరలోనే సవరించి సమాచారం ఇస్తామని స్విస్ సర్కారు 2011లో మన దేశానికి హామీ ఇచ్చింది. ఏమైందో ఏమో ఆ చట్టాలను సవరించడంగానీ, వివరాలివ్వడంగానీ జరగలేదు. అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాలు కొరియా వంటి చిన్నదేశాలూ స్విట్జర్లాండ్‌ను గట్టిగా హెచ్చరించి తమ దోవకు తెచ్చుకోగలిగాయి.
నల్ల డబ్బు దాచినవారి పనిబట్టాయి. మనకు మాత్రం చట్టాలని, నిబంధనలని స్విట్జర్లాండ్ ఏవేవో కబుర్లు చెబుతోంది. వారికి వివరాలు ఎలా ఇవ్వగలిగారని మన దేశం ఏనాడూ నిలదీయలేదు. తమ దేశంలో 2012 నాటికి భారతీయులు దాచుకున్న సొమ్ము రూ. 9,000 కోట్లని, నిరుడు మార్చి ఆఖరుకు అది రూ. 14,000 కోట్లకు చేరుకున్నదని ఈ నెల మొదట్లో స్విస్ నేషనల్ బ్యాంకు తెలిపింది. నిజానికి నల్లడబ్బు ఒక్క స్విస్ బ్యాంకుల్లోనే ఉండిపోలేదు. అది దుబాయ్, సింగపూర్, మారిషస్‌వంటి దేశాలకు తరలిపోయింది. మన దేశానికి స్విట్జర్లాండ్‌ను ఒప్పించడమే సాధ్యం కాలేదు. ఇక ఈ దేశాలను అడిగేదెప్పుడు? అవి ఇచ్చేదె ప్పుడు?
ఆర్ధిక నేరాలు, పన్ను ఎగవేతలు, అవినీతివల్ల అత్యధికంగా నల్లడబ్బు తరలిపోయిన దేశాల జాబితాలో భారత్ తొలి పది స్థానాల్లో ఉన్నదని రెండేళ్లక్రితం గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ అధ్యయనం వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ సంస్థ నిరుడు వెల్లడించిన నివేదిక ప్రకారం నల్లడబ్బు వాటా దేశ స్థూల దేశీయోత్పత్తిలో పది శాతంపైనే. ఇలా నల్లడబ్బు పాపం పెరుగుతున్నట్టు పెరుగుతూ పోతుంటే ప్రభుత్వం తన కర్తవ్యమేమిటో మరిచింది. పైగా సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ను రద్దు చేయాలని విన్నవించింది. నల్లడబ్బు కారణంగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ అనేకానేక రుగ్మతలను ఎదుర్కొంటున్నది. ఆర్ధిక మాంద్యంతో రాబడులు తరిగిపోయి బడ్జెట్ అంచనాలు తల్లకిందులవుతున్నాయి. సామాజిక సంక్షేమ పథకాలకు డబ్బు లేదని ప్రతియేటా సర్కారు కోతలకు దిగుతోంది. ఇందువల్ల గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంవంటి శాఖలకే కాదు...దేశ రక్షణకు కూడా చాలినన్ని నిధులు లభించడంలేదు. నల్లడబ్బు కారణంగా పరిస్థితి ఇంత అధ్వాన్న స్థితికి చేరుకున్నదని తెలిసినా పాలకులు పట్టనట్టు ఉన్నారంటే దాన్ని అరాచకమనలా? చేతగానితనమనాలా?