bethala stories
-
పట్టువదలని విక్రమార్కుడు.. రుజువుకాని నేరం
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా.. నువు ఏ నీతి, నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదుగాని, ఈ లోకంలో నీతి జయిస్తుందనీ, అవినీతికి శిక్ష ఉంటుందనీ చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమతెలియకుండా విను’అంటూ ఇలా చెప్పసాగాడు.. చాలాకాలం కిందట హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడూ, జమీందారుకు విశ్వాసపాత్రుడూనూ. అతని ప్రతి సలహానూ జమీందారు మారుమాటాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్లు పెరిగాయి. వాటితోబాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకేరకం సహాయం ఇద్దరు, ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్లబుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్లబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్లబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడచివస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడిపూజారి ఉద్యోగమే గానీ బడిపంతులు ఉద్యోగమేగానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రానురాను గిరిధరుడి భార్య మెడనిండా మోయలేనంత బంగారమూ, ఇంటి నిండా అంతులేని వస్తుసామాగ్రీ ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాదు జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలుగల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు. వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు గలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు. కాని ఒక్క పళ్లబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కారబాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి, శేషగిరికి ఒళ్లు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్లి ‘మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెట్టితే చాలు ఎలాటి పనికిమాలిన వాడికైనా పని దొరుకుతున్నది. చదువూ, తెలివీ ఉన్న పేదలు నీరుకారిపోతున్నారు’ అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి, తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు ‘నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను’ అని చెప్పి అతణ్ణి పంపేశాడు. తరవాత జమీందారు యాయవారం బ్రాహ్మణ్ణి ఒకణ్ణి పట్టుకుని ‘ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు. ఈ నూరు రూపాయల సంచీ తీసుకుని ఆ ఊళ్లో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని చెప్పి పంపించేశాడు. పూజలు చేయించటంలో చాలాకాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి ‘నువు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని అతణ్ణి కూడా పంపేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయవారపు బ్రాహ్మడు రూపాయల సంచీ పట్టుకు కూర్చున్నాడు. అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటంవల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతను వచ్చిన పని తెలుసుకుని ‘ఈ గుడి మన జమీందారుగారు కట్టించినదే. నీ వంటి అనుభవంగలవాణ్ణి పూజారిగా నియమించటానికి జమీందారుగారు ఎందుకు అభ్యంతరం చెబుతారు?’ అన్నాడు. యాయవారపు బ్రాహ్మడు కూడా అదే పనికోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ‘ఏమీరాని నీకు పూజారి పని ఏమిటి? వెళ్లవోయ్’ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడిపూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట, జమీందారు శేషగిరికి కబురుపెట్టి ‘నేను గిరిధరుడికి పరీక్ష పెట్టిచూశాను. అతను లంచగొండి అని రుజువుకాలేదు’ అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకుపడి ‘అతను లంచగొండి అనటానికి వేరే పరీక్షకావాలాండీ? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి! సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి! మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారమూ, అన్ని సామాన్లూ కొనలేడని మీకే తెలుస్తుంది’ అన్నాడు. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పాపెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి ‘మా ఊళ్లో మంచిపొలం అమ్మకానికి వచ్చింది. కొందామంటే నా వద్ద డబ్బులేదు. నువ్వయినా కొనుక్కో! చాలా మంచి బేరం’ అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి ‘ఈ నగలు తాకట్టుపెట్టి పొలం కొనుక్కో. తరవాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్టు విడిపించుకోవచ్చు’ అన్నాడు. అదేసమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ల అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు. అలాటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారుపడుతూ ‘అయ్యో కూర్చోవటానికి సరి అయిన కుర్చీ కూడా లేదు’ అని ఒక జంపఖానా పరచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీటవేశాడు. గిరిధరుడి భార్య ‘ఒక వెండి గ్లాసయినా లేదు’ అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలుపోసి పళ్లెంలో కొన్ని పళ్లుతెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపుతాడు తప్పలేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురుమంటున్నది. ‘నా గురించి ఏమీ హైరానా పడవద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి, పలకరించి పోదామని తొంగి చూశాను’ అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ ‘పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపొయ్యారా? మీరు రావలసిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలయింది’ అని డబ్బు సంచీ తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపుస్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటంచేత జమీందారు ‘ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో. లెక్కలు తరవాత తీరికగా చూసుకోవచ్చు’ అని డబ్బు సంచీ తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయాడు. తరవాత ఆయన శేషగిరిని పిలిపించి ‘నువు చెప్పినది ఒకటీ రుజువుకాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది. అతని భార్య మెడలో పుస్తెలకు పసుపుతాడు తప్పలేదు. అతని మీద ఇలాటి అభాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్విక వెళ్లవచ్చు’ అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాటి పరిస్థితి ఎందుకు ఏర్పడినదీ శేషగిరి ఊహకు అందలేదు. ‘అతణ్ణి దేవుడే కాపాడుతూ ఉండాలి. లేకపోతే అతనిలాటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను’ అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి ‘రాజా.. దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటివాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసీ చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది’అన్నాడు. దానికి విక్రమార్కుడు ‘ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదనటంలో సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాటివారి అవినీతికి శిక్ష.. సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పుకాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదనీ, అతనికి కానుకలు ఇచ్చినవారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారనీ స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయపడేవాడు. అంతేగానీ ఇతరులను పీడించేవాడు కాడు. డబ్బుల్లేని బావమరిదికి పొలం కొనుక్కునేందుకు తన భార్య ఒంటి మీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడూ, శిక్షార్హుడూ కాడు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంతమాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారెయ్యక రెండు పరీక్షలకు అతణ్ణి గురిచేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతణ్ణి శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే గిరిధరుడు ఎవరికిగానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి’ అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. (బేతాళ కథలు.. చందమామ, 1980, జనవరి సంచిక నుంచి) సేకరణ: అనిల్ బత్తుల -
దోదో!
‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘ఈ ఎండల్లో కొచ్చెన్ ఏం అడుగుతానుగానీ...నువ్వు విన్నవి కన్నవి చల్లని రెండు జోక్‌లు చెప్పు చాలు’’ అన్నాడు నీరసంగా భేతాళుడు. ‘‘ఓకే’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు: అనగనగా ఒక మగదోమ, ఒక ఆడదోమ. మగదోమ రెండు వారాల పాటు ఏదో పని మీద బిహార్ వెళ్లి వచ్చింది. ‘‘ఎలా ఉన్నావు డియర్!’’ అడిగింది ఆడదోమ. ‘‘నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టు....నీకోసం ఏమైనా చేస్తాను. సింహాన్ని వేటాడి తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘సరేలే’’ అన్నది తేలికగా ఆడదోమ. ‘‘సరేలే కాదు. నిన్ను నా భుజాల రెక్కలపై కూర్చోబెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏడ్చినట్టే ఉంది’’ అన్నది ఆడదోమ. ‘‘ఏడ్చినట్లే ఉండడం కాదు...ప్రియా! స్వర్గాన్ని నీ కోసం ఆన్లైన్లో తెప్పిస్తాను’’ ‘‘సరేలేగానీ....కాస్త రెస్ట్ తీసుకోండి...ప్రయాణ బడలికతో వచ్చారు’’ అన్నది ఆడదోమ. ‘‘రెస్ట్ సంగతి సరే...ఆ ఎవరెస్ట్‌ను నీ పాదాల దగ్గర తెల్లకుక్క పిల్లలా కూర్చోబెడతాను’’ అన్నది మగదోమ. ‘‘ఏమైంది మీకు? ఎందుకు ఇలా కోతలు కోస్తున్నారు?!’’ అని ఆశ్చర్యంగా అడిగింది ఆడదోమ. ‘‘కోతలు కాదు ప్రియా! తాజ్‌మహల్ దగ్గరకు ఎవరైనా వెళతారు. కాని ఆ తాజ్‌మహల్‌నే నీ దగ్గరకు తెస్తాను’’ అన్నది మగదోమ. ‘‘ఇవన్నీ కాదుగానీ నా కోసం ఒకచోటుకి రావాలి’’ గోముగా అడిగింది ఆడదోమ. ‘‘సరే దానిదేముంది!’’ అంటూ ఆడదోమతో పాటు వెళ్లింది మగదోమ. ‘దోమల మానసిక చికిత్స కేంద్రం’ అని బోర్డ్‌పై రాసి ఉన్న హాస్పిటల్లోకి రెండు దోమలు వెళ్లాయి. ‘‘ఇంతకీ ఏమిటి మీ సమస్య?’’ డాక్టర్ దోమ ఆడదోమను అడిగింది. ‘‘సమస్య నాకు కాదు...మా ఆయనకు’’ అన్నది ఆడదోమ. ‘‘చూస్తే దుక్కలా ఉన్నాడు. ఏమిటి సమస్య!’’ అని గోడ కూలినట్లు నవ్వింది డాక్టర్ దోమ. ‘‘మా ఆయన రెండు వారాల పాటు టూరు వెళ్లారండీ. అప్పటి నుంచి చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన తొడకొడుతున్నారు. మీసం మెలేస్తున్నారు. ఒక దగ్గర రెండు దోమలు కనబడితే చాలు ఉపన్యాసమిస్తున్నాడు. ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు....’’ చెప్పుకుంటూ పోయింది ఆడదోమ. డాక్టర్ దోమకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు స్కెతస్కోప్తో తలకొట్టుకొని ఆలోచించింది. ఏమీ స్ఫురించలేదు. లైబ్రరీకి వెళ్లి సీరియస్‌గా బుక్స్ తిరిగేసి నోట్స్ రాసుకొని వచ్చింది. ‘‘అయ్యా! హాస్పిటల్‌కు వచ్చి అరగంటవుతోంది. ఇంతవరకు సమస్య ఏమిటో చెప్పలేదు’’ అసహనంగా అన్నది ఆడదోమ. ‘‘దాని గురించే ఆలోచిస్తున్నాను’’ అని పెన్నును నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచించసాగింది డాక్టర్ దోమ. ‘‘అయ్యా కేసు నన్ను టేకప్ చేయమంటారా?’’ ఆతృతతో అడిగింది కంపౌండర్ దోమ. ‘‘చేసి చావు...’’ అని నిద్రలోకి జారింది డాక్టర్ దోమ. ‘‘ఏమయ్యా ఇలా వచ్చి కూర్చో’’ అని ఆర్డరేసింది కంపౌడర్ దోమ. ‘‘అలాగే’’ అంటూ బుద్ధిగా కూర్చుంది మగదోమ, ‘‘ఏమయ్యా...నీ పేరేమిటి?’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘దోసకొండ దోమప్ప... అందరూ ముద్దుగా దోదో అని పిలుస్తారు’’ అని చెప్పింది మగదోమ. ‘‘చూడు దోదో...ఇప్పుడు నేను నిన్ను ట్రాన్స్‌లోకి తీసుకువెళతాను. ఓకేనా!’’ అడిగింది కంపౌండర్ దోమ. ‘‘ఓకే’’ అన్నది దోదో. ‘‘ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటున్నావు. నీకు చెవులు ఉన్నాయి... కానీ నేను మాట్లాడింది తప్ప ఏ సౌండూ నీకు వినబడడం లేదు. నీకు మైండ్ ఉంది. కానీ నేను చెప్పిందాన్ని గురించి తప్ప దేని గురించి...అది ఆలోచించడం లేదు. వెళుతున్నావు.... లోలోనికి వెళుతున్నావు. నీదైన ప్రపంచంలోకి... ఇప్పుడు చెప్పు...అసలు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?’’ అడిగింది కంపౌడర్ దోమ. ‘‘పని మీద బిహార్‌కు వెళ్లానండి. అక్కడ ఎలక్షన్ హడావిడి కనిపించింది. ఒకరోజు బిహార్‌లో ఒకచోట బాగా ఆకలైంది. ఎటుచూసినా చెట్టుచేమలే తప్ప మనుషుల జాడ కనిపించలేదు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తే వేగంగా అటు వెళ్లాను. అక్కడ ఎన్నికల సభ జరుగుతోంది. నాయకుడు మాంచి జోరుమీద ఉన్నాడు. ‘‘మీ కోసం నా ప్రాణం ఇస్తాను’’ అంటున్నాడు. ‘‘ప్రాణం ఎందుకుగానీ...రక్తం ఇవ్వు చాలు’’ అని వెళ్లి కుట్టాను. దీంతో నా మైండ్ దెబ్బతింది. నేనేమి మాట్లాడుతున్నానో....నాకే తెలియడం లేదు.’’ అని అసలు విషయం చెప్పింది దోదో!! 2 సుబ్బారావు అప్పారావుకు లక్షరూపాయలు అప్పు ఇచ్చాడు. కాని అప్పారావు ‘ఇదిగో అదిగో’ అంటున్నాడే తప్ప అప్పు తీర్చడం లేదు. విసుగెత్తిన సుబ్బారావు ఒక లాయర్ దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. ‘‘అప్పారావుకు లక్ష రూపాయాలు అప్పు ఇచ్చినట్లు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా?’’ అడిగాడు లాయర్. ‘‘లేదు’’ అని భోరుమన్నాడు సుబ్బారావు. ‘‘అయితే ఇలా చెయ్’’ అని సుబ్బారావు చెవిలో ఏదో చెప్పాడు లాయర్. పావుగంటలోనే సుబ్బారావుకు గట్టి సాక్ష్యం దొరికింది. ‘‘భేతాళా! ఈరోజు నేను నిన్ను కొచ్చెన్ అడుగుతాను. ఇంతకీ లాయర్ అతడి చెవిలో ఏం ఊదాడు?’’ అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు చెప్పిన జవాబు: సుబ్బారావు అప్పారావుకు ఫోన్ చేసి...‘‘నీకు అప్పుగా ఇచ్చిన అయిదు లక్షలు నాకు అర్జంటుగా కావాలి’’ అన్నాడు. ‘‘అయిదు లక్షలా...ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు. మతిగానీ పోయిందా’’ మండిపడ్డాడు అప్పారావు. ‘‘నువ్వు ఇలా మరిచిపోతే ఎలా అప్పారావు! అక్షరాల అయిదు లక్షలు ఇచ్చా’’ అన్నాడు సుబ్బారావు. ‘‘నువ్వు నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఇంతకంటే నువ్వు ఒక్క పైసా నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’అన్నాడు అప్పారావు. ‘‘అంటే నువ్వు తీసుకుంది లక్షరూపాయలేనంటావు’’ ‘‘కచ్చితంగా లక్షరూపాయలే’’ ‘ఓకే’అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. అప్పారావు వాయిస్ రికార్డయింది. ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది! – యాకుబ్ పాషా -
ఏన్టీఅర్కి రెండో వెన్నుపోటు ఘట్టం మిస్ అయ్యిందేం?
-
చంద్రబాబు రాజకీయ పొత్తులపై బేతాళ కథ
-
నిజ బేతాళం... నల్లడబ్బు!
సంపాదకీయం నిరంతరాయంగా సాగే బేతాళ కథలా నల్లడబ్బు తరచు వార్తల్లోకెక్కడం... అటు తర్వాత మౌనంగా తెరమరుగు కావడం దేశ పౌరులకు అలవాటైపోయింది. నల్లడబ్బును వెనక్కు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైన తీరుపై సుప్రీంకోర్టు బుధవారం నిలదీయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2009 ఎన్నికల్లో నల్లడబ్బును బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. అధికారంలోకొచ్చిన వెంటనే దాన్ని వెనక్కుతెస్తామని అద్వానీ అప్పట్లో చెప్పారు. అందుకు పోటీగా కాంగ్రెస్ కూడా అలాంటి హామీయే ఇచ్చింది. వందరోజుల్లో దాని అంతుచూస్తామన్నది. తీరా రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ముందుంచిన శ్వేతపత్రం చూసి అందరూ నీరుగారిపోయారు. 97 పేజీల ఆ శ్వేతపత్రంలో అందరికీ తెలిసిన వివరాలను ఒకచోట గుదిగుచ్చడం తప్ప అదనపు సమాచారమేదీ లేదు. పైగా తాము 81 దేశాలతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదర్చుకున్నామని, నాలుగు విదేశీ బ్యాంకులతో పన్ను సమాచార బదిలీ ఒప్పందం ద్వారా ఎంతో సమాచారాన్ని సేకరించామని అప్పట్లో కేంద్రం చెప్పింది. నల్ల డబ్బు తరలింపును కేవలం పన్నుల ఎగవేత వ్యవహారంగా చూడవద్దని, ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసే జాతిద్రోహంగా పరిగణించాలని సుప్రీంకోర్టు అప్పటికే చెప్పివున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం తన దోవన తాను పోయింది. అసలు నల్ల డబ్బు గురించిన అంచనాలే సరిగా లేవు. అది రూ. 75 లక్షల కోట్లని అద్వానీ చెబితే... 2006 నాటికి స్విస్ బ్యాంకుల్లో ఉన్నది రూ. 23,373 కోట్లని సర్కారీ శ్వేతపత్రం చెప్పుకొచ్చింది. మూడేళ్లక్రితం సీబీఐ డెరైక్టర్ మాట్లాడుతూ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బు రూ. 30 లక్షల కోట్లని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంటే నల్లడబ్బుపై ప్రభుత్వానికే సరైన అంచనాలు లేవు. ఇవన్నీ గమనించాకే నల్లడబ్బును వెనక్కి తేలేకపోయిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. 2011లో సర్వోన్నత న్యాయస్థానం నల్లడబ్బు విషయంలో మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇన్నాళ్లుగా మీరు చేసిందేమిటి...ఒక నివేదిక సమర్పించడం తప్ప. ఆ డబ్బు వెనక్కి తెచ్చివుంటే సామాన్యులపై 30 శాతం పన్ను భారం తగ్గేది’ అని వ్యాఖ్యానించింది. పాలకుల వైఫల్యంవల్లే తాము సిట్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. అసలు కేంద్ర ప్రభుత్వం చేసిందేమిటి? స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న నల్ల ధనవంతుల వివరాలివ్వమని స్విట్జర్లాండ్‌ను ఇన్నాళ్లుగా కోరుతున్నా అది వినిపించుకోవడంలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఇప్పుడు చెబుతున్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే జీ-20వంటి వేదికల్లో ఫిర్యాదుచేస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. స్విస్ ఆర్ధికమంత్రికి తాజాగా ఒక ఉత్తరం రాసి బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందన్న 2009 నాటి జీ-20 డిక్లరేషన్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. ఏతా వాతా తేలిందేమంటే యూపీఏ సర్కారు ఇన్నేళ్లుగా చేసింది ఓ ఉత్తరం ముక్క రాయడమన్నమాట! అది కూడా అధికారం మెట్లు దిగే సమయం ఆసన్నమయ్యాక! నల్ల ధనవంతుల వివరాలు వెల్లడించడానికి తమ చట్టాలు అనుమతించడం లేదని, వాటిని త్వరలోనే సవరించి సమాచారం ఇస్తామని స్విస్ సర్కారు 2011లో మన దేశానికి హామీ ఇచ్చింది. ఏమైందో ఏమో ఆ చట్టాలను సవరించడంగానీ, వివరాలివ్వడంగానీ జరగలేదు. అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాలు కొరియా వంటి చిన్నదేశాలూ స్విట్జర్లాండ్‌ను గట్టిగా హెచ్చరించి తమ దోవకు తెచ్చుకోగలిగాయి. నల్ల డబ్బు దాచినవారి పనిబట్టాయి. మనకు మాత్రం చట్టాలని, నిబంధనలని స్విట్జర్లాండ్ ఏవేవో కబుర్లు చెబుతోంది. వారికి వివరాలు ఎలా ఇవ్వగలిగారని మన దేశం ఏనాడూ నిలదీయలేదు. తమ దేశంలో 2012 నాటికి భారతీయులు దాచుకున్న సొమ్ము రూ. 9,000 కోట్లని, నిరుడు మార్చి ఆఖరుకు అది రూ. 14,000 కోట్లకు చేరుకున్నదని ఈ నెల మొదట్లో స్విస్ నేషనల్ బ్యాంకు తెలిపింది. నిజానికి నల్లడబ్బు ఒక్క స్విస్ బ్యాంకుల్లోనే ఉండిపోలేదు. అది దుబాయ్, సింగపూర్, మారిషస్వంటి దేశాలకు తరలిపోయింది. మన దేశానికి స్విట్జర్లాండ్‌ను ఒప్పించడమే సాధ్యం కాలేదు. ఇక ఈ దేశాలను అడిగేదెప్పుడు? అవి ఇచ్చేదె ప్పుడు? ఆర్ధిక నేరాలు, పన్ను ఎగవేతలు, అవినీతివల్ల అత్యధికంగా నల్లడబ్బు తరలిపోయిన దేశాల జాబితాలో భారత్ తొలి పది స్థానాల్లో ఉన్నదని రెండేళ్లక్రితం గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ అధ్యయనం వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ సంస్థ నిరుడు వెల్లడించిన నివేదిక ప్రకారం నల్లడబ్బు వాటా దేశ స్థూల దేశీయోత్పత్తిలో పది శాతంపైనే. ఇలా నల్లడబ్బు పాపం పెరుగుతున్నట్టు పెరుగుతూ పోతుంటే ప్రభుత్వం తన కర్తవ్యమేమిటో మరిచింది. పైగా సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ను రద్దు చేయాలని విన్నవించింది. నల్లడబ్బు కారణంగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ అనేకానేక రుగ్మతలను ఎదుర్కొంటున్నది. ఆర్ధిక మాంద్యంతో రాబడులు తరిగిపోయి బడ్జెట్ అంచనాలు తల్లకిందులవుతున్నాయి. సామాజిక సంక్షేమ పథకాలకు డబ్బు లేదని ప్రతియేటా సర్కారు కోతలకు దిగుతోంది. ఇందువల్ల గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంవంటి శాఖలకే కాదు...దేశ రక్షణకు కూడా చాలినన్ని నిధులు లభించడంలేదు. నల్లడబ్బు కారణంగా పరిస్థితి ఇంత అధ్వాన్న స్థితికి చేరుకున్నదని తెలిసినా పాలకులు పట్టనట్టు ఉన్నారంటే దాన్ని అరాచకమనలా? చేతగానితనమనాలా?