‘‘భేతాళా! ఏమీ మాట్లాడకుండా అలా వడదెబ్బ తగిలినట్టు ఫేసు పెట్టావేమిటీ? క్వశ్చన్ అడుగు’’ అన్నాడు విక్రమార్కుడు.
‘‘ఈ ఎండల్లో కొచ్చెన్ ఏం అడుగుతానుగానీ...నువ్వు విన్నవి కన్నవి చల్లని రెండు జోక్‌లు చెప్పు చాలు’’ అన్నాడు నీరసంగా భేతాళుడు.
‘‘ఓకే’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు:
అనగనగా ఒక మగదోమ, ఒక ఆడదోమ.
మగదోమ రెండు వారాల పాటు ఏదో పని మీద బిహార్ వెళ్లి వచ్చింది.
‘‘ఎలా ఉన్నావు డియర్!’’ అడిగింది ఆడదోమ.
‘‘నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టు....నీకోసం ఏమైనా చేస్తాను. సింహాన్ని వేటాడి తెస్తాను’’ అన్నది మగదోమ.
‘‘సరేలే’’ అన్నది తేలికగా ఆడదోమ.
‘‘సరేలే కాదు. నిన్ను నా భుజాల రెక్కలపై కూర్చోబెట్టుకొని ప్రపంచమంతా తిప్పుతాను’’ అన్నది మగదోమ.
‘‘ఏడ్చినట్టే ఉంది’’ అన్నది ఆడదోమ.
‘‘ఏడ్చినట్లే ఉండడం కాదు...ప్రియా! స్వర్గాన్ని నీ కోసం ఆన్‌లైన్‌లో తెప్పిస్తాను’’
‘‘సరేలేగానీ....కాస్త రెస్ట్ తీసుకోండి...ప్రయాణ బడలికతో వచ్చారు’’ అన్నది ఆడదోమ.
‘‘రెస్ట్ సంగతి సరే...ఆ ఎవరెస్ట్‌ను నీ పాదాల దగ్గర తెల్లకుక్క పిల్లలా కూర్చోబెడతాను’’ అన్నది మగదోమ.
‘‘ఏమైంది మీకు? ఎందుకు ఇలా కోతలు కోస్తున్నారు?!’’ అని ఆశ్చర్యంగా అడిగింది ఆడదోమ.
‘‘కోతలు కాదు ప్రియా! తాజ్‌మహల్ దగ్గరకు ఎవరైనా వెళతారు. కాని ఆ తాజ్‌మహల్‌నే నీ దగ్గరకు తెస్తాను’’ అన్నది మగదోమ.
‘‘ఇవన్నీ కాదుగానీ నా కోసం ఒకచోటుకి రావాలి’’ గోముగా అడిగింది ఆడదోమ.
‘‘సరే దానిదేముంది!’’ అంటూ ఆడదోమతో పాటు వెళ్లింది మగదోమ.
‘దోమల మానసిక చికిత్స కేంద్రం’ అని బోర్డ్‌పై రాసి ఉన్న హాస్పిటల్‌లోకి రెండు దోమలు వెళ్లాయి.
‘‘ఇంతకీ ఏమిటి మీ సమస్య?’’ డాక్టర్ దోమ ఆడదోమను అడిగింది.
‘‘సమస్య నాకు కాదు...మా ఆయనకు’’ అన్నది ఆడదోమ.
‘‘చూస్తే దుక్కలా ఉన్నాడు. ఏమిటి సమస్య!’’ అని గోడ కూలినట్లు నవ్వింది డాక్టర్ దోమ.
‘‘మా ఆయన రెండు వారాల పాటు టూరు వెళ్లారండీ. అప్పటి నుంచి చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన తొడకొడుతున్నారు. మీసం మెలేస్తున్నారు. ఒక దగ్గర రెండు దోమలు కనబడితే చాలు ఉపన్యాసమిస్తున్నాడు. ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు....’’ చెప్పుకుంటూ పోయింది ఆడదోమ.
డాక్టర్ దోమకు ఏమీ అర్థం కాలేదు.
కాసేపు స్కెతస్కోప్‌తో తలకొట్టుకొని ఆలోచించింది.
ఏమీ స్ఫురించలేదు.
లైబ్రరీకి వెళ్లి సీరియస్‌గా బుక్స్ తిరిగేసి నోట్స్ రాసుకొని వచ్చింది.
‘‘అయ్యా! హాస్పిటల్‌కు వచ్చి అరగంటవుతోంది. ఇంతవరకు సమస్య ఏమిటో చెప్పలేదు’’ అసహనంగా అన్నది ఆడదోమ.
‘‘దాని గురించే ఆలోచిస్తున్నాను’’ అని పెన్నును నుదుటి మీద చిన్నగా కొట్టుకుంటూ ఆలోచించసాగింది డాక్టర్ దోమ.
‘‘అయ్యా కేసు నన్ను టేకప్ చేయమంటారా?’’ ఆతృతతో అడిగింది కంపౌండర్ దోమ.
‘‘చేసి చావు...’’ అని నిద్రలోకి జారింది డాక్టర్ దోమ.
‘‘ఏమయ్యా ఇలా వచ్చి కూర్చో’’ అని ఆర్డరేసింది కంపౌడర్ దోమ.
‘‘అలాగే’’ అంటూ బుద్ధిగా కూర్చుంది మగదోమ,
‘‘ఏమయ్యా...నీ పేరేమిటి?’’ అడిగింది కంపౌండర్ దోమ.
‘‘దోసకొండ దోమప్ప... అందరూ ముద్దుగా దోదో అని పిలుస్తారు’’ అని చెప్పింది మగదోమ.
‘‘చూడు దోదో...ఇప్పుడు నేను నిన్ను ట్రాన్స్‌లోకి తీసుకువెళతాను. ఓకేనా!’’ అడిగింది కంపౌండర్ దోమ.
‘‘ఓకే’’ అన్నది దోదో.
‘‘ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్లు మూసుకుంటున్నావు.
నీకు చెవులు ఉన్నాయి... కానీ నేను మాట్లాడింది తప్ప ఏ సౌండూ నీకు వినబడడం లేదు.
నీకు మైండ్ ఉంది. కానీ నేను చెప్పిందాన్ని గురించి తప్ప దేని గురించి...అది ఆలోచించడం లేదు.
వెళుతున్నావు....
లోలోనికి వెళుతున్నావు.
నీదైన ప్రపంచంలోకి...
ఇప్పుడు చెప్పు...అసలు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?’’ అడిగింది కంపౌడర్ దోమ.
‘‘పని మీద బిహార్‌కు వెళ్లానండి. అక్కడ ఎలక్షన్ హడావిడి కనిపించింది. ఒకరోజు బిహార్‌లో ఒకచోట బాగా ఆకలైంది. ఎటుచూసినా చెట్టుచేమలే తప్ప మనుషుల జాడ కనిపించలేదు. దూరంగా ఏదో చప్పుడు వినిపిస్తే వేగంగా అటు వెళ్లాను. అక్కడ ఎన్నికల సభ జరుగుతోంది.
నాయకుడు మాంచి జోరుమీద ఉన్నాడు.
‘‘మీ కోసం నా ప్రాణం ఇస్తాను’’ అంటున్నాడు.
‘‘ప్రాణం ఎందుకుగానీ...రక్తం ఇవ్వు చాలు’’ అని వెళ్లి కుట్టాను. దీంతో నా మైండ్ దెబ్బతింది. నేనేమి మాట్లాడుతున్నానో....నాకే తెలియడం లేదు.’’ అని అసలు విషయం చెప్పింది దోదో!!
2
సుబ్బారావు అప్పారావుకు లక్షరూపాయలు అప్పు ఇచ్చాడు. కాని అప్పారావు ‘ఇదిగో అదిగో’ అంటున్నాడే తప్ప అప్పు తీర్చడం లేదు. విసుగెత్తిన సుబ్బారావు ఒక లాయర్ దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు.
‘‘అప్పారావుకు లక్ష రూపాయాలు అప్పు ఇచ్చినట్లు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా?’’ అడిగాడు లాయర్.
‘‘లేదు’’ అని భోరుమన్నాడు సుబ్బారావు.
‘‘అయితే ఇలా చెయ్’’ అని సుబ్బారావు చెవిలో ఏదో చెప్పాడు లాయర్.
పావుగంటలోనే సుబ్బారావుకు గట్టి సాక్ష్యం దొరికింది.
‘‘భేతాళా! ఈరోజు నేను నిన్ను కొచ్చెన్ అడుగుతాను. ఇంతకీ లాయర్ అతడి చెవిలో ఏం ఊదాడు?’’ అడిగాడు విక్రమార్కుడు.
భేతాళుడు చెప్పిన జవాబు:
సుబ్బారావు అప్పారావుకు ఫోన్ చేసి...‘‘నీకు అప్పుగా ఇచ్చిన అయిదు లక్షలు నాకు అర్జంటుగా కావాలి’’ అన్నాడు.
‘‘అయిదు లక్షలా...ఏం మాట్లాడుతున్నావు సుబ్బారావు. మతిగానీ పోయిందా’’ మండిపడ్డాడు అప్పారావు.
‘‘నువ్వు ఇలా మరిచిపోతే ఎలా అప్పారావు! అక్షరాల అయిదు లక్షలు ఇచ్చా’’ అన్నాడు సుబ్బారావు.
‘‘నువ్వు నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఇంతకంటే నువ్వు ఒక్క పైసా నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’అన్నాడు అప్పారావు.
‘‘అంటే నువ్వు తీసుకుంది లక్షరూపాయలేనంటావు’’
‘‘కచ్చితంగా లక్షరూపాయలే’’
‘ఓకే’అంటూ ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. అప్పారావు వాయిస్ రికార్డయింది. ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది!
– యాకుబ్ పాషా
దోదో!
Published Sun, May 12 2019 12:23 AM | Last Updated on Sun, May 12 2019 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment