మన దేశంలో అంతూ దరీ లేకుండా పెరిగిపోతున్న నల్లడబ్బు ప్రస్తావన అప్పుడ ప్పుడు చర్చల్లోకి రావడం, ఆ తర్వాత కనుమరుగవడం రివాజుగా మారింది. నల్లడబ్బు మాత్రం దాని తోవన అది పెరుగుతూనే ఉంది. దీని మూలాలు ఎన్నికల్లో ఉన్నాయని, అక్కడ సరిచేయనిదే నల్లడబ్బును అరికట్టడం అసాధ్యమని ఎందరో మేధావులూ, నిపుణులూ చెబుతూనే ఉన్నా వినేదెవరు? ఇప్పుడు తాజాగా కలకలం సృష్టిస్తున్న ఛత్తీస్‌గఢ్ టేపులు మన ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్నీ, మన రాజకీయ పార్టీల భ్రష్టత్వాన్నీ మరోసారి తేటతెల్లం చేశాయి.
ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ఇప్పుడు తెలియనిదెవరికీ లేదు. పెరిగిన సాంకేతికత పుణ్యమా అని నాలుగు గోడల మధ్యా, ఇద్దరు వ్యక్తులమధ్యా, రెండు ఫోన్ల మధ్యా ఏం నడిచిందో బట్టబయలవుతోంది. రెండు నాల్కల నేతల్ని వీధుల్లోకి ఈడుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుడు అసెంబ్లీకి జరిగిన ఒక ఉప ఎన్నిక సందర్భంగా తెరవెనక నడిచిన తంతునంతా తాజా టేపులు పూసగుచ్చినట్టు చెబుతున్నాయి. ఇందులో ప్రమేయం ఉన్నది నిరంతరం నువ్వా, నేనా అని తలపడుతున్నట్టు కనబడే బీజేపీ, కాంగ్రెస్‌లు కావడం ఒక విశేషమైతే...ఆ సంభాషణలన్నీ కోట్ల రూపాయల చుట్టూ గిరికీలు కొట్టడం మరో కీలకమైన అంశం. వీటికన్నా ముఖ్యమే మంటే అవతలి ఫోన్‌లో బీజేపీకి చెందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అల్లుడు డాక్టర్ పునీత్ గుప్తా ఉంటే...ఇవతలి ఫోన్‌లో కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్‌జోగి ఉన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేసి, చివరి నిమిషంలో బరినుంచి తప్పుకున్న మంతూరాం పవార్ అనే ఆసామి కూడా ఈ బేరసారాల్లో పాల్గొన్నారు.
ఉప ఎన్నిక జరిగిన అంతాగఢ్ నియోజకవర్గం కాంకేర్ జిల్లాలో ఉంటుంది. అది ఏదో సాధారణ నియోజకవర్గం కాదు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ‘రెడ్ కారిడార్’ బస్తర్‌లోనిది. కాబట్టి పోలీసు పరిభాషలో అది ‘అత్యంత సమస్యాత్మక ప్రాంతం’. కనుక అక్కడ జరిగే ఉప ఎన్నికకు మావోయిస్టులనుంచి ముప్పు వాటిల్ల కూడదన్న ఉద్దేశంతో భారీయెత్తున బలగాలను మోహరించారు. మొత్తం 202 పోలింగ్ కేంద్రాల్లో 190 కేంద్రాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇంతమంది ఇన్నివిధాల కృషి చేస్తుండగా ప్రధాన పార్టీల నేతలు బేరసారాలు జరుపుకొని దాన్ని కాస్తా భ్రష్టుపట్టించారని టేపుల్నిబట్టి అర్ధమవుతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అజిత్‌జోగికి అప్పట్లో కొత్తగా పీసీసీ అధ్యక్షుడైన భూపేష్ బాఘెల్‌తో సరిపడదు. ఈ ఉప ఎన్నికలో మంతూరాం ఉపసంహరించుకుంటే భూపేష్ ఇబ్బందుల్లో పడతారన్నది జోగి వ్యూహం. మంతూరాం ఉపసంహరించుకోనట్టయితే బీజేపీ అభ్యర్థి ఓటమి పాలై తన పలుకుబడి తగ్గుతుందేమోనని రమణ్‌సింగ్‌కు బెంగ. 2003, 2008 ఎన్నికల్లో బస్తర్ ప్రాంతంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు గెల్చుకున్న బీజేపీ 2013 ఎన్నికల్లో క్షీణించింది. ఆ పార్టీ కేవలం నాలుగే సీట్లు గెల్చుకుంది. అందులో ఒకరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ స్థానం కూడా కోల్పోతే పరువు పోతుందేమోనన్న చింతతో కాంగ్రెస్ అభ్యర్థిని తప్పించారు. తమ అభ్యర్థికి ముఖ్యమంత్రి డబ్బు ఎరజూపి పోటీనుంచి ఉపసంహరింపజేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. అజిత్‌జోగి అయితే మరో అడుగు ముందుకేసి దీనికి బాధ్యతవహించి పీసీసీ అధ్యక్షుడు తప్పుకోవాలని డిమాండ్ చేశారు! ఈ ఎత్తుగడల మాటెలా ఉన్నా మంతూరాం ఉపసంహరిం చుకోవడానికి కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఫోన్ సంభాషణలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల్లో ధనప్రవాహాన్ని కట్టడి చేసి, వాటికి కాస్త విశ్వసనీయత కల్పించాలని ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అనేక రకాల చర్యల్ని అమల్లో పెడుతోంది. దాని పని అది చేసుకుపోతుంటే పార్టీలు మాత్రం యథాప్రకారం వాటికి తూట్లు పొడుస్తున్నాయని తరచు రుజువవు తోంది. నిరుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు భారీమొత్తంలో డబ్బు ఎరజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కెమెరాలకు దొరికిపోయారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నారని బహిరంగసభల్లో తరచుగా ఆక్రోశించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వ్యవహారానికి సూత్రధారని రేవంత్‌రెడ్డి జరిపిన సంభాషణల్లో వెల్లడైంది. రెండేళ్లక్రితం బీజేపీ నాయకుడు స్వర్గీయ గోపీనాథ్ ముండే ఒక సభలో మాట్లాడుతూ 2009 లోక్‌సభ ఎన్నికల్లో తనకు రూ. 8 కోట్లు ఖర్చయిందని నోరుజారారు. నిబంధనల ప్రకారం ఆయన రూ. 25 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఆ ఎన్నికలు పూర్తయ్యాక తన ఎన్నికల వ్యయం రూ. 19, 36,922 అని చూపుతూ అప్పట్లో ఆయన ఎన్నికల సంఘానికి నిబంధనల ప్రకారం లెక్కలు కూడా సమర్పించారు.
కానీ సభలో నిజమేమిటో చెప్పి నాలిక కరుచుకున్నారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరని చెప్పుకుంటున్నా ఇలా ఎవరికి వారు ఎన్నికలను ప్రహసనప్రాయంగా మారు స్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడం, అధికారం చేజిక్కిం చుకుని వచ్చే ఎన్నికల కోసం మరింత వెనకేయడం మన దేశంలో ఆనవాయితీ అయిపోయింది. ఈ నాయకులే మళ్లీ వేదికలెక్కి ధన ప్రవాహం గురించి గంభీరమైన ఉపన్యాసాలిస్తుంటారు. ఈ పరిస్థితి మారాలి. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దీన్ని చూసీచూడనట్టు వదిలేయక తమ తమ పార్టీల్లో జరిగిందేమిటో, అందుకు బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలకు ఉపక్రమించాలి. అవినీతికీ, డబ్బు రాజకీయాలకూ తాము వ్యతిరేకమని నిరూపించుకోగలగాలి. ఎన్నికల సంఘం కూడా దీనిపై దృష్టి సారించి కారకులను దండించాలి.
ఛత్తీస్‌గఢ్‌లో ఫిక్సింగ్!
Published Sat, Jan 2 2016 12:38 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement