సాక్షి, హైదరాబాద్ : దేశంలో ప్రతి పౌరుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమీర్‌పేటలో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ మాతృభాష నేర్చుకోవాలని.. మాట్లాడాలని సూచించారు. తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోవద్దని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతారని.. అర్థం చేసుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 1935లో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపితమైందని, దీని ద్వారా అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని తెలిపారు. హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment