
న్యూఢిల్లీ: హిందీని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా నిర్ణయాన్ని అన్ని దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా షా వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో జాతీయ భాషగా హిందీ అంశంలో అమిత్ షా వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలను వదిలి హిందీని జాతీయ భాషగా మార్చాలని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని నేను ఎప్పుడు అనలేదు. కాకపోతే మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించాను. నేను నాన్ హిందీ రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వాడినే కదా. కానీ కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారు. ఇక దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అన్నారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బలవంతంగా తమ మీద హిందీని రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
(చదవండి: షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్..)
Comments
Please login to add a commentAdd a comment