థాయ్‌ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి.. | Molestation Attempted On Thai student At HCU | Sakshi
Sakshi News home page

థాయ్‌ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లిన

Published Sun, Dec 4 2022 3:54 AM | Last Updated on Sun, Dec 4 2022 9:06 AM

Molestation Attempted On Thai student At HCU - Sakshi

హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన, ప్రొఫెసర్‌ రవిరంజన్‌

గచ్చిబౌలి (హైదరాబాద్‌):  హిందీ భాష నేర్చుకునేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వచ్చిన థాయ్‌లాండ్‌ విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్‌ అత్యాచార యత్నం చేశాడు. హిందీపాఠాలు నేర్పి స్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించాడు. వర్సిటీలో బాధితురాలితోపాటు చదివే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్లు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించడంతో ధర్నా విరమించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు వెల్లడించారు. 

హిందీ నేర్పిస్తానంటూ.. 
థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థిని (24) హెచ్‌సీయూలో ఎంఏ హిందీ చదువుతోంది. 25రోజులుగా హెచ్‌సీయూలోని ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ హస్టల్‌లో ఉంటోంది. వర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్‌ రవి రంజన్‌ ఆమెపై కన్నువేశాడు. హిందీ నేర్పిస్తానని, తన నివాసానికి రావాలని కోరాడు. శుక్రవారం క్లాసులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకుని మసీదుబండ ప్రాంతంలోని తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు.

పాఠాలు చెప్తూ కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి థాయ్‌లాండ్‌ విద్యార్థినికి ఇచ్చాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. వెంటనే థాయ్‌లాండ్‌లోని ప్రొఫెసర్‌కు ఫోన్‌ చేసి రవి రంజన్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం చెప్పింది. థాయ్‌లాండ్‌ ప్రొఫెసర్‌ వెంటనే రవి రంజన్‌కు ఫోన్‌ చేసి విద్యార్థినిని వదిలేయాలని తీవ్రంగా మందలించాడు. దీనితో భయపడిన రవి రంజన్‌.. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినిని వర్సిటీ హస్టల్‌ సమీపంలో వదిలివెళ్లిపోయాడు.

బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెంటనే వర్సిటీ క్యాంపస్‌లోని హెల్త్‌ సెంటర్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అసొసియేట్‌ ప్రొఫెసర్‌ అలోక్‌ మరో ఇద్దరు హెల్త్‌ సెంటర్‌ వద్దకు వచ్చారు. అయితే థాయ్‌ విద్యార్థినికి హిందీ, ఇంగ్లిష్‌ రాకపోవడంతో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయింది. దీనితో వారు థాయ్‌ ప్రొఫెసర్‌ సాయంతో ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్టు తెలుసుకున్నారు. దీనిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. థాయ్‌ విద్యార్థిని స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశామని, షాక్‌లో ఉన్న ఆమె తేరుకున్నాక మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తామని.. అవసరమైతే సెక్షన్లు మార్చుతామని మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. 

అట్టుడికిన క్యాంపస్‌ 
ప్రొఫెసర్‌ రవిరంజన్‌ ఘాతుకం తెలిసిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ ప్రధాన ద్వారం లోపల స్టూడెంట్‌ యూనియన్, ఏబీవీపీ ధర్నాకు దిగాయి. ప్రొఫెసర్, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ తీరును నిరసిస్తూ ఆందోళన చేశాయి. హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ దేవేశ్‌ నిగమ్, వీసీ సర్రాజు, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్‌ రవి రంజన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై వర్సిటీ స్వయంగా ఫిర్యాదు చేస్తుందని హమీ ఇచ్చారు. దీనితో విద్యార్థి సంఘాలు ధర్నా విరమించాయి. 

మహిళా సాధికారత ఉపన్యాసంతో! 
థాయ్‌ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రొఫెసర్‌ రవి రంజన్‌ ఇటీవల మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదంటూ మండిపడ్డారు. పోలాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన రవి రంజన్‌.. 2018లో హెచ్‌సీయూలో చేరినట్టు చెప్తున్నారు. 

బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం 
హెచ్‌సీయూకు ఇప్పటివరకు మంచిపేరు ఉంది. కానీ ప్రొఫెసర్‌ రవి రంజన్‌ చర్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. థాయ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. అప్పటిదాకా పోరాడుతాం. 
– అభిషేక్‌ నందన్, హెచ్‌సీయూ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు 

రవి రంజన్‌పై కఠిన చర్యలు చేపట్టాలి 
ప్రొఫెసర్లను తండ్రులుగా, అన్నలుగా భావిస్తారు. అలాంటి వారు కంచే చేను మేసినట్టుగా అత్యాచార యత్నం చేయడం సిగ్గుచేటు. ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్సిటీలోని వేధింపుల సెల్‌లో మూడు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇలాంటి వేధింపుల కేసులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలి. 
– మహేశ్‌ నమాని, ఏబీవీపీ నేషనల్‌ కన్వీనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement