చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.
బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు.
తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ
హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు.
ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు.
అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే
బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్‌స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు.
పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి
దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment