సొంత భాషలకు సాంత్వన | Own languages, to comic relief | Sakshi
Sakshi News home page

సొంత భాషలకు సాంత్వన

Published Wed, Sep 17 2014 11:33 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

సొంత భాషలకు సాంత్వన - Sakshi

సొంత భాషలకు సాంత్వన

 రాజ్యాంగం నిర్దేశించిన త్రిభాషా సూత్రాన్ని కూడా ఖాతరు చేయకుండా హిందీ భాష వ్యాప్తి మీదే ఆయా ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే హిందీయేతర భాషల ఉనికిని ఇబ్బందులలోకి నెట్టింది. స్థానిక భాషలను విద్యా సంస్థలలోనూ నిర్లక్ష్యం చేయడం పరిపాటి అయింది.
 
‘ప్రతీ రెండు వారాలకు ఒక భాష వంతున కనుమరుగైపోతున్న దశలో నేడు మనం ఉన్నాం. ఒక భాషను- తల్లి భాషను కోల్పోవడమంటే దాని ఉనికిపైనే ఎదిగిన యావత్తు విజ్ఞాన సంపదను పోగొట్టుకోవడమే. మనం ఒక భాషను చేజార్చుకోవడమంటే దానిని అంటి పెట్టుకుని పెరుగుతూ వచ్చిన స్థల, కాలాల పరిజ్ఞానం గురించీ, శతాబ్దాలుగా తృష్ణను పెంచుతున్న భావ సంపదనూ కోల్పో వడమే. ఒక భాషను కోల్పోవడమంటే శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా మాన వుడు రుతువుల గురించీ, సాగర సంపదను గురించీ, వృక్ష, జంతుజాలాల గురిం చీ, ఫలపుష్పాదుల గురించీ, ప్రకృతి నియమాలను క్రమబద్ధం చేసిన వైజ్ఞానిక, గణిత, తాత్విక సంపదలను గురించి... ఒకటేమిటి? దృశ్యాదృశ్యమైన సకల సంపదనూ కోల్పోయినట్టే. భాష చచ్చిపోతే అక్షరాలు నిలబడవు. అవి లేనప్పుడు అర్థాలు చూపే పదకోశాలు ఉండవు. పదాలు జారిపోతే పద్యం ఉండదు. చదివేవాడు లేకపోతే తల్లిభాషలో పాఠమూ ఉండదు. ఒక సమాజం తన భాషే తన పురోగతికి ఆటంకమై పోయిందని నిర్ణయించుకున్నపుడు కూడా భాషల ఉనికే ప్రమాదంలో చిక్కుకుంటుంది.’ నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ (లివింగ్‌టంగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్‌డేంజర్డ్ లాంగ్వేజెస్ సంయుక్త సర్వేక్షణ నివేదిక)

రాష్ట్రాల అధికార (మాతృ) భాషల ప్రస్తుత ప్రతిపత్తిని గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల ఏడున వెలువరించిన తీర్పు గురించి చాలా మందికి తెలిసే ఉండాలి. దేశ ప్రజలకు భాషల ఎంపికలో సంపూర్ణ స్వేచ్ఛ ఉందనీ, ఆయా రాష్ట్రాలలో ఉండే  స్థానిక భాషలను ప్రజల సౌకర్యార్థం అధికార భాషలుగా ప్రకటించుకుని, అమలు చేసుకునే హక్కు ఉందనీ ఆ తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, సైన్‌బోర్డులకు ఆ భాషనే ఉపయోగించాలి. కానీ  రాష్ట్రాల అధికార భాషలనూ, ముఖ్యంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ గుర్తించిన భాషలనూ విద్య, పాలనా వ్యవహారాలలో విరివిగా ప్రవేశపెట్టి ప్రజలకు ప్రయో జనం చేకూర్చవలసిన దశలో హైకోర్టులూ, సుప్రీంకోర్టూ వివిధ సందర్భాలలో చేసిన ప్రతికూల వ్యాఖ్యలు, తీర్పుల ఫలితంగా వాటిలో ఏకాభిప్రాయం కరువై గందర గోళం ఏర్పడింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇదే పరిస్థితి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పలు రాజకీయ పార్టీల వ్యవహార సరళి కూడా ఇందుకు దోహదం చేసింది. విద్య, పాలనా రంగాలలో మాతృభాష ప్రాధా న్యాన్ని హిందీ భాషా ప్రయోజనాల త్రాసుతో తూచే పద్ధతిని ఆయా కేంద్ర ప్రభుత్వాలు తెచ్చాయి. కానీ 120 కోట్ల భారతీయులలో హిందీ మాట్లాడేవారు 45 కోట్లు మాత్రమే. అయినా రాజ్యాంగం నిర్దేశించిన త్రిభాషా సూత్రాన్ని కూడా ఖాతరు చేయకుండా హిందీ భాష వ్యాప్తి మీదే ఆయా ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే హిందీయేతర భాషల ఉనికిని ఇబ్బందులలోకి నెట్టింది. స్థానిక భాషలను విద్యా సంస్థలలోనూ నిర్లక్ష్యం చేయడం పరిపాటి అయింది. ఆఖరికి హైకోర్టు, కింది స్థాయి న్యాయస్థానాలలో కూడా మాతృభాషను వినియోగించకుండా కక్షిదారులు తమ మీద అభియోగాలను తమకు తెలిసిన భాషలో తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు.

హైకోర్టుల సంగతి అటుంచి, కింది కోర్టులలో (సివిల్, క్రిమినల్) వాద ప్రతివాదాలూ, తీర్పులూ మాతృభాషలలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక ఆదేశాలు (జీవో నం. 485, సం.1974) ఇచ్చి 30 ఏళ్లు గడచిపోతున్నాయి. కానీ ఇంతవరకు వాటి అతీగతీ లేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఏ సందర్భంగా వెలువరిం చిందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాల విభజన సమయంలో రాష్ట్రపతి ఒక భాషను అధికార భాషగా ప్రకటించాలన్న నిబంధన ఉన్నంత కాలం మాతృ భాషలకు పూర్తి న్యాయం జరిగే అవకాశం లేదు. రాష్ట్రాలు అమలు చేయవలసిన భాషను గురించి రాష్ట్రపతి ‘సంతృప్తికి లోబడే’ అధికార భాషగా ప్రకటించాలన్న నిబంధన అది. 1951 నాటి ఉత్తర ప్రదేశ్ అధికార భాషా చట్టానికి ఒక సవరణ (1989) వచ్చింది. ఈ సవరణ చెల్లదని ఉత్తర ప్రదేశ్ సాహిత్య సమ్మేళన్ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారించిన తరువాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రాలలో అధికార భాషను అమలు జరిపేందుకు శాసనసభలకు అధి కారం ఉందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. తన నిర్ణయం రాజ్యాంగం లోని 345 అధికరణకు లోబడి ఉన్నదేనని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికార కార్యకలాపాలకు ఒకటి లేదా అంతకు మించి భాషలను వినియోగించుకునే అంశం మీద శాసనసభలు నిర్ణయం తీసుకోవచ్చునని ఆ అధికరణం చెబుతోంది.

ఇంతకూ 345 అధికరణంలో కనిపించే  ‘హిందీ’ ప్రస్తావన రాష్ట్రాల మధ్య అనుసంధానంగా వినియోగించుకోవడానికి సంబంధించినదేగానీ, ఆయా రాష్ట్రాలలో ఉన్న స్థానిక భాషలను శాసించేందుకు కాదని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోథా అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం వివరణ కూడా ఇచ్చింది. ఈ దృష్ట్యా యూపీ శాసనసభ అధికార భాష హిందీతో పాటు, ఉర్దూను రెండవ అధికార భాషగా (మన రాష్ట్రంలో మాదిరిగానే) ప్రవేశపెడుతూ తెచ్చిన సవరణ (1989) సబబేనని సుప్రీం పేర్కొన్నది. అలాగే  ప్రభుత్వ సర్వీసుల (పబ్లిక్ సర్వీస్ కమిషన్) కమిషన్ నిర్వహించే పరీక్షలలో తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు 5 శాతం ఉద్యోగాలు కేటాయించా లంటూ వచ్చిన పిటిషన్‌ను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ దీనిని తెలుగేతర అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ కేసులో స్థానిక విద్యార్థుల దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి స్థానికులు నష్టపోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఐదు శాతం ఉద్యోగాలను కేటాయించా లని నిర్ణయించినప్పటికీ అక్కడి హైకోర్టు కొట్టివేసింది. దీనిని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. కన్నడ మాతృభాషగా ఉన్న పిల్లలకు 1 నుంచి 4వ తరగతి వరకు ఆ భాషలోనే బోధించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు నిరాకరించే ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని కూడా ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రైవేటు యాజమాన్యాలు సుప్రీంకోర్టులో సవాలు చేసి, కొట్టివేయించాయి. దీనితో కర్ణాటక ప్రభుత్వం రూటు మార్చి ‘గ్రామీణాభివృద్ధి పథకం’ కింద విద్యార్థులకు వెసులుబాటుగా కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు 5 శాతం ఉద్యోగాలను కేటాయిస్తూ జీవోలు జారీ చేసింది.  అయితే ఇప్పుడు రాష్ట్రాల అధికార భాషలను నిర్ణయించే హక్కు ఆయా శాసనసభలకు ఉందంటూ ఇచ్చిన తీర్పు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్థానిక భాషలకు అధికార భాషలుగా చలామణీ అయ్యే అవకాశాన్ని మెరుగు పరిచింది.

స్థానిక భాషల వినియోగంలో తలెత్తిన గందరగోళానికి లా కమిషన్ కూడా కొంత వరకు బాధ్యత వహించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఇంగ్లిష్‌కు తప్ప ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వరాదని ఆ కమిషన్ భావన. నిజానికి రాజ్యాంగం చలామణీలోకి వచ్చిన పదిహేనేళ్ల తరువాత రాష్ట్రాల మాతృభాషల ప్రతిపత్తిని సమీక్షించేందుకు జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి విధిగా నియమించాలన్న ఆదేశం వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి కేంద్రం రాసిన లేఖలో (30.8.2007) పేర్కొన్నది. కానీ 1955లో తొలి కేంద్రీయ అధికార భాషా సంఘం ఏర్పడిన తరువాత 1960 ఏప్రిల్‌లో ఏర్పడవలసిన రెండో కేంద్రీయ అధికార భాషా సంఘం అసలు వెలుగు చూడకుండానే జాగ్రత్త పడ్డారు. జాతీయ అధికార భాషగా హిందీని రాష్ట్రాలపై రుద్దే వెంపర్లాటలోనూ, అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌ను ప్రోత్సహించే అత్యుత్సాహంలోనూ స్థానిక భాషల విస్తృతిని కుంటు పరిచారు. శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుకు కూడా అదే గతి పట్టించారు. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లలో అల హాబాద్, జబల్పూర్, పాట్నా, జోధ్‌పూర్ హైకోర్టులలో మాత్రం హిందీని అనుమతించడం దీనికి కొసమెరుపు. ఇది కూడా మన అధికార భాషా సంఘానికి కేంద్ర హోంశాఖ రాసిన లేఖ ద్వారానే బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశాజనకమైనదే.

 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఏబీకే ప్రసాద్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement