షార్ట్ ఫిలింలో రవీనా టాండన్
బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పేయి, రవీనా టాండన్ ఓ షార్ట్ ఫిలింలో నటించారు. దేశ స్వాతంత్ర్య గొప్పదనాన్ని వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిం తీశారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపోయి ఉంటే ప్రస్తుతం మన జీవితాలు ఎలా ఉండేవి? 1940 నాటి పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండేవా? స్వాతంత్ర్యం రాకుంటే ఇప్పటికీ మన బతుకులు దుర్భరంగా ఉండేవి.. ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వచ్చేది.. మన దేశంలో మనకే గౌరవం ఉండేది కాదు.. బ్రిటిషర్ల కింద బానిసలుగా బతికేవాళ్లం.. ఈ ఊహాజనిత పరిస్థితులకు అద్దం పట్టేలా షార్ట్ ఫిలింను రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చాక మన భద్రత, సమాజంలో లభిస్తున్న గౌరవం వంటి విషయాలను తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తూ.. వారి త్యాగఫలం వల్లే మనం 'రెస్టారెంట్లలోకి భారతీయులకు, కుక్కులకు ప్రవేశం లేదు' అన్న బోర్డులు చూసే దుస్థితి రాలేదని 6 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిలింలో చక్కగా చూపించారు.