విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్‌పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది.
అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్‌పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్‌పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది.
1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!)
– పగుడాకుల బాలస్వామి, వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్
(వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment