‘వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. డబ్బు లేదు’ అనే వాళ్లలో చాలామందికి ఐడియా ఉండదు. అంటే... ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి... మొదలైన విషయాలపై అవగాహన ఉండదు. ‘అద్భుతమైన ఐడియా’ మన దగ్గర ఉంటే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి అనేది పెద్ద సమస్య కాదని యువతరంలో ఎంతోమంది నిరూపించారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ నుంచి ‘ఇండియన్ స్టార్టప్ స్టోరీస్’ లాంటి ఎన్నో టీవీ షోల ద్వారా స్ఫూర్తి పాంది ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని కలలు కంటున్న యువతరం ఆ కల దగ్గరే ఆగిపోవడం లేదు. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా కష్టపడుతున్నారు...
‘షార్క్ ట్యాంక్ అమెరికా కార్యక్రమాన్ని ఇష్టంగా చూసేదాన్ని. డల్లాస్ మావరిక్స్ ఓనర్ మార్క్ క్యూబన్, బ్రాక్ సిస్టమ్స్ ఫౌండర్ రాబర్ట్ హర్జెవెక్, ఫర్ యువర్ ఈజీ వోన్లీ ఫౌండర్, ప్రెసిడెంట్ లారీ గ్రైనర్‌లు ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్‌లు కావడానికి సహాయం అందించారు. షార్క్‌ట్యాంక్ ఇండియన్ వెర్షన్ విషయంలో మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత మాత్రం ఆసక్తి పెరిగింది’ అంటుంది ముంబైకి చెందిన సైకాలజీ స్టూడెంట్ అహానా గుప్తా. ‘ఒక స్టార్టప్ విజయవంతం కావడానికి ఏ అంశాలు తోడ్పడతాయి, మార్కెట్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏమిటి, వెంచర్ క్యాపిటలిస్ట్‌ను ఒప్పించడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి... మొదలైనవి షార్క్ ట్యాంక్‌లాంటి టీవీ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్నాను’ అంటుంది కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ సుతీర్థ సుహా.
‘డిస్కవరీ ప్లస్‌లో ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ చూశాను. చూస్తున్న క్రమంలో నాకు తెలియకుండానే బిజినెస్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ విషయాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది చెన్నైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్’ శ్రేయా ఘోష్. ‘స్టార్టప్‌లకు సంబంధించిన పరిజ్ఞానానికి పెద్ద నగరాలలో చదవాల్సిన పనిలేదని, ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే స్టార్టప్‌లను విజయవంతంగా సృష్టించగలవనే మూస ధోరణిని స్టారప్‌లను దృష్టిలో పెట్టుకొని రూపాందించిన టీవీ కార్యక్రమాలు బ్రేక్ చేస్తున్నాయి’ అంటుంది దిల్లీకి చెందిన స్టాటిస్టిక్స్ స్టూడెంట్ సప్తర్షి. ‘ఒక కంపెనీ ఈక్విటీ, వాల్యుయేషన్‌ను అర్థం చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడతాయి, మార్కెట్ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటీ... వంటివి షార్క్ ట్యాంక్ ద్వారా తెలుసుకున్నాను’ అంటుంది వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ సహేలి సాహు.
అహానా, సుతీర్థ, శ్రేయ, సప్తర్షి, సహేలి మాత్రమే కాదు... ఇంజినీరింగ్, కామర్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్... తాము చదువుతున్నది ఏదైనా సరే దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టూడెంట్స్ స్టార్టప్‌లకు సంబంధించి టీవీలో వచ్చే రకరకాల కార్యక్రమాల ద్వారా ్రపాక్టికల్–లైఫ్ బిజినెస్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ స్ట్రాటజీల గురించి వివరంగా తెలుసుకోవడమే కాదు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. షార్క్ ట్యాంక్ మాత్రమే కాదు బిలియన్ డాలర్ బయర్(వూట్ టీవీ నెట్‌వర్క్), సిలికాన్ వ్యాలీ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ (డిస్కవరీ ప్లస్), స్టార్టప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అప్‌స్టార్స్ (నెట్‌ఫ్లిక్స్), ప్లానెట్ ఆఫ్ ది యాప్స్(యాపిల్ టీవీ). గర్ల్‌బాస్–టీవీ సిరీస్ (నెట్‌ఫ్లిక్స్)... మొదలైన షోలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి.
ది క్వర్కీ నారీ
మదురైకి చెందిన మాళవిక సక్సేనాకు మనసుకు నచ్చిన ఫుట్‌వేర్ కనిపించేది కాదు. ఏది చూసినా ‘ఇది నాకు కరెక్ట్ కాదు’ అనిపించేది. కొత్తదనం లోపించిన ఫుట్‌వేర్‌లను చూసీ చూసీ చివరికి హ్యాండ్–పెయింటెడ్ షూ బ్రాండ్ ‘ది క్వర్కీ నారీ’ని లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్ చేసింది. ఇన్‌ఫ్లూయెన్సర్‌ల సహాయం తీసుకుంది. ‘షార్క్ ఇండియా’లో ‘ది క్వర్కీ నారీ’ 35 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ‘ఎపిసోడ్ ప్రసారం కాగానే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు పదివేల మంది కొత్త ఫాలోవర్‌లు యాడ్ అయ్యారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో అమ్మకాలు బాగా పెరిగాయి’ అంటుంది మాళవిక సక్సేనా.
హార్ట్ అప్ మై స్లీవ్స్
సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన రియాకు ‘ఫ్యాషన్’ అంటే ఇష్టం. ఫ్యాషన్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన కల. 18–33 ఏళ్ల వయసు ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని పదివేల రూపాయల పెట్టుబడితో ‘హార్ట్ అప్ మై స్లీవ్స్’ కంపెనీ మొదలుపెట్టింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో తన ఐడియాను వినిపించిన తరువాత ఇన్వెస్టర్‌లు వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్ నుంచి రూ. 25 లక్షల ఫండ్ అందుకుంది. ‘ఎన్నో డ్రెస్‌లు ఉన్నా ఏది వేసుకోవాలో అనే దాని గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను... అనే మాట చాలా మంది మహిళల నోటి నుంచి విన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్లీవ్స్ ద్వారా ప్రతి డ్రెస్‌కు గ్లామరస్ లుక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారంలో వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్‌లకు ఉన్న అనుభవం, సలహాలు మా వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి అని నమ్ముతున్నాను’ అంటుంది రియా.
కవచ్
‘షార్క్ ట్యాంక్ ఇండియా’లో ఫండ్స్ అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది 13 సంవత్సరాల అనౌష్కా జాలీ. ఆరవ తరగతిలో యాంటీ–బుల్లీయింగ్ స్క్వాడ్(ఎబీఎస్) అనే వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసింది. మూడు సంవత్సరాల పాటు యాంటీ–బుల్లీయింగ్ సెషన్స్ నిర్వహించిన అనౌష్క ఆ తరువాత బుల్లీయింగ్‌పై ఫైట్ చేయడానికి ‘కవచ్’ అనే యాప్‌ను రూపొందించింది. ‘షార్క్ ట్యాంక్’లో ‘కవచ్’ 50 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది.
ఇది చదవండి: దివ్యమైన ఫుడ్‌చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..?
Comments
Please login to add a commentAdd a comment